ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ డైరెక్టర్ “ఎస్వీ కృష్ణారెడ్డి”, తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, ప్రఖ్యాత బ్యానర్ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్`మీనా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బిగ్‌బాస్ ఫేం సోహెల్`మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటించారు. మార్చిలో విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమా యూనిట్ పలు విశేషాలను మీడియాతో పంచుకుంది.
ఈ సందర్భంగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…
నేను ఇంతకాలం కొనసాగటానికి కారణం కామెడీనే. అంతేకాకుండా, గత 46 సంవత్సరాలుగా నటుడిగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులు ధన్యవాదాలు. ఇటీవలే, వాల్తేర్ వీరయ్య వంటి హిట్ ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతుణ్ణి. నా కేరీర్ సక్సెస్ అవ్వడానికి ముఖ్యపాత్ర వహించిన వారిలో ముఖ్యులు ఎస్.వి. కృష్ణారెడ్డి గారు. సాక్షాత్తూ నాటి ప్రధాని పీవీ నరసింహారావు గారు ‘‘దిస్ బాయ్ ఈజ్ స్ట్రెస్ రిలీజర్’ అన్నారంటే ఎంత గొప్ప విషయం. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అందరినీ అలరించే ‘ఆర్గానిక్ మామా`హైబ్రీడ్ అల్లుడు’ చిత్రంతో విజయవిహారం చెయ్యబోతున్నాము. ఇది వంద శాతం ఫ్యామిటీ ఎంటర్‌టైనర్. నిర్మాత కల్పన గారు నాకు చిన్నతనం నుంచీ తెలుసు. మీనా కెరీర్ ప్రారంభంలో నాతో చేసింది. మళ్లీ ఇంతకాలానికి మా కాంబినేషన్ కుదరడం ఆనందంగా ఉంది. ఆమెకు అనుకోని కష్టం వచ్చినా నిర్మాత శ్రేయస్సు కోసం షూటింగ్‌కు హాజరైంది. పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లతో పనిచేయడం వల్ల ఆమెకు ఆ మంచి గుణం అబ్బింది. హీరో సొహైల్ తన పాత్రకు చెందిన అన్ని రసాలను అద్భుతంగా పండిచాడు. సినీ పరిశ్రమలో యాక్టర్ కావటానికి నటన తెలిస్తే చాలు.. కానీ సక్సెస్‌ఫుల్ యాక్టర్ కావాలంటే తప్పకుండా క్యారెక్టర్ కావాలి. అది ఉంటే ఇక తిరుగుండదు అని ఈ తరం ఆరిస్ట్‌లకు చెపుతున్నా. అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి అన్నారు.
దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ…
వినోదం తర్వాత నేను చేసిన కంప్లీట్ కామెడీ మూవీ ‘ఆర్గానిక్ మామ`హైబ్రీడ్ అల్లుడు’. ఎంటర్‌టైన్‌మెంట్‌కు, మంచి డైలాగ్స్‌కు స్కోప్ ఉన్న కథ ఇది. మీకు నచ్చే అన్ని అంశాలు పుష్కలంగా ఈ సినిమాలో ఉన్నాయి. రాజేంద్రప్రసాద్ గారి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. ఆయన నిలబెట్టిన దర్శకుణ్ణి నేను. ఇక మా అచ్చిరెడ్డి నా చేత అద్భుతాలను సృష్టించే ప్రోత్సాహం ఇచ్చారు. అలాగే నిర్మాత కల్పన గారి సహకారం ఎంత చెప్పినా తక్కువే. కథ విపరీతంగా నచ్చడంతో బాగా ఇన్‌వాల్వ్ అయ్యారు. ఇక కెమెరామెన్ రాంప్రసాద్ గారు సినిమాను కలర్‌ఫుల్‌గా మలిచారు. ఓవైపు రాజేంద్రప్రసాద్, మీనాగారు.. మరోవైపు సూర్య, హేమ, సునీల్, కృష్ణభగవాన్, ప్రవీణ్, సప్తగిరి ఒక్కరేమిటి కమెడియన్స్ అందరూ కలిసి సినిమాను పీక్స్‌కు తీసుకెళ్లారు. థియేటర్‌లో ప్రేక్షకులు నవ్వే నవ్వులు.
నటి మీనా మాట్లాడుతూ…
ఈ కథ చెపుతున్నప్పుడే డైరెక్టర్ గారు నాకు ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది.. ఎలా బిహేవ్ చేస్తుంది అని ప్రాక్టికల్‌గా కూడా చూపించారు. అంతగా మాకన్నా కృష్ణారెడ్డిగారే ఈ క్యారెక్టర్స్‌లో ఇన్‌వాల్వ్ అయిపోయారు. నాకు ఇది కొత్త క్యారెక్టర్‌గానే చెప్పాలి. రాజేంద్రప్రసాద్ గారితో 30 సంవత్సరాల తర్వాత చేస్తున్నాను. కృష్ణారెడ్డిగారితో వర్క్ చేయాలని చాలాసార్లు అనుకున్నా డేట్స్ ప్రాబ్లమ్‌తో కుదరలేదు. ఆయన శుభలగ్నం సినిమా ఏదైనా భాషలోకి రీమేక్ చేస్తే నేను చేస్తాను అని ఆయన్న అడిగాను. కానీ కుదరలేదు. ఇక రాజేంద్రప్రసాద్ గారు గ్రేట్ యాక్టర్.. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ కూడా. నేను తొలిసారిగా ఒక లేడీ ప్రొడ్యూసర్‌తో పనిచేస్తున్నాను. ఆమెతో చాలా మంచి అనుబంధం ఏర్పడింది. ఇద్దరం షాపింగ్‌కి కూడా వెళ్లేవాళ్ళం. ఇలాంటి మంచి సినిమాతో మళ్లీ మీ ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉంది.
హీరో సోహైల్ మాట్లాడుతూ….
ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తాను. కృష్ణారెడ్డి గారి సినిమాలు, రాజేంద్రప్రసాద్ గారి సినిమాలు చూసి పెరిగినోళ్లం. ఇంతమంది లెజెండరీ నటీనటులు, టెక్నీషియన్స్‌తో కలిసి పనిచేయడానికి ముందు భయపడ్డా. కానీ ఆ తరువాత అంత సర్దుకుంది. కెమెరాను, ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకో అని కృష్టారెడ్డిగారు చెప్పారు. ఈ సినిమాలో పెర్‌ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ అంతా కృష్ణారెడ్డిగారి క్రెడిట్టే. అచ్చిరెడ్డిగారి ప్లానింగ్ వల్లే ఇంత బాగా జరిగింది. పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లు ఉన్నప్పటికీ సినిమాను 39రోజుల్లో కంప్లీట్ చేశారు. నిర్మాత కల్పన మేడమ్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నాకు ఈ అవకాశం రావటానికి కారణమైన సంతోషం సురేష్ గారికి థ్యాంక్స్.
నటి హేమ మాట్లాడుతూ…
1990 నుంచి నేను సినిమాలు చేస్తున్నప్పటికీ కృష్ణారెడ్డిగారి సినిమాలో చేసే అవకాశం ఈ సినిమాతో రావడం ఆనందంగా ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారితో ఇంతకు ముందు సినిమాలు చేశాను. ఆయన ప్రతి ఆర్టిస్ట్‌కు నటనలో మెళకువలు చెపుతుంటారు. కల్పన మేడమ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సోహెల్ హీరోగా ఈ సినిమాతో నిలదొక్కుకుంటాడు అని నమ్మకం ఉంది. ఈ జనరేషన్ యూత్‌కు దగ్గరగా ఉండే తల్లిపాత్ర నాది.
ఈ చిత్ర సమర్పకుడు, ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ…
సినిమా బాగా వచ్చింది. మార్చిలో విడుదల చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కృష్ణారెడ్డిగారి గత చిత్రాల్లోని మ్యాజిక్‌తో పాటు మంచి మెసేజ్ ఉన్న స్క్రిప్ట్ ఇది. కల్పన గారు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే సినిమా ఇంత హ్యాపీగా పూర్తయింది. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. రాజేంద్రప్రసాద్ గారు, మీనా గారి గురించి కొత్తగా చెప్పాల్సిపని లేదు. ఒకర్ని మించి ఒకరు పోటీ పడి చేశారు. సొహైల్ ఈ క్యారెక్టర్‌కు హండ్రడ్ పర్సంట్ సూటబుల్ మంచి అవుట్‌పుట్ ఇచ్చాడు. హీరోయిన్ మృణాళిని రవి చక్కగా చేసింది. క్లైమాక్స్‌లో వచ్చే మాస్ సాంగ్ అందరికీ సూపర్ కిక్ ఇస్తుంది. ఈ పాట రాసింది చంద్రబోస్ గారు, పాడింది రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్.ఆర్.ఆర్.లోని ‘‘నాటు నాటు’’ పాట ఎంత సంచలనం సృష్టించిందో మీ అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ కూడా మంచి బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాం.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…
సినిమా నేను చూశాను అద్భుతంగా ఉంది. కృష్ణారెడ్డి గారి సినిమా అంటే అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఒకటే మార్క్.. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేయటమే ఆయన లక్ష్యం. ఈ సినిమా కూడా అదే కోవలో ఉంటుంది. నిర్మాత కల్పన గారు చేస్తున్న తొలి స్ట్రెయిట్ సినిమా. ఇది ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా దగ్గర చేస్తుంది.
సునీల్, కృష్ణభగవాన్, సన, ప్రవీణ్, సప్తగిరి, అజయ్‌ఘోష్, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: శివ, పాటలు: చంద్రబోస్, రామజోగయ్య, శ్రీమణి, సమర్పణ: కె. అచ్చిరెడ్డి, నిర్మాత: కోనేరు కల్పన, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.