నటీనటులు: కమల్ కామరాజు, అపర్ణాదేవి , కాలకేయ ప్రభాకర్, పృథ్వీ

రచన, దర్శకత్వం : రఘుపతి రెడ్డి గుండా

నిర్మాత : విజయ్ కుమార్ పైండ్ల

సినిమాటోగ్రఫీ : మోహన్ చారి

నేపథ్య సంగీతం : వర్ధన్

ఎడిటర్ : పవన్ శేఖర్ పసుపులేటి

పీఆర్వో: బీఏ రాజు ‘s టీం

పబ్లిసిటీ డిజైనర్ : వివ రెడ్డి

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తెలుగులో సుపరిచితమైన కమల్‌ కామరాజ్‌ మెయిన్‌ లీడ్ చేసిన మూవీ సోదర సోదరీమణులారా. అపర్ణాదేవి ఫిమేల్ లీడ్ చేసిన ఈ మూవీతో రఘుపతి రెడ్డి గుండ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్స్‌ సంయుక్తంగా విజయ్‌కుమార్ పైండ్ల నిర్మాణ సారధ్యంలో నిర్మించారు. ట్రైలర్‌ టీజర్లతో ఆకట్టుకున్న ఈ చిత్రం వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్‌ 15న రిలీజ్‌ చేసారు. మరి ఈ చిత్రం సక్సెస్‌ దిశగా అడుగులు వేస్తుందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

రాజు (కమల్‌కామరాజ్‌) క్యాబ్‌ డ్రైవర్‌ గా పనిచేస్తుంటాడు. శ్రావణి (అపర్ణాదేవి) అతని భార్య. వీరికి కూతురు మహా ఉంటుంది. కార్‌ ఈఎంఐ కట్టడానికి రాత్రింబవళ్లు కష్టపడుతూ ఉంటాడు. ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశతో వికారాబాద్ అడవుల్లో రిసార్ట్‌కు సన్నీ అనే వ్యక్తిని తీసుకెళతాడు. అక్కడి నుంచి వస్తూ ఓ అమ్మాయిని పిక్‌ చేసుకుంటాడు. దారిలో పోలీస్‌ చెక్‌ చేస్తే రాజు కారులో ఎక్కిన అమ్మాయి శవమై కనిపిస్తుంది. ఆ కేసు రాజు పై పడుతుంది. అసలా అమ్మాయి ఎవరు ? ఎలా చనిపోయింది ? రాజు ఈ కేసు నుంచి బయటపడ్డాడా అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

తప్పుడు కేసుల్లో ఎంతోమంది బలవుతున్న విషయాన్ని చర్చించే ప్రయత్నం చేసాడు దర్శకుడు రఘుపతి రెడ్డి. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల మెప్పు కోసం కొంత మంది పోలీసులు పెడ్తున్న తప్పుడు కేసులపై ఎక్కుపెట్టిన అస్త్రంగా ఈ చిత్రం కనిపిస్తుంది. కఠిన వాస్తవాన్ని కళ్లకు కట్టేందుకు తీసుకున్న పాయింట్‌ను సూటిగా చెప్పే ప్రయత్నం చేసాడు. బడ్జెట్‌ పరిమితి ఉన్నా.. ఉన్నంతలో కథాంశాన్ని క్వాలిటీగా చెప్పే ప్రయత్నం కనిపించింది.

నటీనటుల పనితీరు :

కమల్‌ కామరాజ్‌ నటనలో ఉన్న అనుభవం ఈ క్యారెక్టర్‌ కు బాగా ఉపయోగపడింది. క్యాబ్‌ డ్రైవర్‌ గా చక్కగా నటించాడు. అపర్ణాదేవితో కమల్‌ కామరాజ్‌ జోడీ బాగుంది. సాధారణ గృహిణి పాత్రలో ఆకట్టుకుంది అపర్ణాదేవి. నెగిటివ్‌ షేడ్‌ ఉన్న హోం మినిస్టర్‌ పాత్రలో పృధ్వీ ఆకట్టుకుంటాడు. సీఐ గా బాహుబలి ప్రభాకర్ సూపర్బ్ అనిపించాడు. మిగతా నటీనటులు ఉన్నంతలో బాగా చేసారు.

టెక్నికల్ టీమ్‌ :

క్యాబ్‌ డ్రైవర్ల రొటీన్ డ్యూటీలో ఎదురయ్యే అనూహ్యమైన ఇంట్రస్టింగ్‌ పాయింట్ ఇది. ప్రతీ ఫ్రేమ్‌ ను థ్రిల్‌ కలిగించేలా తీయడంలో చాలా వరకు సక్సెస్‌ అయ్యాడు డైరెక్టర్‌ రఘుపతిరెడ్డి. యాక్టర్స్‌తో రియలిస్టిక్‌ పర్‌ఫార్మెన్స్‌ రాబట్టాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. మోహనాచారి కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్లస్‌ అయ్యింది. వర్ధన్‌ సంగీతం కూడా బావుంది. ఎడిటింగ్ కాస్త ట్రిమ్‌ చేసుంటే ఇంకాస్త బావుండేది.

బాటమ్‌ లైన్‌ : సోదర సోదరీమణులారా.. థ్రిల్లింగ్‌ ఎమోషనల్ రైడ్‌

Leave a comment

error: Content is protected !!