కవ్వించే కళ్ళు.. కట్టేసే చూపులు.. కనికట్టు చేసే ముఖారవిందం.. నవ్వితే అందాల బుగ్గల్లో సొట్టలు .. నిజంగా ఆమె బుట్టబొమ్మే. సౌత్ జనం గుండెల్లో గుబులు రేపే గోపికమ్మే. పేరు పూజా హెగ్డే. కన్నడ మాతృభాషైనప్పటికీ… తెలుగు, తమిళ భాషల్లో సైతం అగ్ర పథాన నిలిచిన అందాల భరిణ. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన అవకాశాలందుకుంటూ దూసుకుపోతోంది.
పూజ తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే .కర్ణాటక లోని మంగుళూరు స్వస్థలం. కానీ ఆమె ముంబై లో పుట్టి పెరిగింది. ఆమె తన మాతృ భాషయైన తుళు తో పాటు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. కాలేజీలో చదివేటపుడు తల్లి నిర్వహిస్తున్న నెట్వర్క్ మానిటరింగ్ వ్యాపార వ్యవహారాలు చూసుకోవడంలో సహాయపడుతుండేది. దాంతో ఆమెకు నెట్వర్కింగ్ నైపుణ్యం అలవడింది. ఇంటర్ కాలేజీ ఫ్యాషన్ పోటీల్లో, డ్యాన్స్ పోటీల్లో పాల్గొనేది. ఆతర్వాత సినీ రంగం వైపుకు దృష్టిని సారించింది.
2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ‘ముగమూడి’ అనే సినిమాలో తొలి సారిగా కథానాయికగా అవకాశం అందుకుంది. 2014 లో ముకుంద సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. 2016 లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజదారో తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్లో పలు అవకాశాలు అందుకొని అగ్రతారగా వెలుగొందుతోంది. లాస్టియర్ గద్దల కొండ గణేష్ తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న పూజా.. ఈ ఏడాది సంక్రాంతికి అలవైకుంఠ పురములో సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న రాధేశ్యామ్ లో కథానాయికగా నటిస్తోంది. ఇంకా మరిన్ని అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతోంది. నేడు పూజా హెగ్డే పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.