చిత్రం : సుల్తాన్‌

నటీనటులు : కార్తీ, రష్మిక మందన్న, యోగిబాబు, నెపోలియ‌న్‌, లాల్, రామ‌చంద్రరాజు తదితరులు

బ్యానర్ : డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్

సంగీతం : వివేక్‌- మెర్విన్

ఎడిటింగ్‌ : రూబెన్

ఛాయగ్రహణం : స‌త్యన్‌ సూర్య‌న్

దర్శకత్వం : బక్కియరాజ్‌ కణ్ణన్

నిర్మాత : య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు

విడుదల తేది : 02-04-2021

కార్తీ తమిళ్ నటుడైన కూడా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ తో పాటు మార్కెట్ ఉన్న హీరో. ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. కార్తీ గత చిత్రం ‘దొంగ’తో పోలిస్తే  ‘ఖైదీ’ తెలుగులో డబ్‌ అయి మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆయన ర‌ష్మిక మంద‌న్నతో జోడి కట్టి ‘సుల్తాన్‌’గా యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ నేపథ్యంలో సాగే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ద‌ర్శకుడు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు నిర్మించారు. మరి ‘సుల్తాన్‌’గా వచ్చిన కార్తీ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ చిత్రం అలరించిందా..? లేదా..? అనేది రివ్యూలో చూద్దాం…

కథ :

విక్రమ్ సుల్తాన్(కార్తీ) ముంబైలోని ఓ కంపెనీలో రోబోటిక్ ఇంజనీర్‌. ఆయన తండ్రి సేతుపతి(నెపోలియన్‌)మాత్రం అన్యాయాలను ఎదురించే ఒక నాయకుడిగా ఉంటాడు. తన దగ్గర కౌరవులుగా పిలవబడే 100మందిని సైన్యంగా కలిగి ఉంటాడు. సుల్తాన్‌కు మాత్రం ఈ గొడవలు, వాగ్వాదాలు అనేవి అసలు ఇష్టపడడు. కాకపొతే ఒక ఊహించని సంఘటనతో ఆయన సోదరులుగా భావించే 100 మంది బాధ్యత స్వీకరించ వలిసిన పరిస్థితి వస్తుంది. అలా సుల్తాన్‌ తన 100 మంది సోదరులతో కలిసి ఓ గ్రామానికి వెళ్తాడు. అక్కడ రుఖ్మిణి(రష్మిక మందన్న)ను చూసి ప్రేమలో పడతాడు. కానీ రుక్మిణి గ్రామానికి ఓ పెద్ద సమస్య ఉందని తెలుసుకొని, దానిని పరిష్కరిస్తాడు. అసలు ఆ గ్రామానికి ఉన్న సమస్య ఏంటి? 100 మంది బాధ్యతను సుల్తాన్‌ ఎందుకు తీసుకున్నాడు? కార్తీ తన సైన్యంగా భావించే కౌరవులతో ఏం చేశాడు? అనేదే మిగతా కథ.

కథ విశ్లేషణ :

దర్శకుడు బక్కియరాజ్‌ కణ్ణన్ మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపున కాకుండా కౌరవుల పక్షాన ఉంటే ఎలా ఉంటుంది? అనే ఒక చిన్న పాయింట్‌ తీసుకుని ‘సుల్తాన్‌’ సినిమాను తెరకెక్కించాడు. అయితే కాన్సెప్ట్‌ కొత్తగా ఉన్నా.. తెరపై చూపించడంలో మాత్రం దర్శకుడు ఓ మేరకే సక్సెస్ అయ్యారు. . రొటీన్ బ్యాక్ డ్రాప్‌ తో సాగిన ఈ సినిమా మన తెలుగు నేటివిటికి దగ్గర గా లేకపోవడమనేది ఈ చిత్రానికి మైనసనే చెప్పాలి. కేవలం నేటి తరానికి కావాల్సిన అంశాలను జోడించి తెరపై చూపించే ప్రయత్నం చేశాడు.

మొదటి భాగం సరదా సన్నివేశాలతో కథను నడిపించిన దర్శకుడు… అసలు కథని ద్వితియార్ధంలో చూపించాడు. అయితే సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉండటం ప్రేక్షకుడికి సహన పరీక్ష.  ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ రామ్‌ లాంటి స్టార్‌ విలన్‌ ఉన్నప్పటికీ.. వారి పాత్రని బలంగా తీర్చిదిద్దలేకపోవడం సినిమాకి మైనస్ గా చెప్పవచ్చు. కొన్ని యాక్షన్‌ సన్నివేశాలలో కూడా అక్కడక్కడ లాజిక్‌ మిస్‌ అయినట్లు అనిపిస్తుంది. కానీ, కార్తీ, రష్మిక మధ్య వచ్చే లవ్‌ సీన్స్‌ మాత్రం బాగా కుదిరాయి. మళ్ళీ మళ్ళీ చూసేంతలా ఉన్నాయి. 

 

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

సుల్తాన్‌ కార్తీ పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్‌ కి తగినది ఈ సినిమా. తెరపై ఆధ్యాంతం స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించాడు. పోరాట సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. పల్లెటూరి అమ్మాయిగా రష్మిక మందన్న కేవలం కొన్ని సీన్స్, పాటలకే పరిమితం. తన నటనకు తగ్గ సీన్స్ అంతగా లేవనే చెప్పాలి. ఉన్న కొన్ని సీన్లలో తన మార్క్ నటనతో ఆకట్టుకుంది. హీరో తండ్రి పాత్రలో చేసిన నెపోలియ‌న్, విలన్ పాత్రలో చేసిన ‘కేజీఎఫ్‌’ ఫేమ్ రామ్ ఫెర్ఫార్మెన్స్ ‌, అలాగే మరో విలన్ నవాబ్ షా కూడా మంచి నటనను కనబరిచాడు. ఇక యోగిబాబు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు బక్కియరాజ్‌ తను అనుకున్న కొత్త పాయింట్‌ ఆసక్తిగా ఉన్నా తెరపై చూపించడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. వివేక్  -మెర్విన్‌ సమకూర్చిన పాటలు, యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం పర్లేదు. ఎడిటర్‌ రూబెన్‌ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమాలో చాలా సన్నివేశాలు సాగాతీతగా అనిపిస్తాయి. కావున ఇంకాస్త క్రిస్ప్‌గా కట్‌ చేసి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

రేటింగ్ : 3/5

గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే

  వైల్డ్ డాగ్ రివ్యూ

Leave a comment

error: Content is protected !!