Vijaysethupathi : తమిళనాట, తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది విజయ్ సేతుపతి “మహారాజా” మూవీ. ఈ సినిమా విజయం గురించి నటుడు విజయ్ సేతుపతి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. 55 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న విజయ్ సేతుపతి, ఈ చిత్రాన్ని మరింత మంది ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇంటరాక్షన్ లో విలన్ పాత్రల పోషణ గురించి ఆయన మనసులోని మాటలు బయటపెట్టారు.
“విలన్ పాత్రలు పోషిస్తున్నప్పుడు కొన్ని విషయాలు నాకు నచ్చవు. కథ ఎలా చెబుతున్నారనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది. ఏ కథనైనా చెప్పవచ్చు కానీ దానికి ఖచ్చితంగా ఒక నీతి ఉండాలి. ప్రతినాయకుడి పాత్రకు కూడా కొంత సమర్థన ఉండాలి” అని విజయ్ సేతుపతి అభిప్రాయపడ్డారు. పాత్ర ఎవరినీ బాధించకూడదని ఆయన నొక్కి చెప్పారు. నటులు, దర్శకులకు భిన్నమైన అభిప్రాయాలు, భావోద్వేగాలు ఉండవచ్చని అంగీకరించినప్పటికీ, సినిమా అందరికీ నచ్చేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. “మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు, మూఢనమ్మకాలను ప్రోత్సహించే పాత్రలను పోషించడానికి నేను ఇష్టపడను” అని ఆయన అన్నారు.
“మహారాజా” సినిమా విజయానికి కారణం కేవలం యాక్షన్ మాత్రమే కాదని, కథలోని సందేశం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంచి కథ, నటన, దర్శకత్వం కలిసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.