తన తండ్రికి భారం కాకూడదని కొన్నాళ్ళు… తన పిల్లల భవిష్యత్తుకు ఆటంకం కాకూడదని కొన్నాళ్ళు… తన “నటనాసక్తి”కి తనకు తానే అడ్డుకట్ట వేసుకున్న ఓ “భూమి పుత్రుడు”… ఇప్పుడు “నట వ్యవసాయం” చేసేందుకు నడుం కడుతున్నాడు. తన పిల్లలిద్దర్నీ ప్రయోజకులుగా తీర్చిదిద్దడంతోపాటు… పెళ్ళిళ్ళు కూడా చేసి, నటుడిగా తన చిరకాల వాంఛ తీర్చుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్న ఆ సన్నకారు రైతు పేరు “వణుకూరు శ్రీనివాస్ రెడ్డి” అలియాస్ “నంద్యాల శ్రీను”.
స్కూల్ స్థాయిలోనే నటనకు శ్రీకారం చుట్టిన నంద్యాల శ్రీను… కుటుంబ బంధాలు, బాధ్యతల దృష్ట్యా తానుండే ఊరిలో… లేదా పరిసర ప్రాంతాల్లో జరిగే నాటకాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. ప్రశంసలు, ప్రైజులు అలవోకగా కొట్టేసేవారు. తన భుజాలపై గల బాధ్యతల కావడిని పడెయ్యకుండానే… నాటకాలాడ్డం కోసం తన తండ్రి అదనంగా శ్రమ పడుతుండడాన్ని గమనిస్తూ పెరిగిన ఆయన తనయుడు… తన తండ్రిని ఒక మంచి నటుడిగా చూడడం కోసం గట్టిగా కంకణం కట్టుకోవడం ఇక్కడ గమనార్హం!!
సాత్విక పాత్రలతోపాటు… ప్రతినాయక ఛాయలు కలిగిన పాత్రలు సైతం పోషించడంలో సిద్ధహస్తులైన నంద్యాల శ్రీను మాట్లాడుతూ… “కుటుంబ బరువు బాధ్యతలు సక్రమంగా పోషిస్తూనే, నాటకాల కోసం తిరుగుతుండే నన్ను చూసి మా నాన్న… నా ముందు నన్ను తిట్టినా… తన స్నేహితుల వద్ద మురిసిపోయేవాడు. నటుడిగా నేను మరింత రాణించాలని కోరుకునేవాడు. మా నాన్న కాలం చేసేనాటికి యుక్త వయస్సులో ఉన్న మా అబ్బాయికి కూడా నా తపన తెలుసు. అందుకే ఇప్పుడు మా అబ్బాయితోపాటు… మా అమ్మాయి, కోడలు, అల్లుడు ప్రోత్సాహంతో… నా నాటకానుభవాన్ని సద్వినియోగం చేసుకుని… నటుడిగా నన్ను ఉన్నత స్థాయిలో చూడాలన్న మా నాన్న కోరిక తీర్చడం కోసం సినిమా రంగంలో నా కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను” అంటున్నారు!!
ఈ విషయంలో తన జీవిత భాగస్వామి సహాయ సహకారాల గురించి మాట్లాడుతూ… ఒకింత భావోద్వేగానికి లోనయ్యే నంద్యాల శ్రీను… తన భార్య సపోర్ట్ లేకపోతే తాను లేనని చెబుతారు. తమ పిల్లలు ప్రయోజకులు కావడంలో, బంధువర్గంలో తమకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకోవడంలో తన జీవన సహచరి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు!!
ప్రభుత్వోద్యోగులు, వ్యాపారులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రమే కాదు… “కర్షకులు” కూడా సినిమా రంగంలో దర్జాగా “సెకండ్ ఇన్నింగ్స్” స్టార్ట్ చేయొచ్చని నిరూపించాలని తహతహలాడుతూ… నటుడిగా పేరు తెచ్చుకోవాలనే తపన తప్ప… పారితోషికం గురించి పట్టించుకోని పుడమి పుత్రుడు
“నంద్యాల శ్రీను”కు తమ సినిమాల్లో అవకాశం ఇచ్చి, ప్రోత్సహించాలనుకునేవారు…
9618850417 నంబర్ లో సంప్రదించవచ్చు!!