‘మై నేమ్ ఈజ్ బాండ్… జేమ్స్‌బాండ్” అంటూ తొలిసారి తెరమీద కనిపించింది ఆయనే!
ఎంతమంది బాండ్‌లొచ్చినా ఇప్పటికీ ది బెస్ట్ బాండ్ అంటే ఆయనే!
షాన్ కానరీ.
‘జేమ్స్ బాండ్’కి ఓ బ్రాండ్ వేల్యూ తీసుకొచ్చిన వరల్డ్ ఫేమస్ హాలీవుడ్ యాక్టర్ షాన్ కానరీ.
‘జేమ్స్‌బాండ్’ అనేది ప్రపంచం అందరికీ తెలిసిన పేరు . జేమ్స్ బాండ్ అనే గూఢచారి ప్రపంచానికి ఏ పెద్ద విపత్తు వచ్చినా కాపాడతాడు. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటివరకూ 24 జేమ్స్‌బాండ్ సినిమాలు వచ్చాయి. ఆరుగురికి పైగా జేమ్స్‌బాండ్ పాత్రలు పోషించారు.
ఓ షాన్ కానరీ..
ఓ జార్జ్ లేజన్ బే …
ఓ రోజర్ మూర్..
ఓ తిమోతీ డాల్టన్…
ఓ పియర్స్ బ్రోన్‌సన్..
ఓ డేనియల్ క్రెగ్…
జేమ్స్‌బాండ్‌లుగా అందరికీ తెలుసు.
ఎవరి స్టయిల్ వాళ్లదే.
ఎవర్నీ తక్కువ అంచనా వేయడానికి కూడా వీల్లేదు.
జేమ్స్‌బాండ్‌గా చేయాలంటే చాలా వడపోత ప్రక్రియ ఉంటుంది.
ఇప్పటివరకూ వచ్చిన జేమ్స్‌బాండ్ ల్లో గ్రేటెస్ట్ జేమ్స్‌బాండ్ ఎవరు ? అనే విషయంలో ఇటీవల ఒక సర్వే చేస్తే ,
56 % తో షాన్ కానరీ టాప్ ప్లేస్ లో నిలిచారు
––––
షాన్ కానరీ అంటే ఇప్పుడు హీరో కానీ, పుట్టుకతో మాత్రం జీరోనే. చాలా పూర్ ఫ్యామిలీ వాళ్లది.
నాన్న ఫాక్టరీ వర్కర్ అయితే, అమ్మ వాళ్లింట్లో వీళ్లింటో వర్క్ చేసేది. షాన్ కానరీ పుట్టిన టైమ్‌కి ఇంట్లో ఉయ్యాల కూడా లేకపోతే, బట్టల సొరుగులో పెట్టి ఆడించారు. షాన్ కానరీ స్కూలుకి వెళ్లడానికి ముందే పనికి వెళ్లాడు. ఇంటింటికి తిరిగి పాల క్యాన్‌లు అందించేవాడు. స్కూల్లోకి చేరాక కూడా చదువు ఆపాడు కానీ, ఈ పని మాత్రం ఆపలేదు. తర్వాత రాయల్ నేవీలో చేరాడు. పేగుల్లో అల్సర్ వచ్చి మధ్యలోనే బయటికొచ్చేశాడు. తర్వాత ఓ ఫ్యాక్టరీలో పాలిష్ బాయ్‌గా చేరాడు. డీటైల్డ్‌గా చెప్పాలంటే – శవపేటికల్ని పాలిష్ చేసే ఉద్యోగం అన్నమాట. మన జేమ్స్‌బాండ్‌కి చూశారా – ఎంత దారుణమైన ఫ్లాష్ బ్యాక్ ఉందో!
–——————————————
షాన్ కానరీ చేయని ఉద్యోగమంటూ లేదు. కొన్నాళ్లు స్విమ్మింగ్‌పూల్‌లో వర్క్ చేశాడు. ఎవరైనా మునిగిపోతే కాపాడే డ్యూటీ అన్నమాట. అప్పుడు అస్సలు ఊహించి ఉండడు – భవిష్యత్తులో ప్రపంచాన్ని కాపాడే జేమ్స్‌బాండ్ పాత్ర చేస్తానని. షాన్ కానరీ అక్కడితో ఆగిపోలేదు. కొన్నాళ్లు ఓ ఫుట్‌బాల్ క్లబ్‌లో చేరాడు. ఇంకా చిత్రమేమిటంటే – షాన్ కానరీ ‘న్యూడ్ మోడల్’గా చేశాడు. అంటే బట్టలు లేకుండా శిల్పాలు, పెయింటింగ్‌ల కోసం ఫోజులివ్వడం అన్నమాట. ఆ తర్వాత ఓ డ్రామా కంపెనీలో బౌన్సర్ లాంటి ఉద్యోగంలో చేరాడు. అక్కడ పనిచేస్తూనే ‘మిస్టర్ యూనివర్స్ జూనియర్’ పోటీలకు వెళ్లి థర్డ్ ప్రైజ్ కూడా కొట్టేశాడు. దీనివల్ల షాన్‌కానరీకి పెద్దగా డబ్బులు రాలేదు కానీ, విచిత్రంగా ఓ డ్రామా కంపెనీలో కోరస్ సింగర్‌గా ఛాన్స్ వచ్చింది. సరిగ్గా అదే టైమ్‌లో షాన్‌కానరీకి ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్‌లో ఆడమని పిలుపొచ్చింది.
ఫుట్‌బాల్, డ్రామా – ఈ రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి. చివరకు ఫుట్‌బాల్‌ని వదిలేశాడు. అప్పుడు కనుక ఫుట్‌బాల్‌కి వెళ్లి ఉంటే ‘జేమ్స్‌బాండ్’గా షాన్ కానరీని చూసి ఉండేవాళ్లం కాదు.
––——————————————
షాన్ కానరీకి నాటకాల్లో చిన్నచిన్న వేషాలు వచ్చాయి. తర్వాత సినిమాల్లో కూడా అంతే. ‘మౌంటెయిన్ మాక్ క్లింటాక్’ అనే సినిమాలో వేసిన బాక్సర్ వేషం సీన్ కానరీని నక్క తోక తొక్కేలా చేసింది. హాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ వాళ్లు ఏడేళ్లు కాంట్రాక్ట్‌కు తీసుకున్నారు. మనిషి మంచి ఒడ్డూపొడుగుతో ఉండడంతోపాటు చాలా సెక్సీగా ఉండడంతో షాన్ కానరీ మెల్లిమెల్లిగా అందరి దృష్టిలో పడసాగాడు. ముఖ్యంగా హీరోయిన్ లానా టర్నర్‌కి ఇతగాడు తెగ నచ్చేశాడు. ఈ లానా టర్నర్ బాయ్ ఫ్రెండ్ ఓ మాఫియా లీడర్. అతగాడు డైరెక్ట్‌గా షూటింగ్ స్పాట్‌కొచ్చి షాన్ కానరీని భయపెట్టాలని చూశాడు. షాన్ కానరీ తక్కువ తిన్నాడా… ఆ మాఫియా లీడర్‌ని చితగ్గొట్టి పంపించేశాడు. ఈ రియల్ ఫైట్ కాస్తా ఆరోజుల్లో సోషల్ మీడియా లేకపోయినా హాలీవుడ్ అంతా క్షణాల్లో పాకిపోయింది. మన ‘షాన్ కానరీ’ని రియల్ హీరోలా చూడడం మొదలుపెట్టారు. అయినా సరైన సినిమా ఛాన్సులు రాలేదు. ఒక సినిమాలో విలన్‌గా కూడా చేశాడు. చిరాకొచ్చేసి ఇంగ్లండ్‌కి తిరిగొచ్చేసి డ్రామాలు, టీవీ సీరియల్స్ చేయడం మొదలుపెట్టాడు.
చూశారా… మన ‘జేమ్స్‌బాండ్’లా అంతెత్తున చూసే షాన్ కానరీ జీవితంలో ఎన్ని కష్టనష్టాలు పడ్డాడో. సక్సెస్ ఊరికే ఎవర్నీ వరించదు. ఓపిక ఉండాలి. షాన్‌కానరీ కూడా ఓపిగ్గానే బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు.
––—————————————-
బ్రిటీష్ రైటర్ ఇయాన్ ఫ్లెమింగ్ రాసిన నవల ఆధారంగా ‘జేమ్స్‌బాండ్’ సినిమా తీసే ప్లానింగ్ జరుగుతోంది. ఫేమస్ యాక్టర్ కేరీ గ్రాంట్‌ని ఫస్ట్ ఛాయిస్‌గా అనుకున్నారు. కానీ అతని రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ. సినిమా కంటే అతనికే ఎక్కువ ఇవ్వాలి. ఎవరైనా తక్కువలో వచ్చే బ్రిటిష్ యాక్టరైతే బావుంటుందనుకున్నారు. రిచర్డ్ బర్టన్, డేవిడ్ నెవిన్, జేమ్స్ మేసన్ – ఇలా చాలామందిని అనుకున్నారు. ఫైనల్‌గా బాల్ షాన్ కానరీ కోర్టులో పడింది. అయితే ఆ టైమ్‌కి షాన్ కానరీ స్టంట్‌మేన్‌లా ఉన్నాడు. తప్ప, స్టయిలిష్‌గా లేడు.
రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ కు, ప్రొడ్యూసర్లకి అదే డౌట్ వచ్చింది. జేమ్స్‌బాండ్ అంటే చాలా స్టయిలిష్‌గా ఉండాలి. వేరే ఆప్షన్‌కి వెళ్దామన్నారు. కానీ డైరెక్టర్ టెరాన్స్ యంగ్ మాత్రం షాన్ కానరీనే కావాలన్నారు. షాన్ కానరీని స్టయిలిష్‌గా మార్చడంకోసం నానా తిప్పలు పడ్డారు. సూట్లు కుట్టించి ఇంగ్లండ్ వీధుల్లో తిప్పారు. పెద్దపెద్ద క్లబ్బులో, రెస్టారెంట్లకి తీసుకెల్లి, నడక, మాట తీరు,
ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేశారు. సెలూన్‌కి తీసుకెళ్లి దగ్గరుండి మరీ హెయిర్ కట్ చేయించారు. ఇలా మొత్తం షాన్ కానరీ రూపురేఖలు, స్టయిల్ మార్చిపడేశారు. ఇప్పుడు షాన్ కానరీ పర్ఫెక్ట్ జేమ్స్‌బాండ్‌గా రెడీ.
1962 జనవరిలో జమైకాలో ‘డాక్టర్ నో’ షూటింగ్ స్టార్ట్ అయింది. ‘మై నేమ్ ఈజ్ బాండ్… జేమ్స్‌బాండ్’ డైలాగ్‌ని సింగిల్ టేక్‌లో చెప్పేసి, అందర్నీ పడేశాడు షాన్ కానరీ. ఆ తర్వాత ప్రపంచాన్ని కూడా పడేశాడు.
––––––————————————
‘డాక్టర్ నో’ సినిమాతో ప్రపంచం అందరికీ జేమ్స్‌బాండ్‌గా పాపులరైపోయాడు షాన్ కానరీ. ఆ తర్వాత ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’, ‘గోల్డ్ ఫింగర్’, ‘థండర్ బాల్’, ‘యు ఓన్లీ లివ్ ట్వైస్’, ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’ సినిమాల్లో నటించారు. ఈ ‘6’ జేమ్స్ బాండ్ సినిమాలతోనే వరల్డ్ ఫేమస్ అయిపోయాడు.
1983లో ‘నెవర్ సే నెవర్ ఎగైన్’ అనే అన్ అఫిషియల్ సినిమాలో కూడా జేమ్స్‌బాండ్‌గా నటించాడు. ఇలా అఫిషియల్ జేమ్స్‌బాండ్ సినిమాల్లోనే కాకుండా, అన్ అఫిషియల్ జేమ్స్‌బాండ్ సినిమాల్లో కూడా నటించిన ఏకైక యాక్టర్ షాన్ కానరీనే.
‘జేమ్స్‌బాండ్’ వల్ల షాన్ కానరీకి చాలా పేరుతోపాటు నెత్తి మీద చాలా భారాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవడానికి షాన్ కానరీ అస్సలు ఇష్టపడలేదు. నటనకు స్కోప్ లేని యాక్షన్ సినిమాలను నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేసిపారేశాడు. తనను కొత్తగా ఆవిష్కరించే కొత్త కథలకు ఓటేశాడు.
అల్ఫ్రెడ్ హిచ్ కాక్ “మార్నీ”, స్పీల్ బర్గ్ దర్శకత్వంలో
‘ఇండియానా జోన్స్ అండ్ లాస్ట్ క్రూసేడ్’, బ్రియాన్ డి నామా ‘ద అన్‌టచబుల్స్’, అగాథా క్రిష్టీ రచన ఆధారంగా తీసిన
“మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్ ప్రెస్, మైఖేల్ క్రిక్టన్ రచించి ,దర్శకత్వం వహించిన THE GREAT TRAIN ROBBERY లాంటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. షాన్ కానరీ రిజెక్ట్ చేసిన సినిమాల్లో పెద్దపెద్ద సినిమాలే ఉన్నాయి. లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ద మాట్రిక్స్, ద థామస్ క్రౌన్ ఎఫెయిర్, జురాసిక్ పార్క్ లాంటి సినిమాల్ని చాలా ఈజీగా రిజెక్ట్ చేసిపారేశారాయన.
మిగతా జేమ్స్‌బాండ్ హీరోల కెరీర్ దాదాపుగా ఆయా జేమ్స్‌బాండ్ సినిమాలతోనే ముగిసిపోతే, షాన్ కానరీ మాత్రం ‘జేమ్స్‌బాండ్’ ఇమేజ్ కనబడకుండా యాక్టర్‌గా రాణించాడు.
——————————————-
‘జేమ్స్‌బాండ్’ వల్ల రాని ఆస్కార్ అవార్డు ‘అన్‌టచబుల్స్’లో చేసిన పోలీసాఫీసర్ పాత్ర వల్ల వచ్చింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా షాన్ కానరీకి ఆస్కార్ వచ్చింది. పలు సార్లు గోల్డెన్ గ్లోబల్,BAFTA అవార్డులు అందుకున్నారు, ఆయనకు వచ్చిన ఏకైక అకాడమీ
అవార్డు (ఆస్కార్) ఇదే.
––––––————————————
1999లో పీపుల్ మ్యాగజైన్ వాళ్లు ఈ శతాబ్దపు సెక్సీయెస్ట్ మ్యాన్‌గా షాన్ కానరీకి కిరీటం తొడిగారు. అప్పుడాయన వయసు ఎంతో తెలుసా? 70 ఏళ్లు. దటీస్ షాన్ కానరీ. ఇంగ్లండ్‌లో అతి గొప్ప పురస్కారమైన ‘సర్’ బిరుదాన్ని ,2000 సంవత్సర0లో చివరకు క్వీన్ ఎలిజిబెత్ చేతుల మీదుగా, ఎడిషన్ బర్గ్ లో,అంటే సొంత ఊళ్లోనే ఆ బిరుదు అందుకున్నాడులెండి.
పెద్దపెద్ద బ్రిటిష్ యాక్టర్స్ కూడా హాలీవుడ్‌కి వెళ్లగానే తమ ఉచ్ఛారణ మార్చేసుకున్నారు. షాన్ కానరీ మాత్రం చివరి సినిమా వరకూ తన స్కాటిష్ ఉచ్ఛారణను వదులుకోలేదు. ఈ ఉచ్ఛారణ మార్చుకోమని ఎంతమంది సలహాలిచ్చినా, విమర్శలు చేసినా డౌంట్‌కేర్ అన్నట్టుగానే ఉన్నారు షాన్ కానరీ.
‘The league of extraordinary gentlemen’ తర్వాత 17 ఏళ్ళు యాక్టింగ్‌కి దూరంగా ఉన్నారాయన. కానీ, ప్రేక్షకులు షాన్ కానరీని గుర్తుపెట్టుకునే ఉన్నారు. ఈ బాండ్ ఆకర్షణకి ఏజ్ తో సంబంధం లేదు.నటనకు విరమణ చేసినా
అభిమానుల బాండేజ్ అలాగే కొనసాగింది .
ఎవరు ఎన్నయినా చెప్పండి.
షాన్ కానరీ అంటే జేమ్స్‌బాండ్.
జేమ్స్ బాండ్ అంటే షాన్ కానరీ.
– పులగం చిన్నారాయణ