తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా యావత్తు ప్రపంచ సినీ చరిత్రలోనే డైరెక్టర్ అనే స్థానానికి ఒక గుర్తింపు ఒక గౌరవం తెచ్చిన మహోన్నత వ్యక్తి ‘దర్శకరత్న’ దాసరి నారాయణ రావు. కాబట్టే గత ఏడాది తెలుగు సినీ పరిశ్రమ ఆయన పుట్టిన రోజైన మే 4న ‘డైరెక్టర్స్ డే’ గా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ప్రకటించారు. దాసరి కేవలం ఒక వ్యక్తి కాదు ఆయనో వ్యవస్థ. ఆయనలో దాగున్న బహుముఖ ప్రజ్ఞా విశేషాలైన ‘కథ.. స్క్రీన్ ప్లే.. మాటలు.. పాటలు.. దర్శకత్వం.. నటన.. ‘ అందుకు నిదర్శనం. సినిమా రంగంలోని 24 శాఖలపై పట్టున్న ప్రతిభాశాలి దాసరి. ఆయన నటుడుగా, సంభాషణల రచయితగా, పాటల రచయితగా, సినిమా రంగంలో ఒక డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబ్యూటర్ గా కార్మిక నాయక శ్రేయోభిలాషి దాసరి నారాయణ రావు. దర్శకుడిగా ఆయన తొలి చిత్రం ‘తాత – మనవడు’ మొదలుకుని చివరి సినిమా ‘ఎర్రబస్సు’ వరకు అన్ని చిత్రాలతో సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన దిగ్దర్శకరత్న దాసరి నారాయణ రావు. ఎందరెందరికో పద్మ అవార్డులైన పద్మ భూషణ్, పద్మ విభూషన్, దాదా సాహెబ్ ఫాల్కే, వంటి అవార్డులు వరిస్తున్న కూడా తనకు గల ‘దర్శకరత్న’ అనే బిరుదు భారతరత్న కన్నా మిన్నగా భావించే వారు దాసరి. సినీ దార్శనీకుడు ‘దర్శకరత్న’ దాసరి జయంతి సందర్భంగా ఆయన్ను గురించిన విషయాలు…
రంగస్థలం నుండి చిత్రరంగం వైపు దాసరి ప్రయాణం :
దాసరి నారాయణరావు 1942, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించారు. కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీ పట్ట పొంది దాసరి అనేక నాటకపోటీలలో నటించేవారు. అతి తక్కువ కాలంలోనే రంగ స్థల ప్రతిభావంతుడైన నటుడిగా, నాటక రచయితగా స్థాయి నుండి సినిమా దర్శకుడిగా గుర్తింపు పొందారు. అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దాసరి దోహదపడ్డారు.
దాసరి తొలి సినిమా నుండే ప్రయోగాలు :
దాసరి చేసిన సినిమాలు చాలా వరకు ప్రయోగంతో కూడుకున్న సినిమాలుగా పేర్కొనవచ్చు. ఆయన ప్రత్యేకత మొదటి సినిమా నుండే కనబరిచారు. అప్పటి ప్రముఖ హాస్య నటులు రాజాబాబును హీరోగా ఎన్నుకుని ఎస్వీఆర్, అంజలి, కైకాల సత్యనారాయణ, విజయనిర్మల ముఖ్య పాత్రలను ఎంపిక చేసుకుని తెరకెక్కించిన సినిమా ‘తాత – మనవడు’. ఈ సినిమాలో కుటుంబ వ్యవస్థలోని అనుబంధాలను డబ్బు ఏ విధంగా శాసిస్తుందో చక్కగా తెరకెక్కించారు. ఈ లోకంలోని బంధాలు – అనుబంధాలు, ప్రేమానురాగాలు అనేవి కేవలం దబ్బబుకు మాత్రమే దాసోహం అంటూ సాగే ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం’ అనే సందేశాత్మక సినిమాగా నిలిచింది. అలాగే ‘స్వర్గం – నరకం’, ‘తూర్పు – పడమర’ సినిమాలు ఆయనలోని వైవిధ్యమైన దర్శకత్వ ప్రతిభకు తార్కాణం.
ఎన్టీఆర్,ఏఎన్ఆర్ లతో దాసరి :
ఎన్టీఆర్ తో ‘మనుషులంతా ఒక్కటే’, ‘బొబ్బిలి పులి’, ‘సర్దార్ పాపరాయుడు’, వంటి సినిమాలు ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశానికి పరోక్షంగా ఈ సినిమాలు నిలుస్తాయి. ఏఎన్ఆర్ తో ‘ప్రేమాభిషేకం’ వంటి ప్రయోగాత్మక ప్రేమకథను సినిమాగా చేసిన దాసరి ఆయన్ను ఒక నడివయసు వ్యక్తిగా ‘మేఘసందేశం’ లాంటి ప్రేమకథ సినిమా తీయడం కూడా తీయడం ఆయనకు మాత్రమే సాధ్యం అని నిరూపించుకున్నాడు. అనేక సామాజిక హితం కోరే సినిమాలతో పాటు చక్కని సందేశాత్మక కుటుంబ కథా చిత్రాలను కూడా అందించారు. వాటిలో ‘అమ్మ రాజీనామా’, ‘సూరిగాడు’ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రేమ కథా సినిమాలను పరిశీలిస్తే అందులో ‘భగ్న ప్రేమకథలు’, ‘ప్రేమాభిషేకం’, ‘మజ్ను’ సినిమాలు నిలుస్తాయి. శోభన్ బాబు తో చేసిన ‘గోరింటాకు’, ‘స్వయంవరం’ సినిమాలు తెలుగు ప్రేక్షకుల మదిలో కలకాలం నిలిచిపోయే సినిమాలుగా నిలుస్తాయి. సమాజంలోన వర్ణ వివక్షను ప్రశ్నించే ‘బలిపీఠం’ కావచ్చు అవినీతి మీద తీసిన ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’, దొరల పెత్తనం మీద ‘ఒసేయ్ రాములమ్మ’ లాంటి సినిమాలను పేర్కొనవచ్చును.
చిరు, నాగ్, వెంకీ, బాలయ్యతో దాసరి :
తెలుగు సినీరంగానికి రెండు కళ్ళుగా భావించే ఎన్టీఆర్,ఏఎన్ఆర్ లతో సూపర్ హిట్స్ అందించిన దాసరి నారాయణ రావు ఆ తర్వాత తరం అగ్ర హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలతో ఆ స్థాయిలో విజయవంతమైన సినిమాలను అందించలేక పోయారు. దానికి కారణం కూడా లేకపోలేదు. చిన్న సినిమాలే సినీరంగానికి ఆయువు అని బలంగా నమ్మే వారిలో ముందుండేవారు దాసరి. ఆ విధానంగా ఎన్నో విజయవంతమైన చిన్న సినిమాలను దర్శకత్వం చేస్తూ నిర్మించారు. దాసరి 100వ సినిమాగా మెగాస్టార్ తో చేసిన ‘లంకేశ్వరుడు’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయం పొందలేదు గానీ ఈ సినిమాలోని ‘పదహారేళ్ళ వయసు’, ‘జివ్వుమని కొండగాలి’ పాటలతో మ్యూజికల్ గా అలరించింది. ఆ తర్వాత చిరంజీవితో మరే సినిమాకు దర్శకత్వం చేయలేదు దాసరి. ముత్యాల సుబ్బయ్య చేసిన ‘హిట్లర్’ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్ర పోషించి మెప్పించారు దాసరి. నాగార్జునను భగ్న ప్రేమికుడిగా చూపిస్తూ ‘ఇది తొలి రాత్రి కదలని రాత్రి’ అంటూ పాడే ‘మజ్ను’ గా చూపించారు దాసరి. వెంకటేష్ తో ‘టూ టౌన్ రౌడీ’, ‘బ్రహ్మ పుత్రుడు’ వంటి సినిమాలకు దర్శకత్వం చేశారు దాసరి. బాలకృష్ణతో ‘పరమ వీర చక్ర’ అనే సినిమాను తీసిన అది ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది.
కొడుక్కి కలిసి రాని దాసరి కష్టం :
దాసరి రెండవ కుమారుడు అరుణ్ తో పలు సినిమాలను నిర్మిస్తూ దర్శకత్వం చేశారు. కానీ అవి ఏవి కూడా తను సినిమా రంగంలో హీరోగా నిలబడేందుకు ఉపయోగపడలేదనే చెప్పాలి. ఆ విధంగా ఎంతో మందిని వెండితెరకు పరిచయం చేస్తూ మంచి నటులుగా ఎదగడానికి దోహదపడిన దాసరి ఆయన వారసత్వంగా కొడుకును సినిమా రంగంలో నిలపలేకపోయారు.
దాసరి ఘనత :
దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా, నాయకుడిగా భిన్నమైన పాత్రలు పోషించిన దాసరి తెలుగు సినిమాకు ‘కేసరి’ లాంటి వారు. దాసరి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో అత్యధిక చిత్రాలను చేసిన దర్శకుడుగా ఆయన పేరు చేరింది. ఆయన సినీ ప్రయాణంలో 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించడమే కాకుండా 53 సినిమాలను స్వయంగా నిర్మించారు. దాసరి 250 పైగా చిత్రాలకు సంభాషణ రచయితగా, గీతరచయితగా కూడా పనిచేశారు. ఆయన తెలుగు, తమిళం, కన్నడ వంటి పలు భాషా సినిమాలలో నటించి పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆయన కేవలం వెండితెర పైనే కాకుండా బుల్లితెర అయినా టీవీ రంగంలోను ప్రతిభ చూపారు. దాసరి కేవలం సినిమా రంగానికే పరిమితం కాకుండా రాజకీయాల్లోను ప్రవేశించారు. దాసరి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరి కేంద్రమంత్రిగా ఎన్నికై బొగ్గు మంత్రిత్వ శాఖ బాధ్యతలను స్వీకరించారు. దాసరి పత్రిక అధినేతగాను తనదైన శైలిని చూపించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు దాసరి. ఏ సమస్య వచ్చినా కూడా వాటిని పరిష్కరిస్తూ దాసరి కార్మిక సంఘాలకు ఎంతో తోడ్పాటును అందించేవారు.
‘కృషితో నాస్తి దుర్భిక్షం‘ అనే దానికి తార్కాణంగా నిలుస్తుంది దాసరి జీవితం. ఆయన పుట్టినరోజును దర్శకుల దినోత్సవంగా తెలుగు పరిశ్రమ జరుపుకోవడం ఆయనకు ఇచ్చే గొప్ప గౌరవంగా భావించే అంశం. ఆ సినీ దార్శనీకుడు ‘దర్శకరత్న’ దాసరి జయంతి సందర్భంగా ఘననివాళులు అందిస్తుంది మూవీ వాల్యూమ్.