కోలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వివేక్ తీవ్రమైన గుండెపోటుతో గురువారం మధ్యాహ్నం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు కన్నుమూశారు. వివేక్ మరణంతో తమిళ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.
ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ వెండితెరకు పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మనదిల్ ఉరుది వేండం’ అనే చిత్రంతో వివేక్ నటుడిగా తెరంగేట్రం చేశారు. అనంతరం ఆయన హాస్యనటుడిగా దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు. వివేక్ 2009లో పద్మశ్రీ అవార్డ్ ను అందుకున్నారు. తమిళ స్టార్ హీరోలైన రజనీకాంత్, సూర్య, అజిత్, విక్రమ్ తెలుగు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు వివేక్. ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘సింగం’, ‘సింగం-2’, ‘విశ్వాసం’, రఘువరన్ బి.టెక్, బాయ్స్ తదితర చిత్రాలతో వివేక్ తెలుగువారిని కూడా తన హాస్యంతో మెప్పించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు తనతో ఉన్న అనుబందాన్ని గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమం ద్వారా సంతాపం ప్రకటించారు.