రామ్ చరణ్ తేజ “నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటి తెలుస్తుంది.” ఇవి ధృవ సినిమాలోని డైలాగ్ సరిగ్గా ఇదే సూత్రాన్ని నిజజీవితంలో ఆచరించాడు చరణ్… ముందుగా ఈ మెగా వారసుడు న‌టుడే కాద‌న్నారు.. కానీ ఇప్పుడు న‌టుడంటే ఇలా ఉంటాడురా అనిపించాడు. చిరంజీవికి త‌గ్గ త‌న‌యుడు కాదు.. ప్ర‌యోగాలంటే భ‌య‌ప‌డ‌తాడు అన్నారు.. కానీ ఇప్పుడు కొత్త క‌థ‌లు ఉంటే ఆయ‌న రెడీ అంటూ ద‌ర్శ‌కులే ఎగ‌బ‌డుతున్నారు. బ్యాడ్ బాయ్ అంటూ విమ‌ర్శించారు.. కానీ ఇప్పుడు ఎంత మంచివాడో అంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు. అలా తన ఇమేజ్ మార్చుకున్నాడు. కెరీర్ మొదట్లో ఒక మూసలో సినిమాలు చేసిన.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌లేడ‌ని కొందరు హేళన చేసారు.. కానీ ‘రంగస్థలం’ అనే సినిమాతో త‌నెంత గొప్ప న‌టున్నో అంద‌రికీ చూపించాడు. ఇలా ఒక్కో మైన‌స్ లెక్క‌లేసుకుంటూ వాటినే త‌న‌కు ప్ల‌స్‌లుగా మార్చుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్.

మెగాస్టార్ నట వారసుడిగా ‘చిరుత’గా అడుగుపెట్టి.. ఆ తర్వాత మూవీ ‘మగధీర’తో అప్పటివరకున్న టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగాధీరుడు అనిపించుకున్నాడు. ‘చిరుత’ సినిమాతో మెగా వార‌సుడిగా 14ఏళ్ల కిందట ఇండ‌స్ట్రీకి పరిచయమై తొలి సినిమాతోనే స‌త్తా చూపించాడు. ఆ త‌ర్వాత రాజ‌మౌళితో చేసిన ‘మ‌గ‌ధీర’ సినిమాతో కేవ‌లం ఒకే ఒక్క సినిమా అనుభ‌వం ఉన్న రామ్ చ‌ర‌ణ్ అప్ప‌టి వ‌ర‌కు ఉన్న 75 ఏళ్ల తెలుగు సినిమా చ‌రిత్ర రికార్డుల‌ను తిర‌గ‌రాసాడు. తెలుగు ఇండ‌స్ట్రీలో తొలిసారి 75 కోట్ల మార్క్ అందుకున్న హీరోగా స‌రికొత్త హిస్ట‌రీ క్రియేట్ చేసాడు.

 రెండవ సినిమాతోనే తారాస్థాయికి చేరుకున్న చరణ్ క్రేజ్ మూడవ సినిమాగా వచ్చిన ‘ఆరెంజ్’ లో న‌టుడిగా నిరూపించుకున్నా.. సినిమా ఫలితం మాత్రం పాతాళం దిశగా అతిపెద్ద పరాజయాన్ని చవిచూశాడు. అయితే ఆ వెనువెంట‌నే తండ్రి బాటలోనే మాస్ కమర్షియల్ నేపథ్యంతో చేసిన ‘ర‌చ్చ‌’, ‘నాయ‌క్’, ‘ఎవ‌డు’ సినిమాల‌తో మ‌ళ్లీ విజ‌యాలు అందుకుని మాస్ ఇమేజ్ లో తిరుగులేని స్టార్ డం ఉన్న తండ్రికి తగ్గ తనయుడుగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ మెగా వార‌సుడు. అలాగే ప్ర‌యోగాలు చేయ‌డ‌నే విమ‌ర్శ‌లు కూడా అందుకున్నాడు. మాస్ సినిమాలు.. రొటీన్ క‌థ‌లు మాత్రమే చేస్తాడంటూ చ‌ర‌ణ్ కు పదే పదే ఎదురైనా విమర్శలు లేకపోలేదు. ఇక ‘జంజీర్’ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రి ఇచ్చి అలనాటి అమితాబ్ క్లాసిక్‌ను చెడగొట్టాటంటూ విమర్శలు మూటగట్టుకున్నాడు చ‌ర‌ణ్. ఆ వెంట‌నే చేసిన ‘గోవిందుడు అంద‌రివాడేలే’ అంటూ తొలిసారి ఫ్యామిలీ డ్రామాలో ఒదిగిపోయాడు.

‘బ్రూస్ లీ లాంటి ఫ్యామిలి ఎమోషన్ డ్రామా ఉన్న కమర్షియల్ సినిమా పరాజయం పొందినప్పటికి చరణ్ డైలాగ్ డెలివరి, డైలాగ్స్ పలికే డిక్షన్ పై మంచి పట్టు సంపాదించుకున్నాడు. పొలిటికల్ క్రైం నేపథ్యంలో వచ్చిన ‘ధృవ’ సినిమాలో పోలిస్ ఆఫీసర్ లుక్లో సరికొత్తగా కనిపించి విజ‌యం అందుకున్నాడు. ఇక మూడేళ్ళ క్రితం వ‌చ్చిన ‘రంగ‌స్థ‌లం’ సినిమాలో చిట్టిబాబు పాత్రతో తను నటుడిగా కూడా మెప్పించగలడని అప్పటి వరకు తనని విమర్శించిన వారి ప్రశ్నలకు ఈ సినిమాతో సమాధానం ఇచ్చాడు చరణ్. ఈ సినిమాతో మ‌రోసారి ఇండ‌స్ట్రీ రికార్డుల‌కు చెక్ పెట్టాడు రామ్ చ‌ర‌ణ్. సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

పదేళ్ళ తర్వాత తండ్రి రీఎంట్రీ గా చేసిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో పాటు, చిరంజీవికి ఎప్పటినుండో చిరస్థాయిగా గుర్తుండిపోయే పాత్ర చేయాలనే ఉండే కోరికను ‘సైరా నరసింహరెడ్డి’ సినిమాతో తండ్రి కలను తీర్చిన తనయుడు చరణ్. ఈ సినిమాలను నిర్మించి నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నాడు రామ్ చరణ్.

ప్రస్తుతం రాజ‌మౌళి దర్సకత్వంలో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఏడాది క్రితం విడుదలైన ఎన్టీఆర్‌ వాయిస్ ఓవర్ తో వచ్చిన టీజర్ తో పాటు నిన్న విడుదలైన రౌద్రంతో ఉన్న అల్లూరి సీతారామరాజు పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాలో ‘సిద్ధ’గా అతిధి పాత్రలో నటిస్తు సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకి సంభందించిన తన లుక్ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీం. పోస్టర్ లో ఇద్దరు తుపాకులు చేత పట్టి నక్సల్స్ గా కనిపిస్తున్నారు. ధర్మానికి ధైర్యం తోడైతే ఎలా ఉంటుందో అది సినిమా చూసే తెలుసుకోవాలి.

సినిమా పరిశ్రమలో ఒక హీరోకి మరొక హీరోకి పోటి పరంగాను, అభిమానుల మధ్య జరిగే ఎన్నో వివాదాలకు చెక్ పెడుతూ సినిమా పరిశ్రమలో స్నేహపూర్వక వాతావరణాన్ని తెచ్చిన ఘనత రామ్ చరణ్ కే సొంతం. ఇలా మరెన్నో విజయ వంతమైన చిత్రాలలో మెగా వారసుడిగా మెప్పించి సినిమా పరిశ్రమలో అగ్రనటుడిగా కొనసాగాలని ఆశిస్తూ… పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది మూవీ వాల్యూం.

Leave a comment

error: Content is protected !!