ఎలాంటి భావాన్నైనా తన ముఖంలో పలికించగలిగే నటుడు ఆయన. ఎలాంటి పాత్రనైనా .. అవలీలగా పోషించి మెప్పించ గలిగే  నటుడు . ఎలాంటి సన్నివేశాన్నైనా తన సెన్సాఫ్ హ్యూమర్ తో రక్తికట్టించగలిగే ఉత్తమ విలన్ ఆయన. పేరు పరేశ్ రావల్. హిందీ, గుజరాతీ, మరాఠీ, తెలుగు, ఇంగ్లిషు భాషలను అనర్గళంగా మాట్లాడగలిగే పరేష్‌ రావల్, జాతీయ అవార్డు అందుకున్న నటుడు. ‘వో చౌక్రి’, ‘సర్‌’ చిత్రాలకు ఉత్తమ సహాయనటుడిగా జాతీయ బహుమతులు అందుకున్నారు. ‘క్షణ క్షణం’ , ‘మనీ’ , ‘గోవిందా గోవిందా’ , ‘బావగారూ బాగున్నారా’ , ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్‌’  చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు. గుజరాత్‌ కుటుంబానికి చెందిన పరేష్, నటి స్వరూప్‌ సంపత్‌ను వివాహమాడారు.. 1985లో ‘అర్జున్‌’ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు పరేశ్ రావల్.

ముంబైలో  ఒక సాధారణ కుటుంబంలో జ‌న్మించారు రావల్ . ఆయన  ఎటువంటి యాక్టింగ్ స్కూలుకు వెళ్ల‌కుండానే ఉత్త‌మ న‌టునిగా ఎదిగారు. తోటి క‌ళాకారుల‌ను చూస్తూ న‌ట‌న‌కు మెరుగులు దిద్దుకున్నారు. ఇంజనీర్ కావాలని, డాక్టర్ కావాలని త‌పించిన‌ ప‌రేష్ కుటుంబ ప‌రిస్థితుల దృష్ట్యా ఆ విష‌యాన్ని ఎప్పుడూ ఇంటిలోని వారికి చెప్ప‌లేద‌ట‌. అత‌ని ఇంటి ద‌గ్గ‌ర కొంద‌రు నాట‌కాలు వేస్తుంటే, వాటిని ప‌రేష్ గ‌మ‌నించేవాడు. వారిని అనుక‌రిస్తుండేవాడు. వారు నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యేవారు. పరేష్‌రావ‌ల్ తాను న‌జ‌రుద్దీన్ షా అభిమానినని, అతనిని చూసి ఏదోఒక‌టి నేర్చుకుంటానని చెబుతుంటారు. నేడు పరేష్ రావల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ ఉత్తమ విలన్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!