‘విక్టరీ’ వెంకటేశ్ పైకి కనబడే మనిషి వేరు. లోపల వేరు. తెరపైనే ఆయన నటుడు. మిగతా టైమ్‌లో జీవితాన్ని యధాతథంగా స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎప్పుడూ ఫిలాసఫీ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. ఆయన మాటల్లో ఎక్కడో తాత్విక చింతన కనబడుతూ ఉంటుంది. ఆయన ఇంట్లోనూ, ఆఫీస్‌లోనూ ఫిలాసఫీ బుక్సే ఎక్కువ ఉంటాయి. వెంకటేశ్ ఇప్పటి వరకు చెప్పిన ఫిలాసఫీల్లోటాప్ టెన్ .
1) మెటీరియల్ వరల్డ్‌కి నేను గోల్డెన్ స్ఫూన్‌తో పుట్టినట్లుగానే ఉంటుంది. దేశంలో ఎంతో పెద్ద అయినా, లోపల ‘పూర్’ గా ఉంటే జీవితం వృధా అని నా అభిప్రాయం.
2) అసలు చావంటే ఏంటో తెలుసుకోకుండా భయపడిపోతుంటారు. అయితే మరణమనేది శరీరానికి మాత్రమే అనుకున్నపుడు భయం ఉండదు. మన శరీరం చనిపోగానే అందులో ఉన్న ఆత్మ వేరే. తల్లి కడుపులో పడుతుందనే సత్యం తెలుసుకుంటే మరణం గురించి తెలుసుకుంటే భయపడం.
3) ఆధ్యాత్మికత అంటే నిరాడంబరంగా ఉండాల్సిన అవసరం లేదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు రాజ్యాలను ఎలారు. వైభవాలను అనుభవించారు. శాశ్వతాలకు, అశాశ్వతలకు వ్యత్యాసాన్ని తెలుసుకున్నారు.
4) రేపు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇవాళ సగం ఎనర్జీని వేస్ట్ చేసుకున్నట్లే.. భవిష్యత్‌లో ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. అసలు మనిషికి మనశ్శాంతి తగ్గేది ఎక్కువగా భవిష్యత్ గురించి ఆలోచించడం వల్లే.
5) మానవులు ఎప్పుడూ ఏదో కోరుకుంటారని దేవుడు పైకి వెళ్లిపోయాడు. అక్కడున్నా మానవులు వదల్లేదు. ఆ తర్వాత నీళ్ల లోపలికి వెళ్లిపోయాడు. అక్కడా వదిలిపెట్టలేదు. ఇక లాభం లేదని, ఇంతకన్నా సేఫ్ ప్లేస్ లేదని మనలోనే ఉండిపోయాడు. అది తెలుసుకోలేక మనం భయట వెతుకుతున్నాం. అదే మనలోనే ఉన్నాడని గ్రహిస్తే… దేవుడు మనవాడే అనే ఫీలింగ్ కలుగుతుంది.
6) భగవంతుడు మనకు ఎన్నో అద్భుతమైన అవకాశాలిస్తుంటాడు. వాటిని సద్వినియోగం చేసుకుని, నీవెందులో ఎదగాలనుకుంటున్నావో అందులో ఎదగాలి. దాంతోపాటే అంతర్లీనంగా కూడా ఎదగాలి. కేవలం బాహ్య ఎదుగుదలే నిజం అనుకుంటే తప్పు. అటు ఇంటర్నల్‌గా ఇటు ఎక్స్‌టర్నల్‌గా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి.
7) ఇక్కడ ఎవరూ ఎవరికి పోటీకాదు. ఒక విజయంతోనో, వైఫల్యంతోనో కొంపలు మునిగిపోయాయ. అయితే కొన్ని త్యాగాలు చేయక తప్పదు.
8) భక్తి, తాత్విక చింతన అనగానే అన్నిబంధాలకు దూరంగా, సన్యాసం తీసుకోవడం కాదు. ఈ ప్రయాణంలో మనం కొన్ని బాధ్యతలు నిర్వర్తించేందుకే వచ్చాం. వాటిని పూర్తి చేయాలి. మనం చేసే పని ఏమిటి? ఫలితం ఏమిటనేది మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటుంది.
9) యువకులుగా ఉన్నప్పుడు ఫిలాసఫీ ఎందుకు… ఎప్పుడో రిటైరయ్యాక ఆ గొడవ చూసుకోవచ్చనే ధోరణి పెరుగుతోంది. నిజానికి ఆత్మ విశ్లేషణ మొదలైతే, యువకులు మరింత చొరవతో జీవిత లక్ష్యాన్ని సాధిస్తారు.
10) ‘ఇది కావాలి’ అని నేనెప్పుడూ కోరుకోలేదు. వచ్చిన దాన్ని మాత్రం స్వీకరిస్తా. అలాగని ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చోకూడదు. ఇప్పుడు టైమ్ బాగోలేదు…. ఏది చేసినా కలిసి రావట్లేదు….. అని కొంతమంది కాలయాపన చేస్తుంటారు. అలా కాదు, కష్టపడండి. దానికి ఫలితం ఉంటుంది. భగవద్గీతలో చెప్పింది అదే. కర్మలను ఆచరించు అని.