శంకరాభరణం సినిమాకు నలభై రెండేళ్లు . ఒక ఆఫ్ బీట్ సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమాతో పోటీ పడి వసూళ్లు సాధించడం అనే ఓ అద్భుతాన్ని తెలుగు తెర మీద సుసాధ్యం చేసిన చిత్రంగా శంకరాభరణాన్ని చెప్పుకోవాలి.
అదే టైమ్ లో విడుదలైన మా భూమి కూడా ఆ ఘనతను దక్కించుకుందనుకోండి.
అసలు శంకరాభరణం అనే టైటిల్ పెట్టడమే ఒక అద్భుతం. శంకరుడి ఆభరణం పాము. ఒక విషపురుగు. అయితే అది శంకరుడికి ఆభరణంగా భాసిల్లింది.
ఇదే ఆ చిత్ర కథ.
తులసి అనే అమ్మాయితో బలవంతంగా పడుపు వృత్తి చేయించాలని కన్న తల్లే నిర్ణయించిన సందర్భంలో … జరిగిన బలాత్కార ఫలితంగా జన్మించిన కుమారుడ్ని … తను దైవంగా ఆరాధించే సంగీత సరస్వతి పాదాల చెంతకి చేర్చడమే కాదు… ఆయన సంగీతానికి వారసుడుగా నిలబెట్టడం … తద్వారా జన్మ చరితార్ధం చేసుకోవడం .. ఇంతే కథ.
పురోహితుడికి నత్తి మనకు భక్తి మనకి పనికిరావే అమ్మా అని కూతురిని దారిలో పెట్టడానికి ఆ వేశ్యామాత ఎన్ని ప్రయత్నాలు చేసినా తులసి చెవికి ఎక్కవు. తను పుట్టింది అక్కడే అయినా తన ఆలోచనలు అభిరుచులు వేరు. నృత్యం వృత్తికి అవసరంగా నేర్చుకున్నా … అందులో ఆనందాన్ని వెతుక్కుంటుంది. అదే కళా హృదయం సంగీత సరస్వతి శంకరాభరణం శంకరశాస్త్రి గానాన్ని ఆరాధిస్తుంది.
అనుకోకుండా తన జీవితంలో దొర్లిన అపశృతి కారణంగా ఇల్లు వదిలి వెడుతుంది. శంకరశాస్త్రి గారే ఆశ్రయం ఇస్తారు. కానీ లోకం ఊరుకోదు కదా … దానికి వెరచి తన వల్ల తను ఆరాధించే శాస్త్రిగారికి అపకీర్తి రాకూడదని భావించి వెళ్లిపోతుంది.
ఓ పిల్లవాడికి జన్మయిస్తుంది. ఆ పిల్లవాడి జన్మకు ఓ సార్ధకత ఉండాలనుకుంటుంది. వాడ్ని శంకరాభరణం చేయాలనుకుంటుంది. చేస్తుంది. అలా జన్మ సాఫల్యం సాధిస్తుంది. శంకరశాస్త్రిగారి పాదాల చెంత ఆయనతో పాటే ప్రాణం విడుస్తుంది.
ఈ కథకు ఆలంబనగా శంకరశాస్త్రి పాత్ర చుట్టూ … శిధిలమైపోతున్న బారతీయ సంస్కృతి కళా వారసత్వాలకు సంబంధించిన చర్చ నడుపుతాడు దర్శకుడు.
సంగీతం కూడా భగవదనుసంధాన మార్గమే అని నమ్మి సాధన చేసి కైవల్యం పొందిన త్యాగబ్రహ్మ స్ఫూర్తి శంకరశాస్త్రి పాత్రలో సాక్షాత్కరింప చేశారు దర్శకుడు విశ్వనాథ్.
ఆచార వ్యవహారాలు మనుషులను క్రమ పద్దతిలో పెట్టడానికే కానీ కులాల పేరుతో మతాల పేరుతో విడగొట్టడానికి కాదు … లాంటి సందేశాలతో పాటు …
పాశ్చాత్య సంగీత పెనుతుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీతాన్ని ఓ కాపు కాయించడం తన లక్ష్యంగా ప్రకటించుకున్నారు విశ్వనాథ్.
అది నిజంగానే సాకారమైంది. శంకరాభరణం విడుదలైన తర్వాత శాస్త్రీయ సంగీతం నేర్చుకునే విద్యార్ధుల సంఖ్య పెరిగింది. సంగీత పాఠశాలలకు విలువ పెరిగింది.
ఇలా శంకరాభరణం చిత్రం ద్వారా ఓ కళా సంస్కారాన్ని నిలబెట్టిన విశ్వనాథ్ ను తెలుగు వారు కళా తపస్వి గా పిల్చుకోవడం ప్రారంభించింది కూడా అప్పుడే.
నటుడుగా వేషాలు వెతుక్కుంటూ తిరిగిన ఏడిద నాగేశ్వరరావు తన ఊరి మిత్రులు సినిమా తీద్దామని వస్తే విశ్వనాథ్ దగ్గరకు తీసుకువెళ్లారు.
ఆయన వారికి సిరిసిరిమువ్వ అనే సినిమా తీసిచ్చారు. అది పెద్ద విజయం సాధించింది. దాని వర్కింగ్ పార్ట్ నర్ అయిన ఏడిద నాగేశ్వరరావు వాటాకు వచ్చిన సొమ్ము పెట్టుబడిగా ప్రారంభించిన పూర్ణోదయా మూవీస్ బ్యానర్ లో విశ్వనాథ్ చేసిన తొలి ప్రయోగం శంకరాభరణం.
యాభై ఏళ్లు దాటిన వ్యక్తిని హీరోగా తీసుకుని అప్పటి వరకు క్లబ్ సాంగ్స్ చేసిన ఓ అమ్మాయిని హీరోయిన్ పాత్రకు అనుకుని చాలా పెద్ద సాహసం చేశారు ఆయన.
వేటూరి ప్రభాకరశాస్త్రిగారు రాసిన కరుణకము అనే కథ వేటూరి సుందరరామ్మూర్తి ద్వారా విన్న విశ్వనాథ్ గారు అందులో ప్రధాన పాత్ర ను తీసుకుని మిగిలిన కథంతా తను కల్పించి తీర్చిదిద్దిన సంగీత కావ్యం శంకరాభరణం.
చిత్రం పూర్తయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ల కోసం సుమారు ఆరవై స్క్రీనింగ్స్ వేశారు. ఇది ఒక రికార్డు.
తమిళ నాడులో కూడా తెలుగు ప్రింటే చాలా భారీ మొత్తాలు వసూలు చేసింది. ఆనాటి ఎన్టీఆర్ సూపర్ హిట్స్ వేటగాడు, డ్రైవర్ రాముడు సినిమాలతో పోటీ పడి వసూళ్లు సాధించింది శంకరాభరణం.
లవకుశ చిత్రం చూడ్డానికి ఊళ్ల నుంచీ బళ్లు కట్టుకు వచ్చేవారు అన్నట్టు ఈ చిత్రం చూడ్డానికి నార్త్ ఇండియా నుంచీ విమానాల్లో మద్రాసు విజయవాడ వచ్చి సినిమా చూసి వెళ్లేవారు.
కొడవటిగంటి కుటుంబరావు లాంటి కమ్యునిస్టు రచయిత శంకరాభరణం సినిమా బాంబు అనేశాడు.
నిజానికి ప్రపంచీకరణ నేపధ్యంలో ఈ శతాబ్దాంతానికి యాభై శాతం పైగా ప్రాంతీయ భాషలు నాగరికతలు నాశనం అయిపోతాయని యునెస్కో నివేదిక చెప్పింది.
ఆ నేపధ్యంలో చూస్తే శంకరాభరణం లాంటి సినిమాల అవసరం ఇప్పుడెంత ఉందో అర్ధం అవుతుంది.
ఈ రిలవెన్స్ లో శంకరాభరణం చిత్రాన్ని చూడాల్సి ఉంటుంది.
ఈ చిత్రానికి సంగీతం అందించిన మహదేవన్ జాతీయ స్తాయిలో ఉత్తమ సంగీత దర్శకుడు గా అవార్డు పొందారు.
శాస్త్రీయ సంగీతం తెలియని బాలసుబ్రహ్మణ్యం లోని మిమిక్రీ కళను నమ్మి ఆయనతో ఈ సినిమాకు పాటలు పాడించి మరో సాహసం చేశారు దర్శకులు విశ్వనాథ్.
అలా ఆ సినిమాకు పాడడం ద్వారా జాతీయ ఉత్తమ గాయకుడుగా పురస్కారం అందుకున్నారు బాలు.
తెలుగు సినిమాకు తొలి సారి జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం దక్కేలా చేసింది శంకరాభరణం . అయితే శోధ్ అనే హిందీ చిత్రంతో షేర్ చేసుకోవాల్సి వచ్చిందనుకోండి.
ఇలా అనేక విధాలుగా శంకరాభరణం అనేది తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయి.
Writer – భరధ్వాజ రంగవాజుల
Casual Talk with K.Vishwanath ||