చంద్రబింబం లాంటి ముఖం.. చక్రల్లాంటి కళ్ళు.. శంఖం లాంటి మెడ.. అద్దంలాంటి చెక్కిళ్ళు.. చిరునవ్వును అలంకరించే పెదవులు.. కొంటెతనాన్ని , చిలిపితనాన్ని కలగలిపే చూపులు.. ఈ లక్షణాలన్నీ బాపు బొమ్మకే ఉంటాయి కాబట్టి… ఆ బాపు బొమ్మ స్నేహ. సౌత్ లో అందాల కథానాయికగా.. సలక్షణమైన అమ్మాయిగా.. సంసార పక్షమైన పాత్రలతో మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఒక దశలో దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలిగింది. ప్రస్తుతం సహాయ నటిగా మెరుస్తున్నా ఆమె అందం మాత్రం చెక్కు చెదరలేదు.
స్నేహ అసలు పేరు సుహాసిని రాజారాం. 1981 అక్టోబరు 12న ముంబైలో జన్మించింది. ఆమె తాతల కాలంలో కుటుంబం రాజమండ్రిలో నివసించేవారు. తల్లిదండ్రులు రాజారాం, పద్మావతి ముంబైలో స్థిరపడ్డారు. అక్కడ్నుంచి దుబాయి వెళ్లారు. స్నేహని చూసిన మలయాళ దర్శకుడు పాజిల్ ప్రమేయంతో వెండితెర ప్రవేశం చేశారు స్నేహ. మొదట ‘ఇంగనే ఒరు నిలాపక్షి’ అనే తమిళ చిత్రంలో మెరిసిన స్నేహ ఆ తరువాత తమిళంలో ‘ఎన్నావలే’, తెలుగులో ‘తొలివలపు’ చిత్రంలో నటించి పేరు తెచ్చుకొన్నారు. ‘ప్రియమైన నీకు’, ‘హనుమాన్‌జంక్షన్’, ‘వెంకీ’, ‘సంక్రాంతి’ చిత్రాలతో విజయాల్ని అందుకొన్న స్నేహ తెలుగులో ఓ వెలుగు వెలిగారు. పద్ధతైన పాత్రల్లోనే మెరిసిన ఆమె, ‘శ్రీరామదాసు’, ‘రాధాగోపాలం’, ‘పాండురంగ’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాలతో పాటు, బుల్లితెరపై కూడా మెరిశారు. పలు రియాలిటీ షోలకి వ్యాఖ్యాతగా, న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. 2012లో నటుడు ప్రసన్నని వివాహం చేసుకొన్నారు. ఒక సినిమాలో నటిస్తూ ప్రేమలో పడిన ఈ జంట పెళ్లితో ఒక్కటైంది. తెలుగులో రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’లో కొణిదెల గాయత్రిదేవిగా నటించింది. కన్నడలో ‘మునిరత్న కురుక్షేత్ర’లో ద్రౌపదిగా నటించింది. నేడు స్నేహ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.