తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన రూటే సెపరేటు… అనేక చిత్రాలలో తన వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ను అలరించి ఆయా సినిమాలకి కలెక్షన్స్ పెంచి బాక్సాఫీస్ ‘పెదరాయుడు’గా నిలిచిన ‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు అంటే. నేడు మోహన్ బాబు పుట్టినరోజు. ‘అసెంబ్లీ రౌడీ’గా మాస్ ఆడియన్స్ను మెప్పించినా…‘అల్లుడుగారి’గా క్లాస్ ఆడియన్స్ను అట్రాక్ట్ చేసిన అది ఆయనకే చెల్లింది.
మోహన్ బాబు అసలు పేరు ‘మంచు భక్తవత్సలం నాయుడు’. ఫిజిక్స్ లో డిగ్రీ చదివి తర్వాత ఫిజికల్ ట్రైనర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి సినిరంగ ప్రవేశం తర్వాత మోహన్ బాబుగా పేరు మార్చుకున్నారు. తన తండ్రి నారాయణస్వామినాయుడు జన్మనిస్తే.. మోహన్ బాబుకు నటుడిగా జన్మనిచ్చింది దాసరి నారాయణరావు. దాసరి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం- నరకం చిత్రంలో నటనతో లైమ్ లైట్ లోకొచ్చారు మోహన్ బాబు. దాసరిని గురువుగా, తండ్రి తర్వాత తండ్రిగా భావిస్తానని అనేక సందర్భాలలో తనపై గల గౌరవాన్ని, అభిమానాన్ని వ్యక్తపరిచారు మోహన్ బాబు.
తన 45 ఏళ్ల క్రితం ‘స్వర్గం నరకం’ సినిమా తో మొదలైన ఆ నటప్రపూర్ణుని నట ప్రస్థానం స్వర్గం నరకంలానే ఎన్నో ఎత్తు పల్లాలతో ఇప్పటికి అటు హీరోగాను.. విలక్షణ పాత్రలతోనూ.. నిర్మాతగానూ.. చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఆయన నటప్రస్థానం చూసుకుంటే తను నటుడిగా ఒక మూసధోరణికి మాత్రమే పరిమితం కాకుండా అటు హీరోగా.. విలన్ గా.. కమెడియన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా పాత్ర ఏదైనను కూడా దానిని సద్వినియోగం చేసుకుని ఆ పాత్రకు తనదైన విలక్షనను జోడించి మెప్పించడం మోహన్ బాబు ప్రత్యేకత. “తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి” అనేలా డైలాగ్ చెబితే మోహన్ బాబే చెప్పాలి.
మొత్తంగా చెప్పాలంటే విలన్ హీరో మేనరిజాన్ని కలబోసుకున్న విలక్షణమైన నటన మోహన్ బాబు సొంతం. సినిమా సినిమాకు నటనలో కొత్త వైవిధ్యాన్ని చూపిస్తూ.. చేసిన అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, శ్రీరాములయ్య, అడవిలో అన్న, కుంతీ పుత్రుడు, రౌడీ గారి పెళ్ళాం, సోగ్గాడి పెళ్ళాం, రౌడీ మొగుడు లాంటి సినిమాలలోని పాత్రలు నటుడిగా ఆయన స్థాయిని పెంచాయి. తను టాలీవుడ్ పెదరాయుడు అంతేకాదు.. నట ప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ ఇలాంటి బిరుదులెన్నో ఆయన నటనను మెచ్చి ప్రేక్షకులు అభిమానులు అందచేశారు.
మోహన్ బాబు నటుడిగా 550 పైగా సినిమాలు.. నిర్మాతగా 50 పైగా చిత్రాలు.. అలాగే ప్రస్తుత రాజకీయలలోను క్రియాశీలక పాత్రను పోషిస్తూ.. విద్యాసంస్థల అధినేతగాను సినీ రాజకీయ సామాజిక స్పృహ కలిగిన అతికొద్ది నటుల్లో ఆయన ఒకరు. దేనికి వెరవనితత్వం ఎవరికి లొంగని మనస్తత్వం ఆయనిది. మోహన్ బాబు చిత్ర పరిశ్రమకు చేసిన సేవాలకు గానూ కేంద్రప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది.
మోహన్ బాబు నటనకు 45యేళ్లు పూర్తి చేసుకున్న ఇప్పటికి తన నటనను కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా ఆయన నటనలో విలక్షణ వైవిధ్యం మాత్రం ఎక్కడ తగ్గలేదు. అదే ఉత్సహంతో అదే స్టైయిల్ తో సినిమాలను చేస్తూ ఉన్నారు. క్యారెక్టరైజేషన్ మేనరిజంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. ఆయన కోసం ఇప్పటికి కొత్త కొత్త పాత్రలు పుడుతూనే ఉన్నాయి. ఇటీవల సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. మోహన్ బాబు త్వరలో ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాటల రచయత డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇలానే మరెన్నో పాత్రలతో తనదైన నటనలో విలక్షణ వైవిధ్యం చూపిస్తూ ఉండాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది మూవీ వాల్యూం.