తెలుగు తెరపై నవ్వును వెలిగించిన దర్శకుల్లో ఆయన ఒకరు. చమత్కారం, వెటకారం, వ్యంగ్యం కలగలిసిన హాస్యానికి ఆయన కేరాఫ్ అడ్రెస్. అంతేకాదండోయ్.. ఆయన నవ్వులతో పాటు ఎమోషన్స్ ను, కుటుంబ బంధాల్ని కూడా అంతే మోతాదులో పండించగలడు. పేరు రేలంగి నరసింహారావు. హాస్యనటుడు రేలంగికి, ఈయనకి దూరపు చుట్టరికం ఉన్నప్పటికీ.. నరసింహారావు లో అలనాటి రేలంగి పోలికలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ దర్శకుడు చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ తో ఎక్కువ సినిమాలు తీసి.. సత్తా చాటుకున్నారు.
రేలంగి నరసింహారావు పాలకొల్లులో జన్మించారు. క్లాస్ మేట్ అయిన కోడి రామకృష్ణతో కలిసి నాటకాలు వేసేవారు నరసింహారావు. బి.యస్.సిలో చేరినా చదువు పై ఆసక్తి లేకపోవడంతో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఆ విధంగా దర్శకుడయ్యారు. 1971లో ప్రముఖ దర్శకుడు బి.వి.ప్రసాద్ వద్ద అప్రెంటిస్ గా మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమాకు చేరారు. 1972లో ఆయన కె.ఎస్.ఆర్.దాస్ వద్ద అసిస్టెంట్ డైరక్టరుగా ఊరికి ఉపకారి చిత్రానికి పనిచేసారు. తరువాత ఆయన 1973లో సంసారం సాగరం చిత్రానికి దాసరి నారాయణరావు గారి వద్ద పనిచేసారు. 1980లో దర్శకునిగా మారే వరకు దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డైరక్టరు, అసోసియేట్ డైరక్టరు, కో డైరక్టరుగా పనిచేసారు. మొట్టమొదట చందమామ చిత్రానికి దర్శకత్వం వహించారు రేలంగి . ఇది పూర్తి కుటుంబ చిత్రం. కానీ ఈ చిత్రం విడుదల ఆలస్యమయింది. ఈ చిత్రం 1982 వరకు విడుదల కాలేదు. ఆయన రెండవ, మూడవ, నాల్గవ సినిమాలు వరుసగా నేను మా ఆవిడ, ఏమండోయ్ శ్రీమతిగారు, ఇల్లంతా సందడి. ఈ చితాలు పూర్తిగా హాస్యభరితమైనవి. యాదృచ్ఛికంగా చంద్రమోహన్ తో తీసిన 18 సినిమాలు విజయాలనందించాయి. ఆయన ప్రముఖ సినిమా నటులైన అక్కినేని నాగేశ్వరరావు , శోభన్ బాబు , కృష్ణంరాజు లతో కూడా సినిమాలూ చేసారు.
రేలంగి నరసింహారావు సుమారు 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన చిత్రాలలో అధికంగా తెలుగు, కన్నడ చిత్రాలు ఉన్నాయి. తమిళంలో కూడా చిత్రాలను తీసారు. ఉషాకిరణ మూవీస్ బ్యానర్ పై తీసిన సుందరి సుబ్బారావు స్క్రీన్ రచనలకు గానూ నంది అవార్డును అందుకున్నారు. ఆ సినిమాకు దర్శకుడు కూడా ఆయనే . దివాకర్ బాబు, శంకరమంచి పార్థసారధి వంటి రచయితల్ని, సుమన్, రేవతి, కిన్నెర లాంటి నటీ నటులను కూడా చిత్రసీమకు పరిచయం చేసారు రేలంగి నరసింహారావు. నేడు రేలంగి నరసింహారావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.