Akshaykumar : సుధా కొంగర దర్శకత్వం వహించిన ‘సర్ఫిరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్షయ్ కుమార్, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. “ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. దర్శకులు, రచయితలు కొత్తగా ఆలోచిస్తున్నారు. అందువల్లే తెలుగు సినిమాలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. ఇప్పుడు ఏ భాషలో సినిమా చేసినా, దేశం మొత్తం ప్రేక్షకులు చూస్తున్నారు. ఈ కారణాల వల్లే నేను తెలుగు సినిమాల్లో నటించాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని అక్షయ్ తెలిపారు.

‘కన్నప్ప’ తెలుగు సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించిన అక్షయ్, “ఈ సినిమా తర్వాత కూడా నాకు నచ్చే పాత్రలు దొరికితే ఖచ్చితంగా తెలుగులో నటిస్తాను” అని తెలిపారు. చిన్న సినిమాలైనా, కథ నచ్చితే నటిస్తానని చెప్పడం ద్వారా తన ఓపెన్ మైండెడ్‌నెస్‌ను చాటుకున్నారు అక్షయ్. ఏడాదికి ఐదు, ఆరు సినిమాలు చేస్తూ బిజీగా ఉండే ఈ స్టార్ హీరో, టాలీవుడ్‌లోకి రావడానికి సిద్ధంగా ఉండటం తెలుగు సినిమా పరిశ్రమకు శుభవార్తగా చెప్పవచ్చు. అక్షయ్ కుమార్ టాలీవుడ్ ఎంట్రీతో తెలుగు సినిమాల్లో మరింత కొత్తదనం, వైవిధ్యం రావడం ఖాయం.

Leave a comment

error: Content is protected !!