Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే జోడీగా నాగ్ అశ్విన్ రూపొందించిన ఫాంటసీ అండ్ ఫ్యూచరిస్టిక్ మూవీ “కల్కి 2898 ఎ.డి”. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ బుధవారం రాత్రి ముంబయిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు యువ హీరో రానా దగ్గుబాటి వ్యాఖ్యాతగా వ్యవహరించి, చిత్రబృందం నుండి ఆసక్తికరమైన విషయాలు రాబట్టాడు.
కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రలో నటించగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించారు. అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా ఈ చిత్రం గురించి తమ అభిప్రాయాల్ని తెలిపారు. ఈ చిత్రంలో నటించడం గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ, “ఇది ఓ కొత్త ప్రపంచం. నాకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభవాన్ని ఇచ్చింది. నాగ్ అశ్విన్ ఈ కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. ఏం తాగితే ఇలాంటి ఆలోచనలు వస్తాయా అనిపించింది” అని అన్నారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ, “నా గురువు, మార్గదర్శి బాలచందర్ లాగా అసాధారణమైన మనుషులు చాలా సాధారణంగా కనిపిస్తుంటారు. అందుకే అలాంటివాళ్లతో మాట్లాడేవరకూ వాళ్లపై ఓ అభిప్రాయానికి రాను. సాధారణమైన వ్యక్తిలాగే వచ్చిన నాగ్ అశ్విన్ కథ చెప్పడంలో నేర్పుని చూసి అద్భుతం అనిపించింది” అని అన్నారు.
ప్రభాస్ మాట్లాడుతూ, “నేను కన్న కలల కంటే గొప్పది ఈ సినిమా. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణెలతో కలిసి నటించడం అద్భుతమైన అనుభవం” అని అన్నారు. దీపికా పదుకొణె మాట్లాడుతూ, “ఇందులో నేను తల్లి పాత్రలో కనిపిస్తాను. నాగ్ అశ్విన్ కథ చెప్పినప్పుడు ఇదివరకెప్పుడూ లేని ఓ కొత్త అనుభవం కలిగింది” అని అన్నారు. ఈ వేడుకలో భాగంగా, మొదటి టికెట్ ను అమితాబ్ బచ్చన్ కొని, కమల్ హాసన్ కు అందించారు. ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.