విద్యాసాగర్ మళయాళ చిత్రసీమలో తన స్వరవిన్యాసాలతో అలరిస్తున్న గొప్ప సంగీత దర్శకుడు మన తెలుగువారే. తెలుగునాట పుట్టి, తమిళనాట అడుగుపెట్టి తన ప్రతిభతో మలయాళ చిత్రసీమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నారు. విద్యాసాగర్ కళలకు పెట్టింది పేరైన విజయనగరం జిల్లాలోని అమలాపురంలో తండ్రి రామచందర్, తల్లి సూర్యకాంతంలకు 1962లో జన్మించారు. తాత ఉపద్రష్ణ నరసింహమూర్తి బొబ్బిలి సంస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేసేవారు. తండ్రికి కూడా సంగీతంలో ప్రవేశం ఉండుట వలన తండ్రి వద్దనే కర్ణాటక సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న విద్యాసాగర్ తరువాత ఇతర గురువుల వద్ద మరింత సాధన చేశారు. ఆ పై క్లాసికల్ గిటార్ నేర్చుకోవడానికి మద్రాసుకి వెళ్లారు. అక్కడ మాస్టర్ ధన్ రాజ్ వద్ద గిటార్ క్లాసులు నేర్చుకున్నారు. అక్కడే ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ తో కలసి ధనరాజ్ మాస్టర్ వద్ద గిటార్, పియానోలలో శిక్షణ పొందాడు.అక్కడి నుండి వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకునేందుకు లండన్ వెళ్ళారు. లండన్ నుండి తిరిగి వచ్చాక సినిమాలకు నేపథ్య సంగీతం అందించడం మొదలెట్టారు.

విద్యాసాగర్, ‘పూ మనం’ తమిళ చిత్రంతో సంగీత దర్శకుడయ్యారు. ఆ సినిమాలో తను కంపోజ్ చేసిన “ఎన్ అన్బే ఎన్ నెంజిల్…” అంటూ సాగే పాటకు విశేషాదరణ లభించింది. తరువాత కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన ‘ధర్మతేజ’ (1989)తో తెలుగులో తొలిసారి స్వరాలు పలికించారు. తన స్వరాల్లో సంప్రదాయ సంగీతానికి పెద్ద పీట వేస్తూనే, అనువైన విధంగా సరికొత్త బాణీలను మేళవించేవారు విద్యాసాగర్. తెలుగులో తమ్మారెడ్డి భరద్వాజ తెరకెక్కించిన ‘అలజడి’ సినిమాతో విద్యాసాగర్ కు మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత తమ్మారెడ్డి భరద్వాజ రూపొందించిన పలు చిత్రాలకు విద్యాసాగర్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగారు. తన వద్దకి వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలుకోకుండా పలు పాటలతో జనాన్ని ఆకట్టుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో త్రిపాత్రాభినయం చేసిన ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రానికి విద్యాసాగర్ సంగీతంలో వచ్చిన పాటలు ‘రాజశేఖరా ఆగలేనురా పైటలో స్వరాలనే మీటి చూడరా’ అంటు వెన్నెలకంటి కలం నుండి జారిన ఆ పాట ఇప్పటికి సంగీతప్రియులను అలరిస్తూనే ఉంది. విద్యాసాగర్ ఇ.వి.వి. సత్యనారాయణ తెరకెక్కించిన “ఆమె, ఆలీబాబా అరడజను దొంగలు, తాళి” వంటి చిత్ర విజయాలలో విద్యాసాగర్ బాణీలకు ప్రత్యేకస్థానం ఉంది. ఈ చిత్రాలే కాదు జే.డి. చక్రవర్తి సూరి లోని “నిన్నటి దాకా నేను ” సాంగ్ సూపర్ హిట్ , ఇక శ్రీకాంత్ ఒట్టేసి చెబుతున్న చిత్రాలు కూడ మ్యూజికల్ గా పెద్ద సక్సెస్ ని అందుకున్నాయి. దాదాపు వంద పై చిలుకు తెలుగు చిత్రాలకు సంగీతం అందించారు. అయితే మాతృభాషలో తన ప్రతిభకు ఆశించిన స్థాయిలో తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. కాని తన బాణీలకు తమిళ, మళయాళ భాషల్లో మంచి క్రేజ్ ను సంపాదించాయి. యాక్షన్ హీరో అర్జున్ నటించిన పలు చిత్రాలకు విద్యాసాగర్ అందించిన మ్యూజిక్ ఎస్సెట్ గా నిలిచాయి. మళయాళ చిత్రసీమలో ఒకానొక సమయంలో విద్యాసాగర్ స్వరాలతో రూపొందిన చిత్రాలే విజయవిహారం చేశాయి. అక్కడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గానూ విద్యాసాగర్ జేజేలు అందుకున్నారు. విద్యాసాగర్ బాణీలను తెలుగు చిత్రాలకు సంగీతం సమకూర్చిన పలువురు వాటిని అనుసరించేవారు. అలా తన బాణీలను తెలుగులో కాపీ కొట్టి ఎందరో మ్యూజిక్ డైరెక్టర్స్ గా సక్సెస్ అయ్యారు. వాటిని చూసిన ప్రతిసారి మాతృభాషలో రాణించలేక పోయానే అనే బాధ కలిగేది అని ఓ సందర్భంలో అన్నారు.

కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వరాభిషేకం’ చిత్రానికి సంగీతం అందించే అవకాశం వచ్చింది. ఆయన సినిమాలనగానే సంగీతసాహిత్యానికి పెద్దపీట వేస్తారు. అలాగే చిత్రం ‘స్వరాభిషేకం’ టైటిల్ కు తగినట్టే సంగీతానికి ప్రాధాన్యత ఉన్న సినిమా అవ్వడంతో విద్యాసాగర్ ఆ సినిమాను ఒక సవాల్ గా స్వీకరించి సంప్రదాయ సంగీతాన్ని అందించారు. ఆ చిత్రానికి 2004లో విద్యాసాగర్ ను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా నిలిపి జాతీయ అవార్డ్ వచ్చేలా చేసింది. విద్యాసాగర్ సంగీతానికి అంతకు ముందు మళయాళ, తమిళ చిత్రసీమల్లో పలు అవార్డులూ రివార్డులూ లభించాయి. తమిళనాడు ప్రభుత్వం నుండి ‘కలైమామణి’ అవార్డునూ దక్కించుకున్నారు. పలు మార్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులూ సంపాదించారు. అన్నిటికంటే కూడా మాతృభాషలో ‘స్వరాభిషేకం’తో జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా నిలవడం అన్ని అవార్డ్ ల కన్న మిన్నగా భావిస్తానని ఓ ఇంటర్వ్యూలో తెలియచేశారు. ఆ స్వర విద్యాసాగరునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది మూవీ వాల్యుం.

 

Leave a comment

error: Content is protected !!