కృషి, దీక్షా ,పట్టుదల , క్రమశిక్షణ, సమయపాలన.. ఇవన్నీ ఒకే మనిషిగా రూపు దాలిస్తే అక్కినేని నాగేశ్వరరావు. అలవాట్లు, అభిరుచులు, బలహీనతలు, లోపాలు, దోషాలు అన్నిటినీ అదుపులో ఫెట్టుకొని తనని తాను మనిషిగా మలచుకొని.. ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదిగిన శక్తి ఆయన.
వెండితెరమీద ఒకో పాత్ర పోషిస్తూ.. ఎప్పటికప్పుడు నటనలో మెరుగులు దిద్దుకుంటూ.. ప్రతీ సినిమానూ ఒక యాగంగా తలపెట్టిన నట మహర్షి ఆయన. ఆయన పోషించని పాత్రలేదు.. ధరించని వేషంలేదు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాలెన్నో ఆయన నటనకు కొలమానంగా నిలిచాయి. కలం పట్టుకొని కాళిదాసు పాత్రను ఎంత శ్రద్ధగా పోషించి మెప్పించారో.. గ్లాస్ పట్టుకొని దేవదాసు పాత్రనూ ఆయన అంతే ప్రతిభావంతంగా ధరించి శభాష్ అనిపించుకున్నారు.
85 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో బహుదూరపు బాటసారి అక్కినేని. నటనలో 75 ఏళ్ల వజ్రోత్సవాలు జరుపుకున్న అతికొద్ది మంది నటుల్లో ఆయన ఒకరు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో అక్కినేని ఓ శకం. ప్రయోగాలు చేయడానికి ఏనాడూ వెనకడుగు వేయలేదు. సాహసమే ఊపిరిగా ప్రతి అడుగు ముందుకేసారు అక్కినేని. గొప్ప వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో కొలువై.. ఆరాధ్య కథానాయకుడయ్యారు. విమర్శలు ఎదురైన ప్రతీసారి పనితోనే సమాధానమిచ్చారు అక్కినేని. తనకెదురైన ప్రతీ సవాల్‌ను స్వీకరించారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్నే సృష్టించుకున్నారు. తనకంటూ ప్రత్యేకమైన ఓ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. అందుకే ఏఎన్నార్ కు ఏఎన్నారే సాటి. తెలుగు తెరకు స్టెప్పులు పరిచయం చేసిన కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావ్. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలిరావడంలో అక్కినేనిదే ప్రధానపాత్ర. ఎంతో కష్టపడి.. ఎన్నో ఆటంకాలకొడ్డి అన్నపూర్ణ స్టూడియోను హైద రాబాద్‌లో నిర్మించారు అక్కినేని. ఇండస్ట్రీ హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడానికి కారకుడు అక్కినేని. అన్నపూర్ణ స్టూడియోతో తెలుగు చలన చిత్రపరిశ్రమను నిర్మించిన ఘనత ఆయనది.
నేడు అక్కినేని జయంతి . ఈ సందర్భంగా ఆ నటశిఖరానికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.