శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రస: ఫణి’ అన్నారు . సంగీతం శిశువుల్ని, పశువుల్నే కాదు ..పాముల్ని కూడా పరవశింపచేస్తుంది అని దాని భావం. నిజమే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం పాట వింటే.. ఆ రాగాలకు రాళ్ళు సైతం కరిగి అమృత ధారలైపోతాయి. ఆ గాన మాధుర్యానికి మంత్రముగ్ధులైపోతాయి. 50 ఏళ్ళ క్రితం ఏ గాత్రమైతే.. దక్షిణాది సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిందో .. ఇప్పటి వరకూ అదే తీరుతో ఉర్రూతలూగించింది ఆయన స్వరం. కానీ  నేడు ఆ స్వరం మూగవోయింది. ఆ మహాగాయకుడు  ఈ లోకాన్ని విడిచారు. ఈ రోజు చెన్నై లో యస్పీబాలు కన్నుమూశారు. ఈ  వార్త తెలియగానే.. భారతావని అంతా శోక సంద్రంలో మునిగిపోయింది. భారతీయ సినీ పరిశ్రమ సంతాపం తెలియచేసింది. 

1967 లో విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రంలోని  ఏమి ఈ వింత మోహం .. అనే పాటతో తెలుగు చిత్ర సంగీత లోకంలోకి అడుగుపెట్టిన బాలసుబ్రహ్మణ్యం.. ఎందరో మహామహుల సంగీత సారధ్యంలో పాటలు పాడుతూ..  ఇంతితై, వటుడింతై, నభోవీధిపైనంతై, ప్రభారాశిపైనంతై, బ్రహ్మాండాంత సంవర్ధియై ..గాన గంధర్వుడై..  ఎదిగారు. ఐదు దశాబ్దాల కాలంపాటు .. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో దాదాపు 14లకు పైగానే పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం భారతీయ తెరను తన గాన మాధుర్యంతో మంత్రముగ్ధుల్ని చేశారు. కేవలం గాయకుడిగానే కాకుండా..సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ, నటుడిగానూ, నిర్మాతగానూ సత్తా చాటుకున్నారు.  శంకరాభరణం (1979), ఏక్‌ దూజే కే లియే (1981), సాగరసంగమం (1983), రుద్రవీణ (1988), సంగీతసాగర గానయోగి పంచాక్షర గవాయ్‌ (1995-కన్నడ), మిన్సార కణవు (1996-తమిళం). జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకునిగా ‘మైనే ప్యార్‌ కియా’ చిత్రానికి ఫిలింఫేర్‌ బహుమతి అందుకున్నారు. దక్షిణ భారత సినిమాల్లో ఉత్తమ గాయకునికి ఇచ్చే ఫిలింఫేర్‌ బహుమతులు బాలుని ఏడు సార్లు వరించాయి. ఉత్తమ గాయకునిగా 18 నంది బహుమతులతోబాటు ఉత్తమ సంగీత దర్శకునిగా ‘మయూరి’ చిత్రానికి నంది బహుమతి అందుకున్నారు. ‘మిథునం’ సినిమాలో నటనకు ప్రత్యేక జూరీ బహుమతి లభించింది. తమిళ చిత్రాల్లో ఆలపించిన పాటలకు నాలుసార్లు, కన్నడ సినిమాల్లో పాడిన పాటలకు మూడుసార్లు ఉత్తమ గాయకుని బహుమతులు కూడా బాలుకి దక్కాయి. రాజాలక్ష్మీ ఫౌండేషన్, సుర్‌ సేన్, అక్కినేని, లతామంగేష్కర్‌ జాతీయ బహుమతుల తోబాటు లెక్కలేనన్ని ఇతర బహుమతులు బాలుని వరించాయి. 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డునిచ్చి బాలుని సత్కరించింది. 2011లో పద్మభూషణ్‌ అవార్డును బాలు అందుకున్నారు. ఆ మహాగాయకుడికి   ఘన నివాళులర్పిస్తోంది  మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!