కరోనా కారణంగా సైలెంటైపోయిన టాలీవుడ్ మళ్లీ ఊపిరి పీల్చుకుని జూలు విదిల్చింది. జనవరి, ఫిబ్రవరి నెలలో వచ్చిన ‘క్రాక్’, ‘ఉప్పెన’ సినిమాలతో థియేటర్లలో మళ్లీ సందడి వాతావరణం మొదలైంది. గతేడాది నెలల పాటు ఇంటికే పరిమితమైన సినిమా లవర్స్, ఫ్యాన్స్, ఆడియెన్స్ మొత్తం థియేటర్లకు క్యూ కట్టేస్తున్నారు.
దానికి తోడు సినిమా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు రావడంతో గడిచిన రెండు నెలల్లో అనేక సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. ఈ క్రమంలో మార్చి నెల 5న కూడా చాలా మూవీస్ థియేటర్లకు క్యూ కట్టబోతున్నాయి. అందులో ముందుగా…
‘ఏ1 ఎక్స్ ప్రెస్’
సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ విడుదల కానుంది. జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో తెలుగులో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఏ1 పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇందులో లావణ్య త్రిపాటి కథానాయికగా చేస్తుంది.
‘పవర్ ప్లే’
యంగ్ హీరో రాజ్ తరుణ్ డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా కాంబోలో వస్తున్న సినిమా ‘పవర్ ప్లే’. ఇందులో ‘అవును’ సినిమా ఫేం పూర్ణ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ధన్ రాజ్ , గెటప్ శీను తదితరులు ఇప్పటివరకు చేయని పాత్రల్లో ఈ సినిమాలో నటిస్తున్నారు.
‘ప్లే బ్యాక్’
బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవంతో పాటు సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ చిత్రానికి ఇంటిలిజెంట్ కథనందించిన హరి ప్రసాద్ జక్కా అలాంటి మరో డిఫరెంట్ అంట్ క్రియేటివ్ ఐడియాతో ఆడియెన్స్ ముందుకి ‘ప్లే బ్యాక్’ అనే సినిమాతో రాబోతున్నారు. ఇందులో హీరోగా ‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, హీరోయిన్ గా ‘మల్లేశం’ సినిమాతో ఆకట్టుకున్న అనన్య నాగళ్ల నటిస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
‘షాదీ ముబారక్’
బుల్లితెర పై ఆర్కే నాయుడిగా మంచి గుర్తింపు పొందిన ‘సాగర్’ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘షాదీ ముబారక్’ ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా పై కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అలరిస్తున్నాయి.
యష్ ‘గజకేసరి’
కె.జి.ఎఫ్ ఫేం ‘యష్’ హీరోగా కన్నడలో తను చేసిన హిట్ సినిమాను ‘గజకేసరి’ అనే పేరుతో తెలుగులో డబ్బింగ్ చిత్రంగా రానుంది. యష్ కు కె.జి.ఎఫ్ తో వచ్చిన క్రేజ్ తో ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో చూడాలి.
‘ఏకమ్’
‘ఏకమ్’ ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సర్క్యూట్ లో నాలుగు ఫిల్మ్ ఫేర్ ఆవార్డ్స్ రావడంతో అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అభిరామ్ వర్మ, తనికెళ్ల భరణి, శ్వేతావర్మ, కల్పిక గణేష్, అదితి మ్యాకల్ ప్రధాన పాత్రదారులుగా వరుణ్ వంశీ బి. దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
‘ఏ’ (ఎడి ఇన్ఫీనిటం)’
‘ఏ’ (ఎడి ఇన్ఫీనిటం)’ పేరుతో సస్పెస్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం లో నితిన్ ప్రసన్న హీరోగా ‘మళ్ళీరావా..!’ ఫేం ప్రీతి అస్రాని హీరోయిన్ గా యుగంధర్ ముని దర్శకత్వంలో గీత మిన్సాల నిర్మాతగా అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కింది. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి చేతుల మీద విడుదలవడంతో ఆడియన్స్ లో మంచి క్యూరియసిటి నెలకొంది.
‘క్లైమాక్స్’
విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నటించిన తాజా చిత్రం ‘క్లైమాక్స్’. ఈ చిత్రంలో సాషా సింగ్, శ్రీరెడ్డి, పృథ్వీ, శివ శంకర మాస్టర్, రమేష్ నటించారు. ఇటీవల రిలీజైన ఈ చిత్ర టీజర్లు, ట్రైలర్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ ఇచ్చింది.
‘దేవినేని’
నందమూరి తారకరత్న హీరోగా ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘దేవినేని’. దీనికి ‘బెజవాడ సింహం’ అనేది ట్యాగ్ లైన్. నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వం వహిస్తున్నారు. జీఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటించారు.
‘గర్జన’
‘రోజాపూలు’ ఫేం శ్రీ రాం హీరోగా అందాల తార ‘రాయ్ లక్ష్మి’ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘గర్జన’. జనాలపై పులి దాడి చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం కథ ఉండబోతుంది. దేవ్ గిల్, నైరావైష్ణవి, చంద్రన్ మీనన్ లు మిగతా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాలో ఓ ఫారెస్ట్ ఫామ్ హౌస్ లో ఉండే తల్లి, కూతురుపై పులి ఎటాక్ చేస్తుంది. ఆ పులి నుంచి తన కూతురు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆమె ఎలాంటి పోరాటం చేసింది అనే ఎలిమెంట్ తో సినిమా ఉంది. ఈ సినిమాను కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే ఇలాంటి కథ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుంది.పార్తిబన్ దర్శకత్వంలో తెరకెక్కింది.
‘తోట బావి’
ఇది మా ప్రేమ కథ అనే చిత్రంతో హీరోగా వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు యాంకర్ రవి. తాజాగా ‘తోట బావి’ అనే ఆసక్తికరమైన టైటిల్ తను హీరోగా గౌతమి హీరోయిన్ గా గద్వాల్ కింగ్స్ సమర్పణలో జోగులాంబ క్రియేషన్స్ పతాకంపై అంజి దేవండ్ల దర్శకత్వంలో ఆలూర్ ప్రకాష్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిచారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా తెరకెక్కింది.
‘సర్వం సిద్ధం’
గోవింద్‌రాజ్ ప్రధాన పాత్రలో అతిమళ్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి.వెంకట్ నిర్మిస్తున్న చిత్రం ‘సర్వం సిద్ధం’. ‘నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’ ఉపశీర్షిక. ఈ చిత్రం కామెడి నేపధ్యంలో తెరకెక్కింది. కిరణ్ మేడసాని,త్రిశంక్, అభిషేక్, లావణ్య, ఫరీనా రవళి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు అనిల్‌రావిపూడి రిలీజ్ చేయడంతో ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది.
విజయ్ సేతుపతి ‘విక్రమార్కుడు’
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా, సాయేషా సైగల్, మడోన్నాసెబాస్టియన్ హీరోయిన్లు గా వాయల శ్రీనివాసరావు సమర్పణలో ఆర్.కె.వి.కంబైన్స్ వాణి వెంకటరమణ సినిమాస్, క్రాంతి కీర్తన పతాకాలపై గోకుల్ (కా స్మోరా చిత్రం ఫేమ్) దర్శకత్వంలో నిర్మాతలు కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్, అప్పసాని సాంబశివరావులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “విక్రమార్కుడు”. దీనికి “ది రియల్ డాన్” అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి సిద్దార్థ సంగీతాన్ని అందించారు.
ఈ సినిమాలతో పాటు ‘రాయ అండ్ ది లాస్ట్ డ్రాగన్’ అనే హాలివుడ్ డబ్బింగ్ మూవీ మార్చ్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.