అతడే శ్రీమన్నారాయణ, చార్లీ 777 లతో తెలుగు ఆడియెన్స్‌కు కూడా పరిచయమైన వ్యక్తి రష్మికతో లవ్ బ్రేకప్ తర్వాత ఫామ్‌లోకొచ్చిన రక్షిత్.. ఇప్పుడు సప్తసాగరాలు దాటి అనే మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులతో సినిమా విశేషాలు పంచుకున్నారు.
“దర్శకుడు హేమంత్ తో ఇది నాకు రెండో సినిమా. తన మొదటి సినిమా ‘గోధి బన్న సాధారణ మైకట్టు‘లో నేను నటించాను. తన రెండో సినిమా కూడా నాతో చేయాలి అనుకున్నారు. కానీ అప్పుడు నేను ‘అతడే శ్రీమన్నారాయణ‘తో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఇప్పుడు మూడో సినిమాకి ఇలా కుదిరింది.
షూటింగ్ సమయంలో ప్రధాన పాత్రలు మను–ప్రియ మధ్య కెమిస్ట్రీ చూసి హేమంత్ రెండు భాగాలుగా చెప్పాలి అనుకున్నారు. హేమంత్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉంటారు, ఏం చేయాలో క్లారిటీ ఉంటుంది. అయినప్పటికీ షూటింగ్ సమయంలో ఇంకా ఏమైనా మెరుగుపరచగలమా అని ఆలోచిస్తూనే ఉంటారు. అలా కొంత భాగం షూటింగ్ అయ్యాక రెండు భాగాలుగా విడుదల చేయాలని ఆయన భావించారు.
కర్నాటకలో తెలుగు చిత్రాలకు విశేష ఆదరణ ఉంటుంది. చిన్నప్పుడు తెలుగు సినిమాలు విడుదలైన కొన్ని నెలల తర్వాత వీసీఆర్ టేపుల్లో చూసేవాన్ని. ఇంజనీరింగ్ రోజుల్లో, కర్నూలుకి చెందిన నా రూమ్‌మేట్ ద్వారా తెలుగు సినిమాల గురించి మరింత తెలుసుకోగలిగాను. ‘వేదం‘ వంటి అద్భుతమైన సినిమా గురించి అలాగే తెలుసుకున్నాను. కమర్షియల్ సినిమాలే కాకుండా విభిన్న చిత్రాలు ఆదరణ పొందగలవని నాకు అర్థమైంది” అన్నారు చిత్ర హీరో రక్షిత్ శెట్టి.