తెలుగు వారికి ‘సోగ్గాడు’ అంటే ఎప్పటికీ ‘శోభన్ బాబే’. నేడు శోభన్ బాబు వర్ధంతి. సినిమా ఇండస్ట్రీలో అత్యధిక మహిళ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న అందగాడు. ఆయన అందమే కాదు శోభన్ బాబు హెయిర్ స్టైల్ కూడా చాలా ఫేమస్. ముఖ్యంగా శోభన్ రింగ్ అప్పటి యువతను బాగా ఆకట్టుకునేది. ఫ్యామిలి ఆడియన్స్ ను ఆ సినిమాలు చాలా బాగా అలరించేవి. ముఖ్యంగా ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్త పాత్రలు చాలా సినిమాల్లో పోషించారు. ప్రియురాలిని దూరం చేసుకున్న భగ్న ప్రేమికుడిగాను అనేక చిత్రాలు నటించారు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు.
శోభన్ బాబు అసలు పేరు ‘ఉప్పు శోభనా చలపతిరావు’. ఈయన కృష్ణా జిల్లా నందిగామలో 1937, జనవరి 14న జన్మించారు. సినిమాలంటే ఆయనకు ఎక్కడలేని ఇష్టం. ఎంతలా అంటే ‘మల్లీశ్వరి’ సినిమాను 20 సార్లు పైగా చూసి నటుడు అవ్వాలనుకున్నారు.
శోభన్ బాబు తొలి చిత్రం 1959 లో వచ్చిన ‘దైవబలం’ చిత్రంతో శోభన్ బాబు వెండితెరపై పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా నటించడం విశేషం. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన సీతారామకళ్యాణం’, ‘లవకుశ’, ‘నర్తనశాల’ వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు వేశారు. నర్తనశాలలోని ‘వీరాభిమన్యు’తో నటుడిగా మంచి గుర్తింపు పొందారు. అలా కెరీర్ తొలినాళ్లలో ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ వంటి నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
శోభన్ బాబు హీరోగా చేసిన మొదటి సినిమా ‘లోగుట్టు పెరుమాళ్ళకెరుక’ ఆతర్వాత వచ్చిన ‘బంగారు పంజరం’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ‘మనుషులు మారాలి’ సినిమా శోభన్ బాబు కెరీర్‌నే మలుపు తిప్పిన సినిమాగా నిలిచింది.
కె. విశ్వనాథ్ తో చేసిన శారద, జీవనజ్యోతి, జీవిత నౌక, కాలాంతకులు, చెల్లెలి కాపురం సినిమాలు, దాసరి నారాయణరావుతో చేసిన బలిపీఠం, గోరింటాకు, స్వయంవరం సినిమాలు, కార్తీక దీపం, ఏవండీ ఆవిడోచ్చింది, వంటి సినిమాలు మహిళా ప్రేక్షకులను మెప్పించాయి. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో రాముడిగా నటించి మెప్పించారు. తర్వాత సామాజిక నేపథ్యంలో తెరకెక్కిన ‘ధర్మపీఠం దద్దరిల్లింది’, ‘దేవాలయం’ సినిమాలు నటుడిగా శోభన్ బాబుకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆయన సినీ కెరీర్లో ఎక్కువగా ఒక నలుగురైదుగురు డైరెక్టర్స్‌తో సినిమాలు చేశాడు. కె.ఎస్ ప్రకాశరావు, కే.విశ్వనాథ్, బాపు, వి. మధుసుధనరావు, రాఘవేంద్రరావు, దాసరి నారాయణ రావు వీళ్లు ఎక్కువగా శోభన్ బాబుతో సినిమాలు రూపొందించేవారు.
మొదటి నుండి క్రమశిక్షణ కలిగిన నటుడిగానూ, సాయంత్రం 6 దాటితే షూటింగ్ కి ప్యాక్ అప్ చెప్పేసి మిగిలిన సమయాన్ని కుటుంబం కోసం కేటాయించే వారు. ఆదివారాల్లోను సినిమా షూటింగ్ చేసేవారు కాదు. తన సహచర నటీనటులకు డబ్బును భూమి మీద ఇన్వెస్ట్ చేయమని ఆర్ధిక సలహాలు కూడా ఇచ్చేవారు. శోభన్ బాబు ఏ నటుడు కూడా చేయనటువంటి సాహసమైన నిర్ణయం తీసుకున్నారు. అది ఆయన నటనకు రిటైర్మెంట్ ప్రకటించడం. ఆ తర్వాత మళ్ళీ ఎన్నడు ఆ సోగ్గాడు వెండితెరపై కనపడలేదు. తెలుగు సినిమా 75 ఏళ్ల వజ్రోత్సవాలు కార్యక్రమానికి ఆహ్వానం పంపిన కూడా సున్నితంగా తిరస్కరించారు. అందుకు కారణం ఆయన అభిమానుల దృష్టిలో ఎప్పటికి శోభన్ బాబు అంటే ‘సోగ్గాడి’ రూపమే గుర్తుండాలి అందుకే ఎటువంటి సభలలో ఫంక్షన్స్ కి హాజరయ్యే వారు కాదు.
శోభన్ బాబు తన ముప్పైఏళ్ల కెరీర్ లో మొత్తం 228 సినిమాల్లో యాక్ట్ చేశారు. శోభన్ బాబుకు ఐదుసార్లు నంది అవార్డులు, వరుసగా మూడు ఫిలింఫేర్లు అందుకుని రికార్డు క్రియేట్ చేశారు. ఆయన 2008 మార్చి 20 న చెన్నైలో కన్నుమూశారు. ఆయన లేకున్నా ఆయన చిత్రాలు ప్రేక్షకులను ఇప్పటికి అలరిస్తూనే ఉన్నాయి. ఆ సోగ్గాడి వర్ధంతి సందర్భంగా ఆత్మీయంగా గుర్తుచేసుకుంటూ నివాళులు సమర్పిస్తుంది మూవీ వాల్యూం.