న్యాచుర‌ల్ స్టార్ నాని దర్శకుడు కావాలనే కోరికతో ఫీల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ‘అష్టాచమ్మా’తో నాని హీరోగా పరిచయం చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో నాని ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఘంటా న‌వీన్ బాబు ఒక‌వేళ హీరో కాక‌పోయుంటే ఇప్పుడు అంద‌రూ అత‌న్ని ఇలాగే పిలిచేవారు. కానీ ఇప్పుడు మాత్రం అంతా అత‌న్ని ముద్దు ముద్దుగా ‘నాని’ అని పిలుచుకుంటున్నారు. అత‌డే మ‌న న్యాచుర‌ల్ స్టార్ నాని. ఫిబ్రవరి 24న ఈయన పుట్టిన రోజు. 36 వసంతాలు పూర్తి చేసుకుని 37వ ఏట అడుగు పెడుతున్నాడు నాని. ఈయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చి అప్పుడే 13 ఏళ్లైపోయింది.

అష్టాచ‌మ్మాతో హీరో అయిన నాని ఆ తర్వాత ఎన్నో విజయాలు అందుకున్నాడు. ఎంతో మ్యాజిక్ చేసాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి, ఆ తర్వాత రేడియో జాకీగా మారి, నటుడిగా ఎదిగి ఇప్పుడు తనదైన సహజమైన నటనతో న్యాచుర‌ల్ స్టార్ గా నిలిచాడు. నిర్మాతగాను అ..! అనే విభిన్న తరహా సినిమాని అందించాడు. అష్టాచ‌మ్మా సెప్టెంబ‌ర్ 5, 2008న విడుద‌లైంది. అంతా కొత్త వాళ్ళ‌తో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ చేసిన కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా ఇది. క‌ల‌ర్స్ స్వాతి త‌ప్ప తెలిసిన మొహం ఒక్క‌టి కూడా ఆ సినిమాలో క‌నిపించ‌దు. అలాంటి సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. రాంబాబు అనే రోల్ లో నాని సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానం గెలుచుకున్నాడు. ఆ త‌ర్వాత రైడ్, భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు లాంటి సినిమాలు న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. హీరో కాక‌ముందు శీనువైట్ల ద‌గ్గ‌ర ఢీ.. బాపు గారి ద‌గ్గ‌ర రాధాగోపాలం సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసాడు. ఓ సినిమా ఎడిటింగ్ కోసం ఎడిట్ రూమ్ కు వ‌చ్చిన నానిలో హీరోను చూసాడు ఇంద్ర‌గంటి. అలా మ‌నోడి ప్ర‌యాణం మొద‌లైంది.

2011లో వ‌ర‌స‌గా అలా మొద‌లైంది & పిల్ల‌జ‌మీందార్ లాంటి హిట్ల‌తో నాని మంచి క్రేజ్ సంపాదికున్నాడు. 2012లో రాజ‌మౌళి ఈగ‌లో స్క్రీన్ పై కొద్ది సేపే కనిపించిన కుడా ఆ సినిమాతో నేష‌న‌ల్ వైడ్ గా గుర్తింపు పొందాడు. తర్వాత గౌత‌మ్ మీన‌న్ ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు, కృష్ణ‌వంశీ పైసా, య‌శ్ రాజ్ ఫిల్మ్స్ తొలి తెలుగు సినిమా ఆహాక‌ళ్యాణం, స‌ముద్ర‌ఖ‌ని జెండా పై క‌పిరాజు ఇలా వ‌ర‌స‌గా చేసిన ఆ నాలుగు సినిమాలు అపజయాన్ని పొందాయి. ఆ సమయంలో వ‌చ్చిన సినిమా ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం 2015, మార్చ్ 21న వ‌చ్చిన ఈ చిత్రం త‌ర్వాత నాని స్టార్ అయిపోయాడు. మారుతితో భ‌లేభ‌లే మ‌గాడివోయ్, హను రాఘవపుడితో కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాధ, మరోసారి ఇంద్రగంటితో జెంటిల్ మ‌న్ సినిమాలతో హిట్ ట్రాక్ పైకి వచ్చాడు. తర్వాత చేసిన విరించి వర్మతో మ‌జ్ను, త్రినాద్ రావ్ నక్కినతో నేనులోక‌ల్, శివ నిర్వాణతో నిన్నుకోరి, వేణు శ్రీరాంతో ఎంసిఏ వ‌ర‌కు తన సినిమాల విజయయాత్ర కొనసాగింది.

కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ , గ్యాంగ్ లీడర్  సినిమాలు ఫ్లాప్ అయినా కూడా జెర్సీ సినిమాతో తనెంత గొప్ప నటుడిని అనేది మరోసారి నిరూపించుకున్నాడు నేచురల్ స్టార్. ఈ చిత్రం తర్వాత  సినిమాతో మరోసారి ఫ్లాప్ అందుకున్న్నాడు. అయితే మరోసారి ఇంద్రాగంటితో ‘వి’ అంటు తన 25వ సినిమాగా  వచ్చిన సినిమా అంతగా అలరించలేదు. ఇక బర్త్ డే సందర్భంగా మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్ లో పెట్టేసాడు నాని. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమాలో నటిస్తున్నాడు. నిన్ను కోరి తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇవి కాక ‘శ్యామ్ సింగ రాయ్’ & ‘ఆంటే సుందరానికి..?’ అనే ఆసక్తి కరమైన సినిమాలతో రాబోతున్నాడు.  నాని బర్త్ డే సంధర్భంగా ‘శ్యామ్ సింగ రాయ్ ” ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.మునుపటి చిత్రాలలానే ఈ సినిమాలు మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ నానికి మూవీ వాల్యూం & టీం తరపున మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Leave a comment

error: Content is protected !!