చిత్రం : తెల్లవారితే గురువారం

నటీనటులు : శ్రీ సింహా, చిత్ర శుక్ల, మిష నారంగ్, రాజీవ్ కనకాల, అజయ్, సత్య, వైవా హర్ష తదితరులు

నిర్మాణ సంస్థ : వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్

సంగీతం : కాల భైరవ

ఎడిటింగ్‌ : సత్య గిడులూరి

ఛాయా గ్రహణం : సురేశ్ ర‌గుతు

నిర్మాతలు : రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : మణికాంత్ జెల్లీ

విడుదల తేది : 27-03-2021

‘మత్తు వదలరా’ సినిమాతో పరిచయమైన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహా హీరోగా పర్వాలేదనిపించాడు. ఇప్పుడు ‘తెల్లవారితే గురువారం’అనే ఆసక్తికరమైన టైటిల్‌తో యూత్ & కుటుంబ ప్రేక్షకులను అలరించే కథతో ముందుకు వచ్చాడు. మణికాంత్ గెల్ల తెరకెక్కించిన ఈ సినిమాను  వారాహి, లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.  ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లతో చిత్రంపై భారీ అంచనాలే నమోదయ్యాయి. సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా రావడంతో ఈ మూవీపై ఆడియన్స్ లో బజ్ క్రియేట్‌ అయింది. ఇలా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించిందో రివ్యూలో చూద్దాం…

కథ :

వీరేంద్ర అలియాస్‌ వీరు(శ్రీసింహ), మధు (మిషా నారంగ్‌)లకు పెద్దలు కుదిర్చిన పెళ్లి. అయితే ఈ పెళ్లి వీరుకు ఇష్టం ఉండదు. దానికి కారణం డాక్టర్‌ కృష్ణవేణి(చిత్ర శుక్లా)ని వీరు ప్రేమించడం. దీంతో ఎలాగైనా ఈ పెళ్లిని క్యాన్సిల్‌ చేయాలని వీరు ప్రయత్నిస్తుంటాడు. తెల్లవారితే పెళ్లి అనగా.. వీరు ఇంట్లో నుంచి పారిపోవడానికి రెడీ అవుతాడు. అయితే మధ్యలో అతనికి పెళ్లి కూతురు మధు కూడా పారిపోతూ కనిపిస్తుంది.అసలు మధు ఎందుకు పారిపోయేందుకు ప్రయత్నించింది? ప్రేమించిన అమ్మాయి కోసం ఈ పెళ్లి క్యాన్సిల్‌ చేయించాలనుకున్న వీరు ప్రయత్నం ఫలించిందా? పారిపోయే క్రమంలో మధు, వీరుల జీవితాల్లో జరిగిన సంఘటనలు ఏమిటి ? చివరకు వీరు, మధు పెళ్లి జరిగిందా ? లేదా? అనేదే మిగతా కథ.

కథ విశ్లేషణ :

టాలీవుడ్ లో ఇది మంచి ప‌రిణామ‌మే అని చెప్పాలి. దానికి కారణం తెరపై కొత్త ర‌క‌మైన క‌థ‌లు వెలుగులోకి రావడమే. మన చుట్టూ జరిగే జీవితాల నుంచి సాగే కథలతో చిన్న చిన్న అంశాల ఆధారాలతో ఆస‌క్తిర‌క‌మైన క‌థ‌ల్ని మలచుకుని తెర‌పైకి తీసుకొస్తోంది యువ‌త‌రం. అయితే ఆ క‌థ‌ల్ని ప్రేక్షకులకు న‌చ్చేలా మ‌రింత ఆసక్తికరంగా  చెప్ప‌డంలోనే అక్కడక్కడ త‌డ‌బాటు క‌నిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ఈ క‌థలోనూ కొత్త‌ద‌నం ఉంది.  సున్నిత‌మైన అంశాల‌ను నిజాయ‌తీగా చెప్పే ప్రయత్నం చేశారు.  ఇలాంటి అంశాలు కూడా క‌థావ‌స్తువులుగా ఉప‌యోడ‌ప‌గతాయా? అని ఆశ్చ‌ర్య‌పోయేలా ర‌చ‌న కొనసాగింది. పెళ్ళంటేనే భ‌య‌ప‌డే ఓ అమ్మాయి  ప్రేమించిన అమ్మాయి కోసం పీటల మీద పెళ్లిని వద్దనుకునే ఓ అబ్బాయి. అస‌లు త‌న‌కేం కావాలో ఏ విషయంలోను స్ప‌ష్ట‌త లేని ఇంకో అమ్మాయి. ఈ మూడు పాత్ర‌ల చుట్టూ ఒక రాత్రి జ‌రిగే కథే సినిమా.  పెళ్లి ముహూర్తానికి ముందు ఇంటి నుంచి పారిపోయిన‌వాళ్ల గురించి మ‌నం వింటూనే ఉంటాం. ఆ అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ క‌థ‌ని మ‌లచిన తీరు మెప్పిస్తుంది. కాబోయే వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ పెళ్లి మంట‌పం నుంచి పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నించే ఆరంభ స‌న్నివేశాలతోనే ప్రేక్ష‌కుల్ని క‌థ‌లో లీనం చేశాడు ద‌ర్శ‌కుడు.  అక్క‌డ్నుంచి ఆ ఇద్ద‌రి ఫ్లాష్ బ్యాక్‌లతో క‌థ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. క‌థ‌లో నుంచే హాస్యం పండేలా ద‌ర్శ‌కుడు స‌న్నివేశాల్ని తీర్చిదిద్దిన తీరు మెప్పిస్తుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

‘మత్తు వదలరా’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీసింహా ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో చ‌క్క‌గా ఒదిగిపోయాడు. పాత్ర‌కి తగిన‌ట్టుగా అమాయ‌కంగా, ఆవేశంగా క‌నిపిస్తూ వినోదం పండించాడు. పెళ్లి అంటేనే భయపడే అమాయకపు అమ్మాయి మధు పాత్రలో మిషా నారంగ్‌ ఒదిగిపోయింది. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో  తెరపై అందంగా కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే అపోహలు అపార్థాలతో విడిపోవడానికి కూడా సిద్ధపడే అమ్మాయి కృష్ణవేణి పాత్రలో చిత్ర శుక్లా జీవించేసింది. సరైన నిర్ణయం తీసుకోకుండా, అయోమయంలో పడి హీరోని ఇబ్బందులకు గురిచేసే పాత్ర ఆమెది. ఎదుటివాళ్లు ఏం చెబుతున్నారో విన‌కుండా మాట్లాడే పాత్ర‌లో స‌త్య కామెడీ థియేటర్‌లో నవ్వులు పూయిస్తుంది. వైవాహ‌ర్ష‌, ర‌వి వ‌ర్మ‌, రాజీవ్ క‌న‌కాల‌, శ‌ర‌ణ్య త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగాల్లో సంగీతం, కెమెరా విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. కాల‌భైర‌వ పాట‌లు, నేప‌థ్య సంగీతం చిత్రానికి బ‌లాన్నిచ్చింది.  ‌మ‌ణికాంత్  గెల్లి  కొత్త క‌థ‌నైతే చెప్పాడు కానీ, దాన్ని మ‌రింత బిగువుతో  చెప్పి ఉంటే
సినిమా మరింత ఆకట్టుకునేది. ర‌చ‌యిత నాగేంద్ర పిల్లా క‌థ‌లో కొత్త‌ద‌నం ఉంది. నిర్మాణ విలువ‌లు ఆక‌ట్టుకుంటాయి.

రేటింగ్ : 3/5

Leave a comment

error: Content is protected !!