నవ్వించడం అంటే కామెడీ కాదు. కామెడీ చేయడం  నవ్వినంత తేలిక కాదు. తాను నవ్వక ఇతరుల్ని నవ్వించడం ఒక యోగం. కామెడీ పాత్రలు పోషించడం ప్రతీ ఒక్కరికీ ఒక యాగం. ఈ విషయాన్ని బాగా ఒంట పట్టించుకున్నాడేమో .. యం.యస్.నారాయణ అనే వెండితెర విదూషకుడు వింత వింత హావభావాలతో .. విచిత్రమైన మాడ్యులేషన్ తో .. డైలాగ్ ను విరిచి విరిచి మరీ పలుకుతూ.. తెరమీద నవ్వుల పువ్వులు పూయించాడు. దాదాపు రెండున్నర దశాబ్దాల కాలం పాటు వైవిధ్యమైన ఎన్నో కామెడీ పాత్రలు పోషించి.. ఒక దశలో టాలీవుడ్ ను ఏలిన హాస్య చక్రవర్తి ఆయన.

పశ్చిమగోదావరి జిల్లా లో జన్మించిన మైలవరపు సూర్యనారాయణ అనే యం, యస్. నారాయణ చిన్నప్పటినుంచీ నాటకాలపై మక్కువ పెంచుకున్నారు. దాంతో పాటు తెలుగు భాషపైన  పట్టునూ సాధించారు. ఒక కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తూ..  సినిమాల్లో రచయితగా అవకాశం రావడంతో ఆ  ప్రొఫెషన్ కు రాజీనామా చేశారు యం.యస్. ఎనిమిది చిత్రాలకు రచయితగా పనిచేసిన ఆయన..మోహన్ బాబు  ‘పెదరాయుడు’ చిత్రంతో వెండితెరపై తొలిసారిగా కనిపించారు. ఆ తర్వాత ‘యం.ధర్మరాజు యం.ఏ, పుణ్యభూమి నా దేశం, రుక్మిణి’ లాంటి చిత్రాల్లో హాస్యనటుడిగా కనిపించి.. ప్రేక్షకుల్ని తన నవ్వులతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇక ఇవివి ‘మా నాన్నకు పెళ్ళి’ లొ ఆయన పోషించిన తాగుబోతు పాత్ర .. ఆయన్ను టాలీవుడ్ లో పర్మినెంట్ గా హాస్యనటుడ్ని చేసేసింది. తన నటజీవితంలో మొత్తం మీద 5 నంది అవార్డుల్ని సాధించిన యం.యస్. దాదాపు 200 చిత్రాల్లో తాగుబోతుగా నటించి.. ప్రేక్షకుల పొట్టచెక్కలు చేశారు. నేడు ఆ నవ్వుల నారాయణ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్ .

Leave a comment

error: Content is protected !!