గట్టిగా నవ్వితే.. శరీరంలోని నరాలన్నీ ఉత్తేజితమై.. మనిషికి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. అందుకే నవ్వుతూ బతకాలిరా అన్నారు పెద్దలు. ఆ సూత్రాన్ని బాగా ఫాలో అయ్యాడో ఏమో కానీ.. దర్శకుడు ఈ.వీ.వీ సత్యనారాయణ తాను జీవించి ఉన్నంత కాలం అలాంటి నవ్వులకు ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. ప్రేక్షకుల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించడమే తన పనిగా పెట్టుకున్నారు. తెలుగు తెరమీద జంధ్యాల తర్వాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించి తన గురువుకు తగ్గ శిష్యుడనిపించుకున్నాడాయన. ఇప్పుడు అందరూ అదే పనిగా వాడే ‘పంచ్ డైలాగ్’ అనే పదం వాడుకలోకి రాకముందే.. తాను సృష్టించిన పాత్రలతో ఏనాడో సంచులకొద్దీ పంచులు విసిరాడాయన.
ఈవివి సత్యనారాయణకు చిన్నతనం నుంచీ సినిమాలంటే బాగా పిచ్చి. తరచూ కాలేజీకి డుమ్మాకొట్టి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎన్నో సినిమాలు లాగించేవాడు. సినిమాల మీద ఉన్న ఆ పేషనే ఆయన్ను చెన్నై వరకూ నడిపించింది. అక్కడ ఆయన ఎక్కి దిగిన స్టూడియో గుమ్మాలెన్నో. మొత్తం మీద ఎలాగైతేనేం.. కష్టపడి దేవదాస్ కనకాల దగ్గర ‘ఓ ఇంటి భాగోతం’ సినిమాకి అసోసియేట్ గా కుదిరారు. అక్కడనుంచి జంధ్యాల వద్ద ఎన్నోసినిమాలకు శిష్యరికం చేశారు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ ‘చెవిలో పువ్వు’ చిత్రంతో ఈవివి సత్యనారాయణ డైరక్టర్ గా తొలి సారిగా మెగా ఫోన్ పట్టుకున్నారు. ఆ మూవీ ఫ్లాప్ అయినా.. డి.రామానాయుడు ఆయనకు ‘ప్రేమఖైదీ’ తో డైరెక్టర్ గా అవకాశమిచ్చారు. ఆ మూవీ సూపర్ హిట్టుతో ఈవివి ఇంక వెనుతిరిగి చూసుకోలేదు. కొత్త కొత్త కామెడీ పాత్రలు సృష్టించి .. ఆయన తీసిన ప్రతీ మూవీ సూపర్ హిట్టైపోయేది. ‘ఆ ఒక్కటి అడక్కు, అప్పుల అప్పారావు, ఆలీబాబా అరడజనుదొంగలు జంబలకిడి పంబ . సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది , ఆమె, తాళి’ లాంటి ఎన్నో వైవిధ్యమైన కామెడీ చిత్రాలు తెరకెక్కించి అప్పటి ప్రేక్షకుల్ని నవ్వులతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇక అగ్రనటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో కూడా సినిమాలు తీసి హిట్టు కొట్టారు ఈవీవీ. అలాగే ఎంతో మంది కమెడియన్స్ కు ఈవీవీ లైఫ్ ఇచ్చారు. ఇప్పటికీ ఆయన సినిమా ఏ టీవీలోనే వస్తుంటే.. కాసేపు ఆ కామెడీకి రిలాక్స్ అవడం మనకు బాగా అలవాటు. దటీజ్ ఈవీవీ. నేడు ఈవీవీ సత్యనారాయణ వర్ధంతి. ఆ కామెడీ ట్రెండ్ సెట్టర్ కు ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.