కోటికోయిలలు ఒకేసారి గొంతెత్తి కూ..కూ..మని పాడితే వినిపించేంతటి గాన మాధుర్యం ఆమెది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, ఒరియా, అస్సామీ, బెంగాలీ, మళయాళంతో పాటు మరెన్నో భాషలలో పాటలు పాడడమే కాకుండా.. తన వివిధ్యమైన గాత్రంతో ఆయా భాషల ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసింది. ఆమె పేరు శ్రేయా ఘోషల్. విలక్షణమైన గాత్రంతో .. వైవిధ్యమైన స్వర విన్యాసాలతో ఇప్పటికీ తన పాటలతో శ్రోతల్ని అలరిస్తూనే ఉన్న శ్రేయా .. ఏ భాషలో పాట పాడినా.. ఆ ప్రాంతానికే చెందిన అమ్మాయేమో అనుకునేంత అద్వితీయంగా తన గానంతో శ్రోతలను మెప్పిస్తుంది. భాషా బేధమెరుగని స్వరం ఆమె సొంతం. అందుకే ఆమె భాషలతో తేడా లేకుండా తేనెలూరే స్వరమాధుర్యంతో సినీ, సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.
శ్రేయా ఘోషాల్ పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్లో జన్మించారు. ఆమె తండ్రి బిశ్వజీత్ ఘోషాల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఇంజనీరుగా పని చేసేవారు. ఆమె తల్లి సర్ మిష్తా ఘోషాల్ సాహిత్యంలో పోస్ట్ – గ్రాడ్యూయేట్. తన నాలుగో ఏట నుండే తన తల్లి దగ్గర హర్మోనియం నేర్చుకోవడం మొదలుపెట్టింది. చిన్నతనం నుంచే గాయనిగా ఎంతో ప్రతిభ చూపిన శ్రేయా ఘోషాల్ కెరీర్ 1996లో మలుపు తిరిగింది. ఆ ఏడాది ఓ ప్రైవేటు టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ‘సరిగమప‘ పిల్లల పాటల కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా అందులో విజేతగా కూడా నిలిచింది. ఆమె ప్రతిభను చూసిన సినీ ప్రముఖులు ఆమెకు సంగీతంలో 18 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. తొలి రోజుల్లో నేపథ్య గాయనిగా హిందీ ఇండస్ట్రీకే పరిమితమైన శ్రేయా ఘోషాల్.. తర్వాత దక్షిణ భారతదేశంలోనూ అడుగుపెట్టారు. తెలుగులో మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు‘లో ‘నువ్వేం మాయ చేశావో గాని..‘‘ అనే పాటతో తెలుగు వెండితెరను తన స్వరంతో అందరినీ అద్భుతంగా ఆకట్టుకుంది. ఎన్నో అవార్డులు.. అనేక భాషలలో తన గాన ప్రతిభ చూపిన శ్రేయా ఘోషాల్ ఇప్పటివరకు నాలుగు జాతీయ పురస్కారాలు, ఐదు ఉత్తరాది, నాలుగు దక్షిణాది ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది. అనేక రకాలైన భాషలలో ఎన్నో గానాలతో అందరినీ అలరించిన.. అలరిస్తున్న స్వరమాధురి.. గంధర్వ గాయని శ్రేయా ఘోషాల్ పుట్టినరోజు నేడు. ఈ సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.