ఆయన గళంలోని మార్ధవం మధురం.. ఆయన గమకాల్లోని గాంభీర్యం అమోఘం.. ఆయన పాటలోని ఆర్ధ్రత అనితరం సాధ్యం. ఆయన పలికే పదాల్లోని లాలిత్యం అనుపమానం. అందుకే ముళ్ళపూడి వెంకటరమణ ఆయన్ను ముద్దుగా శ్రీనివాయిస్ అనేవారు. ఆయనే భయంకర ప్రతివాది శ్రీనివాస్ అనే పి.బీ.శ్రీనివాస్ . కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, తులు, కొంకణి భాషల్లో దాదాపు 3000 పాటలు పాడారు పి.బి. అంతేకాదు.. దాదాపు గా ఆ భాషలన్నిటిలోనూ ఆయన పండితుడు.
1952లో జెమినీ వారు తీసిన హిందీ సినిమా ‘మిస్టర్ సంపత్’తో పీబీ సినీ నేపథ్య గాయకుడిగా మారారు. కన్నడంలో అత్యధిక పాటలు పాడిన పీబీ శ్రీనివాస్. తెలుగులో ఆణిముత్యాల్లాంటి ఎన్నో పాటలు ఆలపించారు. ‘బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి’, ‘ఓ హంస నడల దానా’, ‘వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినది’, ‘ఎవరికి ఎవరు కాపాలా’, ‘ఊరు మారినా ఉనికి మారినా’, ‘ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి’, ‘ఓహో గులాబి బాలా’, ‘అది ఒక ఇదిలే’, ‘ఆనాటి చెలిమి ఒక కల’, ‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు’, ‘వెన్నెల రేయి ఎంతో చలిచలి’, ‘చిగురాకుల ఊయలలో’, ‘నీలికన్నుల నీడల లోన’లాంటి ఎన్నో పాటలు తెలుగు ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ మారుమోగుతూ ఉంటాయి. గాయకుడిగానే కాకుండా పీబీ శ్రీనివాస్ కవిగా కూడా ముద్ర వేశారు. ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగడమే కాదు, వాటిలో కవిత్వాలు రాయగలిగిన పండితుడు. మార్దవానికి మారుపేరైన శ్రీనివాస్ జయంతి నేడు . ఈసందర్భంగా ఆయనకి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.