ఆయన గన్ పడితే జేమ్స్ బాండ్ .. గుర్రమెక్కితే కౌబాయ్… విల్లంబులు ధరిస్తే అల్లూరి సీతారామరాజు… కురుక్షేత్రంలో అర్జునుడు.. జానపదాల్లో మహాబలుడు… చారిత్రకాల్లో విశ్వనాథనాయకుడు. టోటల్ గా తెలుగు సినిమా సాంకేతికతను సింహాసనమెక్కించిన మకుటం లేని మహారాజు. అంతేకాదు.. మాస్ జనం గుండెల్లో కిరాయి కోటిగాడు.. రామరాజ్యంలో భీమరాజు. పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. అభిమానులకు సూపర్ స్టార్ కృష్ణ. ఇప్పటి తరం హీరోలు ఒక సినిమా చేయడానికే ఏదో మహాయజ్నం చేసినట్టు ఫీలయిపోతున్నారు. కానీ అప్పట్లో కృష్ణ రోజుకు మూడు షిఫ్ట్ ల్లో..అవసరమైతే నాలుగు షిఫ్టుల్లో పనిచేసి.. సంవత్సరానికి యావరేజ్ గా 15 సినిమాల వరకూ నటించిన తిరుగులేని హీరో.  ఆయన జయాపజయాలకు అతీతం. దశాబ్దాలు దానికి గడిచినా పట్టదు కాలదోషం. జనాదరణ పొందిన చిత్రాలు చేయడం, అత్యధిక సినిమాల్లో నటించడం, చలన చిత్రానికి సాంకేతిక హంగులు అద్దడం, మూడు షిప్టుల్లో పనిచేయడం, సాహసోపేతమైన కథలను ఎంచుకోవడం, కర్షక, కార్మికుల పక్షాన నటించడం, చిత్ర నిర్మాణం, దర్శకత్వం, స్టూడియో నిర్వహణ…ఇవన్నీ ఘట్టమనేని కృష్ణను అక్షరాలా తెలుగు చిత్ర పరిశ్రమకు సూపర్‌స్టార్‌ను చేశాయి. కృష్ణ గమనం, ప్రయాణం, ఘనత కేవలం ఆయనకే సాధ్యం. ‘తేనెమనసులు’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణ.. కెరీర్ బిగినింగ్ లోనే జేమ్స్ బాండ్, కౌబాయ్ చిత్రాల్లోనూ నటించి.. ఆ తరహా చిత్రాలకు ఒక బ్రాండ్ గా మారారు. ఆపై ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించి.. తెలుగు ప్రేక్షకులకు అభిమాన హీరో అయ్యారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు కృష్ణ . 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశారు.

కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతను, వివిధ జోనర్లను  పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తిచేశారు. ఇందుకోసం మూడు షిఫ్టులు చొప్పున వేగంగా సినిమాలు పూర్తిచేసేవారు. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. నేడు కృష్ణ  పుట్టినరోజు. నేటితో  78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!