ఆయనొక ప్రయోగ శాల. మాటల్లేని సినిమా తీసి కాసులు కురిపించగలరు. మరుగుజ్జును హీరోను చేసి యాక్షన్ సినిమానే తలపించగలరు. నలుగురు హీరోలతో నవ్వులు వండి వార్చి వడ్డించగలరు. కాలు పొగొట్టుకొన్న నర్తకీమణిని.. వెండితెరపై మహరాణిని చేయగలరు. మరిచిపోయిన జానపద , పౌరాణిక చిత్రాల్ని  మళ్ళీ ప్రేక్షకుల కళ్ళముందు నిలిపి అద్భుతాలు చేయగలరు. చారిత్రక ఘట్టాల్ని టైమ్ మెషీన్ లో సందర్శింప చేయగలరు. ఆయన పేరు సింగీతం శ్రీనివాసరావు. కె.వి.రెడ్డి స్కూల్ నుంచి రావడం వల్ల అప్పటి , ఇప్పటి టెక్నాలజీని బ్యాలెన్స్ చేసుకొని అప్డేట్ అవ్వగల దర్శక మేథావి.

నీతినిజాయితీ సినిమాతో తెలుగులో దర్శకుడిగా రంగ ప్రవేశం చేసిన సింగీతం శ్రీనివాసరావు .. ‘పంతులమ్మ’, ‘జమిందారుగారి అమ్మాయి’, ‘రామచిలుక’, ‘పిల్ల జమిందారు’, ‘గమ్మత్తుగూఢచారులు’, ‘సుగుణసుందరి’, ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’, ‘బృందావనం’, ‘మైకేల్‌ మదన కామరాజు’, ‘అమవాస్య చంద్రుడు’ లాంటి అద్భుత చిత్రాలు తెరకెక్కించారు. అయితే ‘పుష్పక విమానం’ అనే మాటలు లేని చిత్రం ఆయన తీస్తున్నప్పుడు విమర్శలు వినిపించాయి. ‘‘ఎప్పుడో, శబ్దంలేని రోజుల్లో మూకీ చిత్రాలు వచ్చాయి. తర్వాత శబ్దం వచ్చింది. అన్నీ పాటలు, మాటలు గల చిత్రాలే. ఇప్పుడెందుకు ఈ మాటలు లేని సినిమా? ఎవరు చూస్తారు? మాటలు పాటలూ ఉండే సినిమాలే అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. ఈ మూకీ ఎవరు చూస్తారు?’’ అని విమర్శించిన వారి నోళ్ళు మూయించింది పుష్పక విమానం.  ఇదొక ప్రయోగం, ఇందెంత కష్టం? అన్నీ మాట్లాడ్డానికి అవకాశం లేని సన్నివేశాలే! ఆయన ‘యానిమేషన్‌’ సినిమా కూడా తీశారు. ‘ఘటోత్కచ్‌’, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వచ్చింది. ఇదొక ప్రయోగం. ఆయన తీసిన సినిమాల్లో పురాణాలు, జానపదాలు, సాంఘికాలు అన్ని వున్నాయి. అందుకే అందరి దర్శకుల మీదా పడినట్టు శ్రీనివాసరావు మీద ‘ఇలాంటి చిత్రాలకే శ్రీనివాసరావు అన్న ముద్ర పడలేదు. తమిళ, కన్నడ భాషల్లోనూ తీశారు. కన్నడ చిత్రాలకు సంగీతం చేశారు. ఆయనకు సంగీతం తెలియడం వల్ల ఆయన అన్ని చిత్రాల్లోనూ మంచి పాటలు వినిపించాయి. నేడు సింగీతం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!