చక్రల్లాంటి కళ్ళు.. చంద్రబింబం లాంటి ముఖం.. ఎల్లప్పుడూ చిరునవ్వు చిగురించే పెదవులు.. వాటికి అందమైన అభినయాన్ని తగిలించి .. ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయడం ఆమెకు పరిపాటి. నిండైన విగ్రహం.. నటనలో నిగ్రహం. సహజమైన ఆ అభినేత్రి సౌందర్య. సావిత్రి తర్వాత దక్షిణాది వెండితెరకు దొరికిన అపురూప సౌందర్యమది. అందం, అభినయం రెండూ పక్కపక్కనే  ప్రయాణం చేస్తుంటే ,  ఆ సొగసును తనివితీరా చూడాలనిపిస్తుంది కదూ. సౌందర్య నటిస్తుంటే అలాగే అనిపించేది. ఆ కన్నడ కస్తూరి కాటుక కళ్ళతో మెస్మమరైజ్ చేసే సౌందర్య లహరి.

సాధారణంగా ..  ఏ వర్ధమాన కథానాయిక అయినా సరే  బాగా పైకి రావడానికి గ్లామర్ ను ఆయుధంగా ప్రయోగిస్తూంటుంది. అది వర్కవుట్ అవ్చొచ్చు, కాకపోవచ్చు. అయితే అలాంటివేమీ చేయకుండానే సౌత్ లో కథానాయికగా ఓ వెలుగు వెలిగింది సౌందర్య. అదే ఆమె గొప్పతనం.  ఎక్స్ పోజింగ్ అనే పదానికి ఆమడ దూరంలో ఉంటూనే..  దక్షిణాది ప్రేక్షకులకు బాగా దగ్గరవడం సౌందర్య టాలెంట్. చాలామంది హీరోయిన్స్‌ తాము డాక్టర్‌ కాబోయి యాక్టర్స్‌గా మారామంటూ రిథమిక్‌గా చెప్తుంటారు. కానీ… సౌందర్య వైద్య విద్య చదువుతూ సినిమా అవకాశాలు వెతుక్కుని రావడంతో… ఆ చదువును అర్ధాంతరంగా ఆపి సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. సౌందర్యకి మొదటి నుంచి సినిమా పరిచయమే. ఆమె తండ్రి కె.ఎస్‌.సత్యనారాయణ కన్నడ సినిమాలకు రచయితగా, నిర్మాతగా వ్యవహరించేవారు. స్థూడియోలు, సినీ వాతావరణం ఆమెకి కొత్త కాదు. 1992లో సౌందర్య సినీ అరంగేట్రం జరిగింది. మొదటి చిత్రం మాతృభాషలోనే గంధర్వ. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు హంసలేఖ. అదే సంవత్సరం తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సౌందర్య. ఇక మనవరాలి పెళ్ళి చిత్రంతో తెలుగులో కథానాయికగా అడుగుపెట్టింది. ఆ తరువాత వరుసగా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలతో బిజీ అయింది. సౌత్ లో దాదాపు అందరు అగ్రకథానాయకులతోనూ నటించి మెప్పించింది ఆ సుందరి. నేడు సౌందర్య వర్ధంతి. ఈ సందర్భంగా ఆ అపురూప కథానాయికకు  ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!