‘హనుమాన్’ సినిమా విజయంతో యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారుమ్రోగుతోంది. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం తర్వాత, ప్రశాంత్ ఒక ప్రత్యేకమైన యూనివర్స్ ను నిర్మించుకునే పనిలో ఉన్నాడు. ఈ యూనివర్స్ ను ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ అని పిలుస్తారు.
ఇందులో భాగంగా ఇప్పుడు ‘హనుమాన్’ కి సీక్వెల్ ‘జై హనుమాన్’ రూపొందుతోంది. మొదటి భాగాన్ని ప్రీక్వెల్ గా తీసుకుంటే, రెండో భాగాన్ని సీక్వెల్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) లో చేరాలనుకునే ఔత్సాహికులను ప్రశాంత్ వర్మ ఆహ్వానిస్తున్నాడు.
‘నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఎడిటర్లు, గ్రాఫిక్స్ డిజైనర్లు, రచయితలు, ఫ్యాషన్ డిజైనర్లు ఇలా అందరికీ ఈ అవకాశం వర్తిస్తుంది. మీ టాలెంట్ ను ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. మీ వివరాలు మరియు టాలెంట్ కి సంబంధించిన డేటాను మా మెయిల్ అడ్రెస్ కు పంపించండి’… అంటూ ప్రకటించాడు. ప్రశాంత్ వర్మ కూడా ఒక సాధారణ నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తి. అందుకే, టాలెంట్ ఉన్న వారికి ఒక మంచి వేదికను కల్పించాలని నిర్ణయించుకున్నాడు.