ఆయనలో నిజాయితీ గల పోలీసాఫీసర్ ఉన్నాడు. క్రూరమైన విలన్ ఉన్నాడు. కరడు గట్టిన గూండా ఉన్నాడు.. కరుణ కురిపించే అన్న ఉన్నాడు.  ఏ పాత్రకైనా సమన్యాయం చేకూర్చడం ఆయన ప్రత్యేకత. పేరు శ్రీహరి.  హీరోగానూ, విలన్ గానూ, కమెడియన్ గానూ, కేరక్టర్ ఆర్టిస్ట్ గానూ ఇలా.. వివిధ రకాల పాత్రలతో వివిధ దశల్లో తనలోని టాలెంట్ ను ప్రదర్శించిన ఆ మేటినటుడు రియల్ స్టార్ గా ప్రేక్షకుల నీరాజనాలందుకున్నారు.

దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మనాయుడు’ సినిమా శ్రీహరికి నటుడుగా మొదటి తెలుగు సినిమా. ముప్పలనేని శివ దర్శకత్వంలో రామానాయుడు నిర్మాణంలో తెరకెక్కిన ‘తాజ్‌ మహల్‌’ సినిమాలో శ్రీహరి ఓ పూర్తి స్థాయి విలన్‌గా నటించారు. ఆ తరువాత హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. ఒకపక్క హీరోగా పాత్రలు చేస్తూనే మరోపక్క వైవిద్యభరితమైన పాత్రల్లో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా… విలన్, హీరో, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.. ఏ పాత్రైలోనైనా నటించి తానేమిటో నిరూపించుకోగలిగారు శ్రీహరి.

శ్రీహరి అన్న పేరు వినగానే వెంటనే మనకు బోలెడు సినిమాలు గుర్తుకొచ్చేస్తాయి. తన సహజమైన నటనతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు శ్రీహరి. గంభీరమైన పాత్రల్లో భయపెట్టినా, ఫన్నీ పాత్రలతో నవ్వించినా, హీరోగా… ఇలా అనేక పాత్రలతో ప్రేక్షకులను అలరించగలిగిన క్రెడిట్‌ కేవలం శ్రీహరికే దక్కుతుంది. ‘ధర్మ క్షేత్రం’, ‘రౌడీ ఇన్స్పెక్టర్‌’, ‘అల్లరి ప్రేమికుడు’, ‘హలో బ్రదర్‌’, ‘ఘరానా బుల్లోడు’, ‘అల్లుడా మజాకా’, ‘శ్రీ కృష్ణార్జున విజయం’, ‘రాముడొచ్చాడు’, ‘వీడెవడండీ బాబు’, ‘గోకులంలో సీత’, ‘ప్రీమించుకుందాం రా’, ‘బావగారు బాగున్నారా’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘ప్రేయసి రావే’, ‘రాజకుమారుడు’ వంటి ఎన్నో సినిమాల్లో శ్రీహరి నటన ప్రేక్షకులు మర్చిపోలేనిది. జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ సినిమాలో శ్రీహరి పోషించిన ‘షేర్‌ ఖాన్‌’ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే. ఈ సినిమా వచ్చి పది సంవత్సరాలు పూర్తైనా షేర్‌ ఖాన్‌ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయిందంటే ఆయన  నటన ప్రేక్షకులకు ఎంతలా దగ్గరయ్యిందో తెలుసుకోవచ్చు. నేడు శ్రీహరి వర్ధంతి. ఈ సందర్భంగా ఆ అభినయ షేర్ ఖాన్ కు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

 

 

 

Leave a comment

error: Content is protected !!