Shopping Cart 0 items - $0.00 0

అభినయ రాజకుమారి

 

అందమైన ముఖం.. ఆకట్టుకొనే కళ్ళు.. ఆకర్షించే చిరునవ్వు.. కాస్తంత అమాయకత్వం.. రవ్వంత గడుసుతనం కలగలిస్తే కృష్ణకుమారి. జానపద చిత్రాల కథానాయికగా, అభినయ రాజకుమారిగా తెలుగు హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆమె తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. 1933, మార్చ్ 6న పశ్చిమ బెంగాల్లోని నైహతిలో జన్మించారు. బెంగళూరు కు చెందిన అజయ్ మోహన్ ను ఆమె పెళ్ళిచేసుకున్నారు. వీరికి దీపిక అనే ఒక కుమార్తె కూడా ఉంది.

‘నవ్వితే నవరత్నాలు’ అనే చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృష్ణకుమారి ఆ తర్వాత చాలా చిత్రాల్లో తన నట కౌశలాన్ని ప్రదర్శించారు. మూడు భాషల్లోనూ కలిపి దాదాపు 150కి పైచిలుకు  చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలెన్నిటినో పోషించి.. అప్పటి కథానాయికలకు గట్టి పోటీనిచ్చారు. ‘పిచ్చి పుల్లయ్య, కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, ఆప్తమిత్రులు, అంతస్తులు, శ్రీకృష్ణావతారం, చిక్కడు దొరకడు, వరకట్నం, బంగారు భూమి, బందిపోటు, తదితర సినిమాల్లో నటించారు. తెలుగు చిత్రసీమలో జానపద చిత్రాలంటే కాంతారావు, కృష్ణకుమారి జోడీనే గుర్తొస్తుంది. కాంతారావుతో కలిసి దాదాపు 28 జానపద చిత్రాల్లో నటించారు కృష్ణకుమారి. ఈ సినిమాలన్ని ప్రేక్షకాదరణను సొంతం చేసుకోవడంతో జానపద చిత్రాల కథానాయికగా కృష్ణకుమారి పేరు మారుమ్రోగిపోయింది. ఎన్టీఆర్‌తో 25 సినిమాలు, అక్కినేని నాగేశ్వరరావుతో 18 సినిమాల్లో జంటగా నటించారు కృష్ణకుమారి. వారితో పాటు రామశర్మ, కృష్ణంరాజు, జగ్గయ్య, రేలంగి, రమణామూర్తి తెలుగు సినీ పరిశ్రమలోని కథానాయకులందరితో సినిమాలు చేశారు. మూడుసార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న కృష్ణకుమారి.. రాష్ట్ర స్థాయిలోనూ నంది పురస్కారాలు దక్కించున్నారు. నేడు కృష్ణకుమారి వర్ధంతి. ఈ సందర్భంగా ఆ అభినయ రాజకుమారికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!