హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో చికిత్స పొందుతూ పరమపదించారు. నటుడిగా,నిర్మాతగా,కేంద్ర మంత్రిగా కృష్ణంరాజు సేవలు చిరస్మరణీయం. హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
చింత నిప్పుల్లాంటి కళ్ళతో .. ఎదురుగా నిలిచిన ప్రత్యర్ధిని రౌద్రం గా చూసి.. గంభీరమైన వాయిస్ తో నా యాల్దీ .. అంటే చాలు.. ఒణికి పోవాల్సిందే. ఈ తరహా పాత్రల్ని ఎన్నిటినో పోషించి.. తెలుగు తెరపై రెబల్ స్టార్ గా ఎదిగిన ఆయన పేరు కృష్ణంరాజు. ఒకప్పడు టాలీవుడ్లో రౌద్ర, వీర, భీభత్స రసాత్మక పాత్రలకు పెట్టింది పేరు ఆయన. అప్పట్లో యాక్షన్ చిత్రాలు చేయాలంటే.. అందరు దర్శకులకూ ఆప్షన్ ఆయనే. ఎక్కువగా .. ఉంగరాల జుట్టుతో , కట్ బనియన్ తో వైవిధ్యమైన గెటప్స్ లో కనిపిస్తూ.. విలక్షణమైన మేనరిజమ్స్ తో చెలరేగేవారు కృష్ణంరాజు. అప్పట్లో యన్టీఆర్, ఏన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి అగ్ర హీరోలు ఎంతటి ఆధిపత్యాన్ని ప్రదర్శించినా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని, ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని వాళ్ళతో పోటీ పడేవారు కృష్ణంరాజు.
1966 లో కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన ‘చిలకా గోరింక’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు కృష్ణంరాజు. అయితే అప్పటి అగ్ర హీరోలకన్నా చాలా హైట్ గా ఉండడంతో… కెరీర్ బిగినింగ్ లో ఆయనకు ఎక్కువగా విలన్ పాత్రలే తగిలాయి. అయినా సరే. వచ్చిన ప్రతి పాత్రను సద్వినియోగం చేసుకొని .. నటనలో వైవిధ్యత ప్రదర్శించి మళ్ళీ హీరోగా సత్తా చాటుకున్నారు. దాదాపు 350 చిత్రాల్లో తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాల్ని నిండుగా మెండుగా పొందిన ఆయన గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్ స్థాపించి ‘కృష్ణవేణి, అమరదీపం, భక్తకన్నప్ప’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. సొంత చిత్రాల సక్సెస్ తో స్టార్ గా వెలిగిన కృష్ణంరాజును మాస్ కు దగ్గరగా చేసి రెబల్ స్టార్ ను చేసినవి దాసరి నారాయణరావు “కటకటాలరుద్రయ్య, రంగూన్ రౌడీ”, గోల్కోండ అబ్బులు లాంటి చిత్రాలేనని చెప్పాలి… ఈ సినిమాల విజయంతోనే ‘రెబల్ స్టార్’గా జనం మదిలో చోటు సంపాదించుకున్నారు కృష్ణంరాజు. నాటి టాప్ స్టార్స్ లో ఒకరిగా రాణిస్తూ పలు విలక్షణమైన పాత్రల్లో అలరించారు .