అప్పటి హీరోలు .. సినిమాలో నటించడాన్ని దైవ కార్యంగా భావించేవారు. క్రమశిక్షణ, సమయపాలన ఖచ్చితంగా పాటిస్తూ…. మిగతా నటీనటులకు ఆదర్శంగా నిలిచేవారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉండే నటులు  యన్టీఆర్ , ఏఎన్నార్. కాల్షీట్ ప్రకారం షూటింగ్ లో పాల్గొనడానికి వెళితే.. ఆ పని తప్ప .. వేరే పనిమీద ధ్యాసే ఉండేది కాదు. అలాంటి నియమాలు కలిగిన అక్కినేని నాగేశ్వరరావుకి ఒక సారి శ్రీమంతుడు సినిమా షూటింగ్ లో ఒక సన్నివేశం జరిగేటప్పుడు .. తోటి నటీనటుల మీద పిచ్చి కోపం వచ్చేసిందట. ఆ రోజు ఒక పెద్ద సీన్ షూట్ కోసం అక్కినేని సెట్స్ కు వచ్చి.. మేకప్ వేసుకొని సీన్ లో పాల్గొనడానికి పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారట. ఆ సీన్ లైటింగ్ సెట్ చేయడానికి చాలా టైమ్ ఉండడంతో.. ఆ షాట్ గ్యాప్ లో సూర్యాకాంతం పేకముక్కలు తీసి అందరినీ పిలిచిందట. దర్శకుడు ప్రత్యగాత్మతో సహా చతుర్ముక పారాయణంలో మునిగిపోయారు.

ఇంతలో లోపల మేకప్ రూమ్ లో రెడీగా ఉన్న అక్కినేని ఎంతకీ పిలుపు రాకపోవడంతో .. ఏం జరుగుతోందా అని సెట్స్ లోకి వచ్చారట. అందరూ పేకాడుతూ కనిపించారు. దాంతో అక్కినేనికి కోపం పీక్స్ లో వచ్చేసిందట. అందరినీ ఉద్దేశిస్తూ…  ఏమిటిది? ఈ పేకాటకా వచ్చాం.. కాల్షీటు టైములో, సెట్లో కూచుని పేకాటా? అని అరిచారట. లైటింగ్‌ అవుతోంది… లాంగ్‌ షాటు అని, ప్రత్యాగాత్మ చెప్పారు. అయితే? రిహార్సల్సు చూసుకోవచ్చు కదా. ఒకసారి దృశ్యం ఏమిటో తెలుసుకుని, పొజిషన్స్‌ చూసుకోవచ్చు కదా.. నిర్మాత ఏమైపోతాడు? ఎందుకిలా టైమ్‌ వేస్టు చేస్తున్నారు..? వృత్తి మీద ఎవరికీ శ్రద్ధ లేదు.. గౌరవం లేదు.. దేనికొచ్చాం.. దేనికి నిర్మాత దగ్గర్నుంచి డబ్బు తీసుకుంటున్నాం.. అంటూ, తారాస్థాయిలో అందర్నీ ఝాడించెయ్యడం మొదలు పెట్టేసరికి – పేకలు పారేసి, ఎక్కడవాళ్లు అక్కడ ఉండకుండా మూల మూలకీ పారిపోయారు. ఎవరూ నోరెత్తలేదు. తలలు దించుకొని నిలబడిపోయారు. ఆవేశాన్ని అణచుకొని అక్కినేని కుర్చీలో కూలబడ్డారు. సీన్‌ చూదాం రండి  అని ప్రత్యాగాత్మ అందర్నీ పిలిచి, రిహార్సల్సు ఆరంభించగానే చీవాట్లు పెట్టిన అక్కినేని నవ్వుతూ వచ్చి, సీన్‌లో పాల్గొన్నారట.

Leave a comment

error: Content is protected !!