జీవితాంతం ఒకరు దేహంగానూ, మరొకరు ప్రాణంగానూ బతికిన స్నేహితులు బాపు రమణల మొట్టమొదటి చిత్రం సాక్షి. అప్పటికి చాలా చిత్రాల్లో మాటలు రాసిన ముళ్ళపూడివారు.. సాక్షికి కథ అందించగా.. అంతవరకూ సినిమా మీద ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని బాపు.. తొలిసారిగా మెగా ఫోన్ పట్టుకొని .. సెల్యులాయిడ్ పైన కూడా అందమైన బొమ్మగా సాక్షిని తీర్చిదిద్దారు. కృష్ణ , విజయ నిర్మల అప్పుడే సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ ఇద్దరూ తొలిసారిగా వెండితెరమీద జోడీగా నటించి.. ఆ సినిమా షూట్ చేసిన గ్రామంలోని ఒకగుడిలో పెళ్లిచేసుకొని ఒకటయ్యారు. హై నూన్ అనే కౌబాయి సినిమా ఇంగ్లీష్ చిత్రం ఆధారంగా తెరకెక్కిన సాక్షి సినిమాలో తడిగుడ్డలతో గొంతులు కోసే ప్రతికథానాయకుడు మునసుబు పాత్రను రంగస్థలం మీద అపార అనుభవజ్నుడైన విన్నకోట రామన్నపంతులు పోషించారు. ఈ ఫోటోలో కృష్ణ, రాజబాబు తో ఉన్నది ఆయనే. విన్నకోట రామన్నపంతులు మరెవరో కాదు.. ముద్ద మందారం చిత్రంలో హీరో గా నటించి మెప్పించి.. ఎఫ్ 2 లో అంతేగా అంతేగా అంటూ కామెడీ చేసిన ప్రదీప్ తాతగారు. సాక్షి విన్నకోట మొదటి సినిమా కాదు వారు అంతకు ముందే పాపులర్ సినిమా నటుడు. కన్యాశుల్కం లో అగ్ని అగ్నిహోత్రావధానులు పాత్ర పోషించింది ఆయనే. ఆయనంటే జంధ్యాలకు చాలా గౌరవం. అందుకే ఆయన మొదటి చిత్రం ముద్దమందారం లో హీరోగా ఆయన మనవడ్నే ఎంపికచేశారు. అంతేకాక విన్న కోట రామన్న పంతులు తో ఓ పాత్ర కూడా పోషింప చేసారు. ఆయన విజయవాడ లో ప్రముఖ న్యాయవాది. బెజవాడ బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడి గా కూడ పనిచేసారు. అలాగే జంధ్యాల నాటకాలకు ఆయనే ముందుమాట రాసారు. జంధ్యాలని రంగస్థలం మీద ప్రొత్సహించింది కూడా ఈయనే.