ఆయన కన్నుపడితే… అందమంతా బంధీ కావల్సిందే. ఆయన ఫ్రేమ్ పెడితే.. అందమైన సన్నివేశం కనుల విందు చేయాల్సిందే. సన్నివేశం మూడ్ ను క్రియేట్ చేసే రేంజ్ లో ఆయన అరేంజ్ చేసే లైటింగ్.. నటీనటుల రియాక్షన్స్ కట్ చేయడంలో ఆయన థింకింగ్ చాలా డిఫరెంట్. పేరు యం.వి.రఘు. అసలు పేరు మాడపాక వెంకట రఘు. భాషతో సంబంధం లేకుండా.. ఎన్నో సినిమాలకి తన కెమేరా పనితనాన్ని రుచిచూపించారు. యాభైకి పైగా సినిమాలకు, 10 డాక్యుమెంటరీలకు ఛాయగ్రాహణం నిర్వర్తించారు రఘు. రెండు సినిమాలకి దర్శకత్వం వహించారు. ఛాయగ్రాహకునిగా, దర్శకునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులతో పాటు వివిధ సాంస్కృతిక సంస్థల నుండి యాభైకి పైగా అవార్డులు పొందిన లబ్ధప్రతిష్ఠుడు.
రఘు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన ‘కళ్ళు’ సినిమా తెలుగులో ఒక అద్భుతమైన కథతో తీసిన ప్రయోగాత్మక చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది పురస్కారముతో పాటు రెండు డజన్లకు పైగా ఇతర సాంస్కృతిక సంస్థల పురస్కారాలు లభించాయి. గొల్లపూడి మారుతీరావు రచించిన కళ్ళు నాటకం ఆధారంగా ఈ సినిమా తీశారు. అంతేకాదు ఈ సినిమాను ఆస్కారు అవార్డుల నామినేషన్లలో భారతీయ సినిమాలకు ప్రాతినిధ్యం చేయడానికి కూడా ఎంపికచేయబడింది. ఇక రఘు దర్శకత్వం వహించిన రెండవ సినిమా ఆర్తనాదం. రాజశేఖర్, సీత, చంద్రమోహన్ నటించారు. సినిమా మొత్తం ఒక చిత్రం షూటింగ్‌కి వెళ్ళిన యూనిట్ మధ్య జరుగుతుంది. కథానాయికని హత్య చెయ్యడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎవరు చేసారు? దేనికి? అన్నది అర్ధం కాదు. బైట వ్యక్తి మీద అనుమానం, కొన్ని ఆనవాళ్ళు కనపడతాయి. చివరకు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ సినిమా ఆద్యంతమూ సాగుతుంది. రఘు ఈ రెండు సినిమాలకి దర్శకత్వం వహించిన తరువాత ఛాయగ్రాహకునిగా అనేక సినిమాలకి చాయాగ్రహణం బాధ్యతలు నిర్వర్తించినా తిరిగి దర్శకత్వం మాత్రం చేపట్టక పోవటం ఆశ్చర్యకర విషయం. నేడు యం.వి.రఘు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.