బాపు శరీరమైతే.. రమణ ఆత్మ. చివరి వరకూ ఆ ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉన్నారు. మరణం మాత్రమే ఆ ఇద్దరినీ విడదీసింది. అయితే సినిమాల విషయానికొస్తే.. బాపు చిత్ర శిల్పి అయితే .. రమణ రచనా శిల్పి. బాపు దర్శకత్వం వహించిన దాదాపు అన్ని చిత్రాలకు రమణ డైలాగ్స్ రాశారు. బాపు రమణమీద స్నేహ, గౌరవ భావాలతో ఆయన రాసిన డైలాగ్స్ లో ఒక్క అక్షరం మార్చినా సహించేవారు కాదు. అలాగే.. ఆయన డైలాగ్స్ లో ఏమి రాస్తే ఆ ప్రాపర్టీస్ ను ఖచ్చితంగా వాడి తీరాలని ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చేవారు తన అసిస్టెంట్స్ కు. అదే ఒక సినిమా షూటింగ్ లో ఒకసన్నివేశం ఆలస్యంగా జరగడానికి కారణమైంది. ఆ సినిమా ‘పెళ్ళిపుస్తకం’.

‘పెళ్ళిపుస్తకం’ స్క్రిప్టులో రాధాకుమారి, సాక్షి రంగారావు బాదం ఆకుల విస్తర్లలో ఇడ్లీలు తింటూ మాట్లాడుకుంటున్నట్లు రమణ రాశారు. షాట్స్‌ రాసినప్పుడు దర్శకుడు బాపు కూడా అదే రాసి, బాదం ఆకుల విస్తర్లు కావాలి అని, ప్రొడక్షన్‌ వాళ్లకి రాసి ఇచ్చారు. షూటింగ్‌ ఉదయం ఆరంభమైంది. బాదం ఆకులు దొరకలేదని, మామూలు విస్తరాకులు తెచ్చారు ప్రొడక్షన్‌ వాళ్లు. అదేమిటండీ, బాదం ఆకులు దొరక్కపోడం ఏమిటి? ఏమేం కావాలో మన వాళ్లు నిన్న పొద్దున్నే రాసి ఇచ్చారు కదా! బాదం ఆకుల విస్తర్లే కావాలి. వెళ్లి తీసుకురండి. ఇంతపెద్ద హైదరాబాద్‌లో ఎవరింట్లోనూ బాదం చెట్టు లేదా? అని కసిరి పంపించారు బాపు. అవి వచ్చేవరకూ షూటింగ్‌ లేదు! చవరికి .. ఒక చోట  బాదం చెట్టు ఉందంటే, రెండు కార్లు వేసుకుని అటూ ఇటూ తిరగడం మొదలు పెట్టారు. ఆఖరికి చిక్కడపల్లిలో ఒకరింట్లో బాదం చెట్టు ఉందని ఎవరో చెబితే, అక్కడికి వెళ్లి ఆకులు కోసి తెచ్చి, విస్తర్లు కుట్టి ఇచ్చేసరికి, మధ్యాహ్నం అయింది. అయితేనేం అనుకున్న ఆకులు వచ్చాయి. అప్పటికి ఇడ్లీలు చల్లారిపోయాయి. దీంతో మళ్లీ ఇడ్లీలు తెప్పించి, సీను షూట్‌ చేశారు. ఐతే, సినిమా పూర్తయ్యాక నిడివి ఎక్కువైందని కత్తిరించిన దృశ్యాల్లో ఈ సన్నివేశమూ పోయింది!

Leave a comment

error: Content is protected !!