పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి.. భూలోకంలో జరుగుతాయి అని సామెత ఉంది. సక్సెస్‌ఫుల్‌గా వైవాహిక జీవితాన్ని గడిపే జంటలను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. అలాంటి జంటగా మంచు విష్ణు విరానిక గార్లను చెప్పొచ్చు. వీరి వైవాహిక జీవితం ఆరంభించి మూడు పువ్వులు ఆరుకాయలు వర్ధిల్లుతూ రత్నాల్లాంటి బిడ్డలతో ఆనందోత్సాహాల నడుమ ఈరోజు (మార్చి 1 ) వివాహ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ జంటకు మనస్పూర్తిగా వివాహ దినోత్సవ శుభాకాంక్షలు.
మంచు విష్ణు ప్రఖ్యాత నటుడి కొడుకుగా పరిచయం అయి హీరోగా సక్సెస్ ను చూసి… ఇప్పుడు మా అధ్యక్షుడి హోదా, బాధ్యతలు నెరవేర్చుతున్నాడు. మరోవైపు వ్యాపారాలు ఎలాగూ ఉన్నాయి. ఇన్ని బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడంటే అనుకూలవతి అయిన భార్య ఉంటేనే సాధ్యపడుతుంది. విష్ణుకు అలాంటి అనుకూలవతి అయిన సతీమణి విరానిక రెడ్డి. కేవలం భార్యగానే కాకుండా స్వతహాగా వ్యాపారస్తురాలు కూడా. సమర్ధంగా వ్యాపారాలులు నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలను కూడా చూసుకుంటూ ఆదర్శవంతంగా నిలుస్తున్నారు.
మంచు విష్ణు నటుడిగా నిర్మాతగా సక్సెస్‌ను చూస్తున్నారు. 1985లో రగిలే గుండెలు చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి.. 2003 లో విష్ణు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2007 లో ఢీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. దూసుకెళ్తా, దేనికైనా రెఢీ చిత్రాలతో సక్సెస్‌ని కంటిన్యూ చేసారు. అంతేకాదు మంచు విష్ణు స్వయంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్. టెక్నాలజీ రంగంలో మంచి అనుభవం ఉన్నవాడు. నటుడు నిర్మాత తో పాటు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలకు మంచు మోహన్ బాబు స్థాపించిన మోహన్‌బాబు కార్పొరేషన్‌కి సీఈవో బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు మంచు విష్ణు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్షుడు కూడా.
ఇక విరానికా రెడ్డి గురించి మాట్లాడుకుంటే.. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి చెల్లెలు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడి కూతురు. స్వతహాగా ఆఫ్రికాలో వ్యాపారాలున్నాయి. చక్కని బిజెనెస్ ఉమెన్ లక్షణాలతో పాటు మాట మర్యాద సంస్కారం ఉన్న విరానికా రెడ్డితో మంచు విష్ణు పరిచయం , స్నేహంతో ప్రేమ చిగురించింది. వారి ప్రేమను 2008 లో పెళ్లి వరకు తీసుకొచ్చారు. ముగ్గురు రత్నాల్లాంటి బిడ్డలతో ఆదర్శవంతమైన వైవాహిక జీవనాన్ని అవలంభిస్తున్నారు.
మరోసారి మంచు విష్ణు , విరానికలకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు.