నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మరపురాని మరువరాని చిత్రం ఆదిత్య 369. ఇంగ్లీష్ మూవీ టైమ్ మెషీన్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 1991, ఆగస్ట్ 18న విడుదలై అఖండ విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో బాలయ్య నటించడానికి ఒప్పుకోడానికి , దానికి సింగీతం దర్శకత్వం వహించడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రముఖ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఒకసారి ఫ్లైట్ లో వెళుతుంటే.. పక్క సీట్లో శ్రీదేవి మూవీస్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కూర్చున్నారట. ఆయనకి బాలు.. సింగీతం దగ్గర ఒక టైమ్ మెషీన్ కథ ఉందని, దాన్ని ఒకసారి వినమని చెప్పారట. కథ విన్న కృష్ణప్రసాద్ కు మైండ్లో వెంటనే హీరోగా బాలయ్య స్ట్రైక్ అయ్యారట. కథ బాగా నచ్చేసి బాలకృష్ణు సంప్రదించారట. సింగీతం మీద బాలకృష్ణకు గౌరవ భావం ఉండడం, కథ బాగా నచ్చడంతో బాలయ్య వెంటనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా చిత్రీకరణకు 110 రోజులు పట్టిందట. మొదట్లో ఈ సినిమాకు పి. సి. శ్రీరాం ఛాయాగ్రాహకుడు. ఆయనకు అత్యవసరంగా శస్త్రచికిత్స జరపవలసి రావడంతో ఆయన బాధ్యతను వి. ఎస్. ఆర్. స్వామి, కబీల్ లాల్ కి అప్పగించారు. మొదట్లో సుమారు 1 కోటి 30 లక్షలు అవుతుందనుకున్న బడ్జెట్ తర్వాత మరో 30 లక్షలు అదనంగా అయింది. చిత్రీకరణలో వేసిన సెట్లు, వాటికి కలిగిన ఆదరణ చూసి డిస్ట్రిబ్యూటర్లు ఈ అదనపు సొమ్మును వెచ్చించడానికి ముందుకు వచ్చారు. దీంతో సినిమాకు కోటి 52 లక్షలు ఖర్చు అయింది. మొదట్లో ఈ సినిమాకు యుగపురుషుడు, ఆదిత్యుడు అనే పేర్లు అనుకున్నారు. తర్వాత ఆదిత్య అని పేరు పెట్టి టైం ట్రావెలింగ్ కాబట్టి 369 అనే ఆరోహణా క్రమంలోని అంకెలు చేర్చారు. ఈ కింది ఫోటో .. ఆదిత్య 369 సెట్లోకి అజారుద్దీన్ వచ్చినప్పుడు క్లిక్ మనినించినది.