చూపు తిప్పుకోనివ్వని సౌందర్యం.. సహజత్వం ఉట్టిపడే అభినయం.. చిరునవ్వుకు చిరునామా.. ఆమె పేరు జయప్రద. అందం, అభినయం ఆమె ఆభరణాలు. తెలుగు సినిమాతో నట ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాళీ, మరాఠీ భాషల్లో దాదాపు 250 చిత్రాలకు పైగానే నటించి మెప్పించిన అద్భుత నటీమణి. 70ల నుంచి 90ల వరకూ దక్షిణాది తో పాటు ఉత్తరాది చిత్ర పరిశ్రమలోనూ ఒక వెలుగు వెలిగిన నట విదుషీ మణి.. అందాల రాణి ఆమె. ఇటు పక్కా కమర్షియల్ చిత్రాల్లో గ్లామరస్ బ్యూటీగా మెప్పించగలదు, అటు అవార్డు సినిమాల్లో అభినయ ప్రధాన్యం కలిగిన పాత్రతోనూ మెప్పించ గలదు.

జయప్రద అసలు పేరు రవణం లలితారాణి. చిన్న వయసులోనే సంగీతం, నృత్యం నేర్చుకుని పట్టు పెంచుకొన్నారు. 13 యేళ్ల వయసులో స్కూల్‌లో జరిగిన వేడుకలో నృత్య ప్రదర్శన చేయడం చూసిన దర్శకుడు కె.బి.తిలక్‌ ‘భూమికోసం’ సినిమాలో అవకాశమిచ్చారు. ఆ చిత్రానికిగానూ జయప్రద అందుకున్న పారితోషికం రూ: 10. కానీ ఆ మూడు నిమిషాల పాటని చూశాక పరిశ్రమకి చెందిన పలువురు దర్శకులు జయప్రదకి అవకాశాలు ఇచ్చారు. అలా పదిహేడేళ్లకే ఆమె పెద్ద స్టార్‌గా అవతరించారు. బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘అంతులేని కథ’, కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘సిరి సిరి మువ్వ’ ఆమెని నటిగా నిలబెట్టాయి. ‘సీతాకళ్యాణం’, ‘అడవిరాముడు’ తదితర చిత్రాలతో జయప్రద పేరు మార్మోగిపోయింది. ‘యమగోల’, ‘కురుక్షేత్రం’, ‘రామకృష్ణులు’, ‘మేలుకొలుపు’, ‘రాజపుత్ర రహస్యం’, ‘అందమైన అనుభవం’, ‘రంగూన్‌ రౌడీ’, ‘సీతారాములు’, ‘సర్కర్‌ రాముడు’, ‘చండీప్రియ’, ‘శ్రీవారి ముచ్చట్లు’, ‘స్వయంవరం’, ‘కృష్ణార్జునులు’, ‘సాగర సంగమం’, ‘సింహాసనం’, ‘దేవత’… ఇలా విజయవంతమైన చిత్రాలెన్నో చేశారు జయప్రద. కన్నడలో రాజ్‌కుమార్‌తోనూ, తమిళంలో కమల్‌హాసన్, రజనీకాంత్‌లతోనూ, తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చిరంజీవి, హిందీలో అమితాబ్‌ బచ్చన్, జితేంద్ర, మలయాళంలో మోహన్‌లాల్‌… ఇలా అగ్ర కథానాయకుల సరసన నటించిన జయప్రద ఆయా భాషల్లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. కథానాయికగా అవకాశాలు తగ్గాక వయసుకు తగ్గ పాత్రలు చేసి మెప్పించారు. రాజకీయాలతో బిజీ కావడంతో మధ్యలో కొంతకాలం సినిమా రంగానికి దూరమయ్యారు. ఇటీవల  సువర్ణసుందరి’ చిత్రంతో  రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వి.ఎన్.ఆదిత్య డైరెక్షన్ లో రాజేంద్ర ప్రసాద్ తో కలిసి లవ్ @ 65 సినిమా లో నటిస్తున్నారు.ఈరోజు జయప్రద పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ అందాల రాణికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!