కమల్ హాసన్ మరుగుజ్జుగా నటించడం ఇప్పటికీ మిస్టరీయే – ప్రయోగాలకు పెట్టింది పేరు లోకనాయకుడు కమల్ హాసన్. ఆయన ఏ పాత్రను పోషించినా అందులో నూటికి నూరు శాతం పెర్ఫెక్షన్ ఉంటేనేగానీ ఓ పట్టాన షాట్ ఒకే అనడానికి ఒప్పుకోడు. కమల్ హాసన్ నటజీవితంలో అలాంటి ఓ ఛాలెంజింగ్ పాత్ర ఎదురైంది. ఆ పాత్ర పేరు అప్పు. విచిత్ర సోదరులు చిత్రంలోని మరుగుజ్జు పాత్ర ఆయనకోసమే పుట్టిందని ఒప్పుకోక తప్పదు. నిజానికి కమల్ హాసన్ కు మరుగుజ్జు పాత్ర చేయాలనే కోరిక ‘పుణ్ణగై మణ్ణన్’ (తెలుగులో డ్యాన్స్ మాస్టర్ ) చిత్రం చేస్తున్నప్పుడు కలిగిందట. ఆ విషయం దర్శకుడు బాలచందర్ ముందు పెట్టాడు. దాంతో కమల్ ను ఒక్కసారి తేరిపార చూసి. ఇలాంటి ఐడియాలు రావడానికి నువ్వేం తింటావు అని అడిగి.. కమల్ కోసం అందులో ఒక సీన్ పెట్టారు. అది కమల్ కు ఏమాత్రం సంతృప్తినివ్వలేదు. ఆ తర్వాత ఫుల్ లెంత్ మరుగుజ్జు పాత్రను రాసుకొని .. అపూర్వసహోదరగళ్ అనే టైటిల్ తో సింగీతం దర్శకత్వంలో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో సినిమా మొదలు పెట్టారు. అయితే ఆ మరుగుజ్జు పాత్రను కమల్ ఎలా పోషించారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కమల్ హాసన్ ఆ సీక్రెట్ ను ఇంతవరకూ ఎక్కడా బైటపెట్టిన దాఖలాలు లేవు. చాలా మంది నిపుణులు రీసెర్చ్ చేసి కనిపెట్టిన అంశాలు ఏంటంటే.. కమల్ హాసన్ మోకాళ్ళకు సెపెరేట్ గా షూస్ డిజైన్ చేసి అమర్చి.. ఆయన పాదాలనుంచి మోకాళ్ళ వరకూ గొయ్యి తీసి కెమెరా ను ఆ గోతిలో ఉంచి చిత్రీకరించారని కొందరు అనుకుంటారు.మరికొందరు మోకాళ్ళను మడతపెట్టి దానికి షూస్ అమర్చారని కొందరు చెప్పుకుంటారు. ఏది ఏమైనా ఆ సీక్రెట్ ను కమల్ హాసనే రివీల్ చేస్తే బాగుంటుందని .. కొందరంటారు. అయితే కమల్ హాసన్ త్వరలోనే అప్పు పాత్ర మేకింగ్ పై ఒక వీడియో ను రిలీజ్ చేస్తానని చెప్పారు. కానీ దాని మీద ఎవరికీ నమ్మకం లేదు. మరి ఆ రహస్యం ఏంటో కమల్ హాసన్ ఎప్పుడు చెబుతారో చూడాలి.