సన్నగా రివటలా ఉంటాడు.. అందగాడేమీ కాదు. అయినా ముఖానికి ఎప్పుడూ చిరునవ్వును తగిలించుకుని ఉంటాడు. లాంగ్వేజ్ .. బాడీ లాంగ్వేజ్ చాలా విచిత్రంగా ఉంటాయి. చార్లీ చాప్లిన్ లా ఎప్పుడూ నవ్వును నలుగురికీ పంచాలని తపన పడుతూ ఉంటాడు. తాను నవ్వక.. పదుగురినీ నవ్వించువాడే మహిలో మహా హాస్యనటుడని సరికొత్త అర్ధాన్నిచ్చిన కామెడీ కింగ్ నగేష్. తమిళుడైనప్పటికీ.. ఎన్నో సినిమాలతో తెలుగు వారినీ మనసారా నవ్వించిన గొప్ప హాస్యనటుడు.

కృష్ణారావు నాగేశ్వరన్ అనే  నగేష్‌… తమిళ, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడి సినిమాల్లో హాస్యనటుడిగా పేరుపొందారు.  ‘సర్వర్‌ సుందరం’ సినిమాతో నవ్వులు వడ్డించి స్టార్‌ కమేడియన్‌ హోదాకి ఎదిగారు. తమిళనాడులోని ధరాపురంలో 1933లో జన్మించిన  నగేష్, ఉపాధి కోసం చెన్నై వచ్చి రైల్వేలో గుమాస్తాగా చేరారు. ఓసారి రైల్వే ఉద్యోగులతో కలసి నాటకం వేస్తే ప్రముఖ నటుడు ఎంజీఆర్‌ చూసి ప్రత్యేకంగా ప్రశంసించారు. దాంతో నాటకాలు వేస్తూ 1958లో ‘మనముళ్ల మరుధారం’ చిత్రంతో తొలిసారి వెండితెరపై మెరిశారు నగేష్. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా 1964లో వచ్చిన ‘సర్వర్‌ సుందరం’ సినిమాతో నగేష్‌ పేరు మార్మోగిపోయింది. ఒక దశలో ఒకేసారి ఆరు సినిమాలకు పనిచేస్తూ, ఒక ఏడాది 35 సినిమాల్లో నటించినంత బిజీగా మారారు. తెలుగులో సైతం ‘పాపం పసివాడు’, వసంత గీతం, అమరజీవి, లంకేశ్వరుడు, వేటగాడు, ‘బృందావనం’, ‘శత్రువు’, ‘మేడమ్‌’, ‘తొలి ప్రేమ’, ‘శుభాకాంక్షలు’, ‘మా పెళ్లికి రండి’, లాంటి సినిమాల్లో నటించారు . కమల్ హాసన్ ‘విచిత్ర సోదరులు’ లో విలన్ గానూ మెప్పించారు. కైకాల సత్యనారాయణ, జయసుధ జంటగా నటించిన ‘మొరటోడు’ సినిమాకి దర్శకత్వం కూడా వహించారు నగేష్. నేడు నగేష్ జయంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!