తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘకాలం నట జీవితాన్ని అనుభవించిన వారు అతి తక్కువ. అలాంటి అరుదైన కళా జీవితాన్ని సమర్ధవంతంగా అనుభవిస్తున్న స్టార్ కమెడియన్ ఆలీ. దాదాపు 45 ఏళ్ల పాటు కళాకారునిగా అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు ఆలీ. 5 ఏళ్ల వయసునుంచే తెలుగు తెరపై నవ్వులు పూయిస్తున్న నటుడు ఆలీ. బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. కామెడీ క్యారెక్టర్స్‌తో కడుపుబ్బా నవ్వించి.. ఆ తర్వాత హీరోగా కూడా అద్బుతమైన విజయాలను సొంతం చేసుకున్న అరుదైన ఘనత ఆలీది మాత్రమే. అలాంటి గొప్ప కళాకారుని సత్కరించుకోవడం గర్వకారణంగా భావిస్తూ.. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్‌తో ఆలీని గౌరవించింది సంగమం ఫౌండేషన్ మరియు వివేకానంద హాస్పిటల్స్ వారు. వీరిద్దరూ సంయుక్తంగా స్టార్ కమెడియన్ ఆలీకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారంతో సత్కరించడానికి హైదరాబాద్‌లోని శ్రీ సత్యసాయి నిగమాగమం లో కామెడీ ఫెస్టివల్‌ను నిర్వహించారు. సీనియర్ కళాకారులతో పాటు ఔత్సాహిక కమెడియన్స్‌తో నిర్వహించిన ఆ కామెడీ ఫెస్టివల్లో గొప్ప గొప్ప నటీనటులు పాల్గొన్నారు. . ‘సంగమం’ సంజయ్ కిషోర్ నిర్వహణ లో జరిగిన ఈ కార్యక్రమం లో హాస్య నటులు జయలలిత, పాకీజాహ్, రాగిణి, శివారెడ్డి, సునామి సుధాకర్ , బులెట్ భాస్కర్, నాటి నరేష్, హరిబాబు, పేరడీ గురుస్వామి, సంకర నారాయణ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరు చేసిన హాస్యవల్లరి కడుపుబ్బా నవ్వించింది.
‘ కామెడీ ఫెస్టివల్’ లో హాస్య నటుడు అలీ ని ‘సంగమం- వివేకానంద లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు ‘ తో సత్కరించారు . అవార్డు కింద వెండి కిరీటం, వెండి కంకణం ను బహుకరించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అలనాటి మేటి నటి రాజశ్రీ హాజరయ్యారు. ఆలీ ఎంత మంచి నటుడో అంతకంటే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి.. ఆలీలో సేవాగుణం అపూర్వం అంటూ కొనియాడారు. ఆలీ పద్మశ్రీ అవార్డ్‌కు అర్హుడు అంటూ అభినందించారు. పద్మశ్రీ అవార్డ్ తో ఆలీని సత్కరించాలని ప్రభుత్వానికి విన్నవించారు నటి రాజశ్రీగారు. ఈ సందర్భంగా అలనాటి హీరో కాంతారావు గారి కుమారుడు రాజా , హాస్య నటి పాకీజాహ్ , కళాకారిణి హేమకుమారి గార్లకు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ వై. రాజశేఖర్ గారు ఒకొక్కరికి పాతిక వేలు చొప్పున ఆర్ధిక సాయాన్ని అందించారు .
కార్యక్రమానికి అతిధులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు , వివేకానంద హాస్పిటల్స్ అధినేత డా . గీత, ప్రముఖ నటులు శ్రీ తనికెళ్ళ భరణి, శ్రీమతి శ్రీలక్ష్మి గార్లు అలీ ని అభినందించారు.