“సరిగ్గా నిలబడటం కూడా చేత కాదు నన్ను కొట్టడానికి తయారవ్వా..!?” ఇది తన సినిమాలోని ప్రతినాయకుడు నితిన్ను సవాలు చేసిన సన్నివేశం. నిజమే మరి హీరో అంటే మంచి దేహదారుడ్యం ఉండి విలన్ను ఎదురించాలి కదా..! కానీ తన తొలి సినిమాకి ఇటువంటి లక్షణాలు ఏమి లేకుండానే అమాయకమైన చిలిపి చూపులతో అమ్మాయిలకు గాలం విసిరిన ‘అల్లరి బుల్లోడు’ నితిన్. తను ప్రేమించిన అమ్మాయి ప్రేమను పొందడం కోసం ‘శ్రీ ఆంజనేయం’ జెండాను చేత పట్టి తొలి చిత్రంతోనే ప్రేక్షకులు తన కెరీర్ కి ‘జయం’ అంటూ ఆశీర్వదించారు. అదే ‘సంబరం’తో ‘సై’ అంటూ సినిమాలు చేసి యూత్ ‘దిల్’ లో స్థానం సంపాదించాడు నితిన్. ఆ తర్వతా చేసిన సినిమాలు వరుస పరాజయం అవుతున్న… దురదృష్టం తనని ‘టక్కరి’ లా వెంటాడుతున్న నిరాశ నిస్పృహలకు చోటు ఇవ్వకుండా ‘ధైర్యం’తో అడుగులు వేస్తూ సినిమాపై ‘ఇష్క్’ తో ‘విక్టరి’ పొందాడు నితిన్. ఈ రోజు నితిన్ 38వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు…


తెలుగు సినిమా పరిశ్రమలో కాంతారావు తర్వాత తెలంగాణ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరో నితిన్. నితిన్‌ పూర్తి పేరు నితిన్ కుమార్‌ రెడ్డి. మార్చి 30న 1983 లోసుధాకర్‌రెడ్డి, విద్యారెడ్డి దంపతులకు నిజామాబాద్‌లో జన్మించాడు నితిన్‌. తండ్రి సినీ డిస్ట్రిబ్యూటర్‌ కావడంతో ఇంట్లో సినిమా వాతావరణం ఉండేది. దాంతో సినిమాలంటే చిన్నప్పటి నుంచీ బాగా ఆసక్తి ఉండేది. చిన్నప్పుడు చిరంజీవి, వయసొచ్చాక పవన్‌ కల్యాణ్‌ నితిన్‌ అభిమాన నటులు.

నటుడవాలనే ఆలోచన కలిగించిన ‘తొలిప్రేమ’

‘తొలిప్రేమ’ సినిమాను థియేటర్లో 28 సార్లు చూశానని… ఇంట్లో సీడీ పెట్టుకుని ఎన్నిసార్లు చూసి ఉంటానో లెక్కలేదని… నిజానికి పవన్‌కల్యాణ్‌ ‘తొలిప్రేమ’ చిత్రాన్ని చూసి నటించాలనే కోరిక పుట్టిందని అనేక సందర్భంలో నితిన్‌ చెప్పాడు.

తొలి అవకాశం :

‘నువ్వు-నేను’ సినిమా సమయంలో డైరెక్టర్ తేజ.. నితిన్ ని చూసి తన తర్వాత సినిమా హీరోగా ఛాన్స్ ఇచ్చాడు. తండ్రి సపోర్ట్ కూడ తోడవడంతో నితిన్ ‘హీరో’ గా ఎదగడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఇక తొలి సినిమా ‘జయం’ సక్సెస్ తర్వాత ఇండస్ట్రీ మొత్తం నితిన్ గురించే మాట్లాడుకుంది. తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నాడు నితిన్.

కెరీర్ గ్రాఫ్ :
నితిన్ తెలుగు సినీ ఇండస్ట్రీ లో తన తొలి అడుగును ‘జయం’తో ఆరంభించి ప్రేక్షకుల ‘దిల్’ లో స్థానం సంపాదించుకున్న యువ హీరో. ఆ ‘సంబరం’ తో చేసిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలు యావరేజ్ గా సాగినప్పటికి మంచి నటుడిగా పరిణితి చెంది… యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు నితిన్. రాజమౌళి డైరెక్షన్ లో చేసిన ‘సై’ సినిమాతో స్టార్ డం సక్సెస్ ను పొందాడు. అలా తారా స్థాయి విజయాన్ని చూసిన నితిన్ కెరీర్ తర్వాత వైకుంఠపాళీ లో నిచ్చెన స్థానంలో ఉండగా పాముకి చిక్కి కిందకు పడిపోయే పరిస్థితి వచ్చింది. దాదాపుగా సక్సెస్ కోసం దశాబ్ద కాలం పాటు ఎదురు చూశాడు నితిన్. ఆ దశాబ్ద కాలంలో చేసిన సినిమాలు ‘అల్లరి బుల్లోడు’, ‘ధైర్యం’, ‘రామ్’, ‘టక్కరి’, ‘ఆటాడిస్తా’, ‘విక్టరి’, ‘హీరో’, ‘ద్రోణ’, ‘అగ్యాత్’ (హింది), ‘అడవి’ (తెలుగు), ‘రెచ్చిపో’, ‘సీతారాముల కళ్యాణంలంకలో…’, ‘మారో’.

సినిమామే నమ్ముకుంటూ… విజయం కోసం తపిస్తూ…

‘ఇష్క్’ తో చేసిన కృషికి మళ్ళీ ప్రేక్షలకుల హృదయాలను తనదైన మార్క్ తో కూడిన వరుస లవ్ స్టోరీస్ తో తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ మార్క్ రెఫరెన్స్ ను వాడుకుంటూ ప్రేక్షకుల హృదయాలను ‘గుండె జారి గల్లంతయ్యేలా’ చేసాడు నితిన్. తర్వాత చేసిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’, ‘హార్ట్ ఎటాక్’, ‘చిన్నదాన నీకోసం’ సినిమాలు మ్యూజికల్ గా అలరించాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అఆ’ సినిమాతో మరో భారి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నితిన్. అంచనాలతో విడుదలైన ‘లై’, సినిమాతో పాటు ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలు ఫ్లాప్ చిత్రాలుగా నిలిచాయి. లాక్ డౌన్ ముందు వచ్చిన ‘భీష్మ’ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు నితిన్. ఈ ఏడాది లాక్ డౌన్ తర్వాత ‘చెక్’, ‘రంగ్ దే’ వంటి రెండు వైవిధ్య సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు నితిన్.

ఇక నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఎన్‌ . సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో ఫస్ట్‌ లుక్‌ ను , ఫస్ట్ గ్లింప్స్ ని నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు చిత్ర యూనిట్.  ఈ సినిమా జూన్ 11న విడుదలకానుంది. ఇలా మరెన్నో విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ… నటుడిగా మంచి గుర్తుంపు పొందుతూ… కెరీర్ సక్సెస్ ఫుల్  గా కొనసాగాలని కోరుకుంటూ బర్త్ డే విషేష్ అందిస్తోంది మూవీ వాల్యూం.

Leave a comment

error: Content is protected !!