పొద్దత్తమానం తిని తొంగుంటే మడిసికి, గొడ్డుకి తేడా ఏటుంటది? మడిసన్నాకా కూసింత కలా పోసనుండాల.. అంటూ జరీ పంచెమీద సిల్క్ జుబ్బా వేసుకొని .. వేళ్ళ మధ్యన స్టైలు గా చుట్ట పెట్టుకొని తిప్పుతూ.. తన కంఠాన్ని ఖంగున మోగించిన ఆ కిల్లింగ్ కాంట్రాక్టరు ఇంకా మన మనసుల నుంచి చెరిగిపోలేదు. అద్భుతమైన అభినయం, అనితర సాధ్యమైన ఆంగికం, కంచు లా ఖంగున మోగే ఆ వాచకం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఆయన పేరు రావుగోపాలరావు. చిరు నవ్వు నవ్వుతునే క్రూరత్వాన్ని, సంభాషణల్ని తనదైన శైలిలో విరుస్తూనే విలనీని అవలీలగా పోషించగలిగే ఆయన .. ప్రతి నాయకుడిగా తెలుగు చిత్ర రంగాన్ని కొన్ని దశాబ్దాలు ఏలారు. ఒకప్పుడు అందరు అగ్రహీరోల సినిమాల్లోనూ ఆయనే విలన్. అలాగే కొన్ని ఉదాత్తమమైన పాత్రలూ పోషించి ప్రేక్షకుల చేత కన్నీళ్ళు కూడా పెట్టించారు రావుగోపాలరావు.
‘భక్త పోతన’ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి నటుడిగా ప్రవేశించిన రావుగోపాలరావు..ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించారు. ‘జగత్ కిలాడీలు’ చిత్రంతో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక 1975లో విడుదలైన బాపు రమణల రమణీయ దృశ్యకావ్యం ‘ముత్యాల ముగ్గు’ చిత్రంతో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి విలనిజం అంటే ఇదని, విలన్ ఇలా కూడా ఉంటాడని, డైలాగులు ఇలా కూడా పలకవచ్చని చాటి చెప్పారు రావుగోపాలరావు. ఆ సినిమా తోపాటు అందులోని ఆ పాత్ర కూడా ఘన విజయం సాధించడంతో .. అక్కడ నుంచి రావుగోపాలరావు తెలుగు పరిశ్రమకు డైలాగుల కాంట్రాక్టరు గా మారిపోయారు. యన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి అప్పటి తరం అగ్రహీరోల చిత్రాల్లోనే కాకుండా ఆ తర్వాత తరం అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగర్జున, వెంకటేశ్ లాంటి హీరోల చిత్రాల్లోనూ రావుగోపాలరావు విలన్ గా నటించి .. తనకు తానే సాటి అని నిరూపించారు. ఇప్పుడు ఆయన తనయుడు రావు రమేశ్ కూడా విలక్షణమైన పాత్రలు పోషిస్తూ..తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.