ముగ్ధమోహన రూపం.. ఉంగరాల జుట్టు.. ఉరకలేసే ప్రాయం.. ఉవ్వెత్తున ఎగసిపడే యవ్వనం ఆమె చిరునామా. ఆమె చిలిపిగా ఒక లుక్కేసి.. కొంటెగా నవ్వితే.. ప్రపంచ ప్రేక్షకుల మదిలో ఏదో అలజడి. విల్లు లాంటి ఒళ్ళును వంచి ఆమె సంధించే మదన అస్త్రాలకు మత్తెక్కని వాడే లేడంటే అతిశయోక్తి కాదు. ఆమే ప్రపంచ సుందరి, విశ్వమోహిని, శృంగార దేవత మార్లిన్ మన్రో. నటిగా, మోడల్‌గా, గాయనిగా ఆమె ఏం చేసినా… అభిమానులు ఊగిపోయారు. ఉర్రూతలూగారు. వెర్రెత్తిపోయారు. ‘బ్లాండ్‌ బాండ్‌షెల్‌’, ‘సెక్స్‌ సింబల్‌’ లాంటి అనేక బిరుదులతో పిలుచుకుని మురిసిపోయారు.

మార్లిన్‌మాన్రోకి అందమైన రూపమే వరమైంది. మోడలింగ్‌ రంగం ఎర్రతివాచీ పరిచింది. స్థిరత్వం కోసం పదహారేళ్లకే తనకన్నా తొమ్మిదేళ్లు పెద్దయిన వ్యక్తిని తొలి వివాహం చేసుకుంది. మోడలింగ్‌ తర్వాత సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. కొన్ని చిన్న చిన్న వేషాల తర్వాత స్టార్‌డమ్‌ వచ్చి పడింది. ఆమె సినిమాలు అప్పట్లోనే 200 మిలియన్‌ డాలర్లను వసూలు చేశాయి. ఇది 2020 లెక్కలతో పోలిస్తే 2 బిలియన్‌ డాలర్లకు పైమాటే. ‘యాజ్‌ యంగ్‌ యాజ్‌ యు ఫీల్‌’, ‘మంకీ బిజినెస్‌’, ‘క్లాష్‌ బై నైట్‌’, ‘డోన్ట్‌ బాదర్‌ టు నాక్‌’, ‘హౌటు మ్యారీ ఎ మిలియనీర్‌’, ‘సెవెన్‌ ఇయర్స్‌ ఇచ్‌’ ‘ద ప్రిన్స్‌ అండ్‌ ద షో గర్ల్‌’, ‘సమ్‌ లైకిట్‌ హాట్‌’, ‘ద మిస్‌ఫిట్స్‌’ లాంటి చిత్రాలు ఆమంటే విపరీతమైన క్రేజ్‌ను సృష్టించాయి. ‘సెవెన్‌ ఇయర్స్‌ ఇచ్‌’లో గాలికి గౌను ఎగిరిపోతుంటే సర్దుకుంటున్న మాన్రో ఫోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆ భంగిమలో ఆమె విగ్రహాన్ని కూడా నెలకొల్పడం విశేషం. ఒక దశలో పత్రికలకు పూర్తి నగ్నంగా ఫోజులిచ్చిందనే వివాదాలు కూడా ఆమెను చుట్టుముట్టాయి. ఉత్తమ నటిగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు కూడా అందుకుంది. ఈమె తన 36 ఏళ్ల వయసులో అనూహ్యంగా మరణించింది. ఇప్పటికీ ఆమె మరణం ప్రపంచ సినిమా చరిత్రలో ఒక మిస్టరీగా మిగిలిపోయింది. నేడు మార్లిన్ మాన్రో జయంతి. ఈ సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!